జనసేనకు డబుల్ ఢమాకా ?
అంటే 21కి 21 సీట్లూ గెలిస్తే చాలు ఏపీ రాజకీయాన్ని ఈ బలంతో పూర్తిగా మార్చవచ్చు అన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 19 May 2024 3:30 PM GMTఏపీలో కేవలం 21 సీట్లకు మాత్రమే పరిమితం అయి పోటీ చేస్తున్న జనసేన అసలు లక్ష్యం ఏమిటో పార్టీ మీటింగులలో అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పేశారు. తీసుకున్నవి ఎంత అని కాదు అవి నూరు శాతం గెలవాలి. అంటే 21కి 21 సీట్లూ గెలిస్తే చాలు ఏపీ రాజకీయాన్ని ఈ బలంతో పూర్తిగా మార్చవచ్చు అన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.
అందుకే పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న సీట్లలో కూడా బలమైన అభ్యర్ధులనే నిలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారు అన్న ఆరోపణలను సైతం ఆయన పట్టించుకోలేదు. బలంగా ఉంటూ గెలుపు గుర్రాలు అయితే చాలు వారికే టికెట్లు ఇచ్చారు. అలా పవన్ తన పార్టీ మొత్తానికి మొత్తం సీట్లు గెలవాలి, ఈ విజయంతో రేపటి ఏపీ రాజకీయాన్ని శాసించాలి అని తలపోశారు.
ఇక ఎన్నికలు అయిపోయాయి. ఇపుడు రకరకాలైన విశ్లేషణలు వస్తున్నాయి. ఏపీలో ఎవరిది అధికారం అన్నది ఒక వైపు హాట్ హాట్ చర్చగా ఉంటూనే మరో వైపు జనసేన పరిస్థితి ఏమిటి అన్న దాని మీద కూడా విపరీతమైన చర్చ సాగుతోంది. 2024 ఎన్నికలకు ఒక విశేషం ఉంది. రెండు ప్రాంతీయ పార్టీలకు తోడుగా మూడవ పార్టీగా జనసేన కూడా బలంగా కాలూనుకుని అసెంబ్లీలోకి అడుగుపెడుతుంది అని ఆ పార్టీ నేతలు గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో అలా జరగాలీ అంటే జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కూడా ముందుగా వచ్చే ప్రశ్న. దాని మీద రకరకాలైన విశ్లేషణలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. అయితే జనసేన పార్టీ వర్గాలు వారికి ఉన్న అంచనాలు అన్నీ చూసుకుంటే కనుక ఈసారి జనసేన డబుల్ ఢమాకా కొట్టబోతోంది అన్నది ఒక ధీమాగా ఉంది అంటున్నారు.
అంటే జనసేన డబుల్ డిజిట్ సీట్లను సాధించోబోతోంది అని అంటున్నారు. జనసేన మొత్తం పోటీ చేసే సీట్లలో కనీసంగా చూస్తే పది నుంచి పన్నెండు సీట్లను డ్యాం ష్యూర్ గా కైవశం చేసుకుంటారు అని తేలింది అని అంటున్నారు. అంటే మొత్తం 21 సీట్లలో ఆరు నూరు అయినా ఈ సీట్లు మాత్రం జనసేనకు పోవు అని అంటున్నారు.
అదే సమయంలో సైలెంట్ వేవ్ అన్నది బలంగా కూటమి వైపుగా వీస్తే మాత్రం 21 సీట్లలో గరిష్టంగా 18 దాకా కూడా సాధించే వీలు ఉందని అంటున్నారు. ఈ లెక్క పక్కా అని చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే ఈ నంబర్ జనసేనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేదే 2019 ఎన్నికల్లో ఎంతో ఉత్సాహం చూపించి జనసేన రంగంలోకి దిగితే కేవలం ఒకే ఒక సీటు తప్ప అన్నీ ఓటమి పాలు అయింది. ఆఖరుకు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు.
అందుకే ఈసారి ఒంటరిగా వెళ్ళకుండా పొత్తులు కలిపారు. బీజేపీని కూడా కూటమిలో చేర్చడంతో పవన్ ముఖ్య పాత్ర పోషించారు. దాంతో ఈసారి కనుక పది నుంచి పన్నెండు సీట్లు జనసేనకు వచ్చినా ఏపీ రాజకీయాల్లో మూడవ పక్షంగా ఆ పార్టీ కుదురుకోవడానికి ఇది బలమైన పునాదిగా మారుతుంది అని అంటున్నారు.
అంతే కాదు రేపటి రోజున హోరా హోరీ పోరులో టీడీపీకి సోలోగా 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దక్కపోతే ఈ పన్నెండు సీట్లే తులాభారం గా మారుతాయని అంటున్నారు. అపుడు జనసేన అసలైన రాజకీయం కూడా స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. కర్నాటకలోని జేడీఎస్ మాదిరిగా అలాగే కుమారస్వామి మాదిరిగా కనీసం ఒక ఏడాది అయినా పవన్ కళ్యాణ్ సీఎం గా అయ్యేందుకు కూటమి నుంచి క్లెయిం చేసే చాన్స్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు.
అందుకే ఎందరు సొంత పార్టీలో వ్యతిరేకించినా మరెందరు విశ్లేషణలు రాసినా పవన్ మాత్రం ఎక్కడా చలించకుండా పక్కా వ్యూహంతోనే పొత్తు వైపుగా అడుగులు వేశారు. వాటి ఫలితాలు ఇపుడు కళ్ళకు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ ఎన్నికలు జనసేనకు సరికొత్త మలుపు అని అంటున్నారు.
డబుల్ నంబర్ సాధిస్తే చాలు 2029 నాటికి ఏపీలో అధికారం దిశగా జనసేన వేగంగా అడుగులు వేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నది జనసేన వ్యూహకర్తల అంచనా. మొత్తానికి 2024 ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. అంతా అనుకున్నట్లుగా సాగితే ఏపీలో జనసేన జాతర మొదలవుతుందని రెండు పార్టీల వ్యవస్థ నుంచి మూడవ పార్టీ దిశగా ఏపీ రాజకీయాన్ని డ్రైవ్ చేసే శక్తి తప్పకుండా పవన్ కి ఈ ఫలితాలు అందిస్తాయని జనసేనలో అంతా గాఢంగా నమ్ముతున్నారు.