Begin typing your search above and press return to search.

సమ్ థింగ్ స్పెషల్: ఏపీ పవర్ పై భిన్న స్వరాలు.. పవన్ గెలుపుపై ఒకటేమాట

కేంద్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇండియా గ్రూప్ నకు వచ్చే సీట్ల లెక్క మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది

By:  Tupaki Desk   |   2 Jun 2024 4:36 AM GMT
సమ్ థింగ్ స్పెషల్: ఏపీ పవర్ పై భిన్న స్వరాలు.. పవన్ గెలుపుపై ఒకటేమాట
X

తెలుగువాళ్లంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కేంద్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇండియా గ్రూప్ నకు వచ్చే సీట్ల లెక్క మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఎన్నికల వేళ వినిపించిన లెక్కలకు.. ఎగ్జిట్ పోల్స్ లెక్కల మధ్య ఉన్న వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థ ఏదైనా సరే.. ఎన్డీయే కూటమికి అధికారం ఖాయమని.. 350 సీట్లకు పైనే తప్పించి.. తక్కువ కాదన్న విషయాన్ని చెప్పేయటం కనిపించింది. బీజేపీ లక్ష్యమైన 400 ప్లస్ సీట్ల మాటను చెప్పింది లేదు.

మొత్తంగా కేంద్రంలో మరోసారి ఎన్డీయే సర్కారు కొలువు తీరనుందని.. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తేలిపోయింది. దీంతో.. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు మీద భిన్నాభిప్రాయాలు వెల్లడి కాలేదు. కట్ చేస్తే.. హైఓల్టేజ్ ఎన్నికలుగా చెబుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాత్రం ఇందుకు విరుద్ధమైన రీతిలో వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ నిట్టనిలువుగా చీలినట్లు కనిపించింది.

కొన్ని సంస్థలు అధికార వైసీపీకి అధికారం ఖాయమన్న రీతిలో తమ ఎగ్జిట్ ఫలితాల్ని వెల్లడిస్తే.. అదే స్థాయిలో టీడీపీ.. జనసేన.. బీజేపీ కూటమిదే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ తమ అంచనాల్ని వెల్లడించాయి. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఏపీ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే అధికారంలోకి వచ్చే ఏ పార్టీకైనా సరే.. 130 సీట్లు దాటవని చెప్పేశాయి. ఈ విషయంలో కూసింత ఏకాభిప్రాయం వ్యక్తమైంది. చాలా తక్కువ సంస్థలు మాత్రం తాము అంచనా వేసిన పార్టీకి 150 సీట్లు వస్తాయని చెప్పటం కనిపించింది.

పరస్పర విరుద్ధ అంచనాల్ని వెల్లడించిన ఏపీ ఎగ్జిట్ పోల్స్ లో ఒకే ఒక్క సారూప్యత కనిపించింది. అది.. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్న విషయాన్ని స్పష్టం చేశాయి. 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసిన పవన్.. రెండు చోట్ల ఓడిపోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా ఈసారి ఘన విజయాన్ని సాధిస్తారని స్పష్టం చేశాయి. ఏపీ ఫలితాలపై వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో పవన్ గెలుపు మీద మాత్రం ఒకటే మాటగా కనిపించింది. ఎవరు అధికారంలోకి వస్తారన్న దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో.. పవన్ గెలుపు మీదా అంతే ప్రాధాన్యత ఇవ్వటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.