పవన్ నోట 175 మాట ...జగన్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు
వై నాట్ 175 అన్న మాట మీద పూర్తి పేటేంట్ వైసీపీదే. గత రెండేళ్ళుగా అదే పనిగా దానినే ఊదరగొడుతూ వైసీపీ చేయాల్సినదంతా చేసుకుంది
By: Tupaki Desk | 4 Jun 2024 3:08 PM GMTవై నాట్ 175 అన్న మాట మీద పూర్తి పేటేంట్ వైసీపీదే. గత రెండేళ్ళుగా అదే పనిగా దానినే ఊదరగొడుతూ వైసీపీ చేయాల్సినదంతా చేసుకుంది. అలా 175 ని ఇపుడు మరచిపోయేలా ప్రజలు ఒక దారుణమైన తీర్పుని ఇచ్చేశారు. పట్టు మంది పది సీట్లు అన్నట్లుగా విదిలించేశారు.
ఎక్కడ 151 సీట్లు ఎక్కడ 10 సీట్లు వైసీపీకి ఇది పూర్తి డైలమాగా ఉంది. వైసీపీ సంగతి అలా ఉంటే పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గెలిచింది 21 అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లు అయినా ప్రజలు తనకు పెద్ద బాధ్యత ఇచ్చారు అని అన్నారు.
ఆ పెద్ద బాధ్యత ఏమిటి అంటే మొత్తం 175 సీట్లను గెలిచినంతగా అని అన్నారు. దాని అర్ధమేంటి అంటే మొత్తం రాష్ట్రం బాధ్యత చూసుకోమని ప్రజలు చెప్పారు అని పవన్ అన్నారు. ఇదిలా ఉంటే పవన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జూన్ 4న చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు.
తాము ప్రజలకు ఏమి చెప్పి అధికారంలోకి వచ్చామో వాటిని కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారుగా ఉంటుందని అయిదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని నిర్మిస్తుందని ఆయన అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ని తాము ఇబ్బంది పెట్టబోమని పవన్ అన్నారు. జగన్ తనకు వ్యక్తిగతంగా శత్రువు కారని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది వారి కష్టాలు తీర్చడానికి మంచి చేయడానికి అని ఆయన అంటూ ఆ విషయం మీదనే తాము దృష్టి పెడతామని అన్నారు.
అంతే కాదు తమ పార్టీ క్యాడర్ కూడా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడని ఆయన హితవు పలికారు. తాను ఆంధ్రాలో ప్రతీ ఊరూ చూశానని, ప్రజల కష్టం తనకు తెలుసు అని ఆయన అన్నారు. తాను 2019లో ఓడిపోయాక కూడా ప్రజల కోసం నిలబడ్డానని, అలాంటిది తనను గుండెలలో పెట్టుకుని గెలిపించిన ప్రజలకు ఏ మాత్రం ఆలోచించకుండా పనిచేస్తామని ఆయన అన్నారు. రానున్న అయిదేళ్ళ కాలమంతా ప్రజల కోసం పనిచేయడమే తమ అజెండా అని పవన్ స్పష్టం చేశారు.