విశాఖ వైపు దేశం చూసేలా పవన్ చేస్తారట...?
పవన్ కళ్యాణ్ మూడవ విడత వారాహి రధయాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
By: Tupaki Desk | 9 Aug 2023 1:30 AM GMTపవన్ కళ్యాణ్ మూడవ విడత వారాహి రధయాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 10వ తేదీ నుంచి 19 దాకా ఏకంగా పది రోజుల పాటు నాన్ స్టాప్ గా పవన్ యాత్ర విశాఖలో సాగనుంది. ఈ యాత్ర సక్సెస్ కావడానికి జనసేన కమిటీలను వేసింది. సీనియర్ నేతలకు కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ విశాఖ వచ్చి పార్టీ నేతలకు సూచనలు ఇచ్చి వెళ్లారు.
పదవ తేదీన బహిరంగ సభతో పవన్ విశాఖలో జనసేన్ శంఖారావం పూరిస్తారు అని అంటున్నారు. విశాఖలో పవన్ చేసే వారాహి యాత్రను దేశమంతా తిలకిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ చేసే రీ సౌండింగ్ కి దేశంలో అంతా చర్చించుకుంటారు అని అంటున్నారు. ఇక నేషనల్ మీడియా కవరేజి కి సైతం జనసేన ప్రయత్నం చేస్తోంది అని అంటున్నారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలలో పవన్ జరిపిన వారాహి రెండవ దశ యాత్ర నేషనల్ మీడియాను అట్రాక్ట్ చేసింది. నాడు పవన్ వాలంటీర్ల వ్యవస్థ మీద చేసిన కామెంట్స్ తో ఒక్కసారి నేషనల్ మీడియాలో చర్చకు దారి తీసింది. వేలాది మంది మహిళలు ఏపీలో మిస్ అవుతున్నారంటూ ఆయన చేసిన హాటెస్ట్ కామెంట్స్ నేషనల్ మీడియాలో బిగ్ డిబేట్ కి కారణం అయ్యాయి.
ఆ తరువాత పవన్ నేషనల్ లెవెల్ లో మీడియాలో నానుతూ వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి ప్రతినిధిగా వెళ్ళిన ఏకైన పార్టీ జనసేన అధినేతగా పవన్ నేషనల్ మీడియా కంట్లో పడ్డారు. మూడు రోజుల పాటు పవన్ ఢిల్లీలో ఉన్నారు. జాతీయ మీడియాను సైతం ఆయన కవర్ చేశారు. పొత్తులు ఏపీ రాజకీయాల మీద చెబుతూ జనసేన 2024లో ప్లే చేయబోయే రోల్ ని ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే నేషనల్ మీడియాలో ఫోకస్ అయ్యారు. పవన్ విశాఖలో వారాహి యాత్ర చేపట్టబోతున్నారు. దాంతో ఆ టెంపోని కంటిన్యూ చేయడానికి నేషనల్ మీడియా కవరేజ్ కోసం జనసేన ప్రయత్నిస్తోంది అని అంటున్నారు. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ నాయకులకు జనసేన సత్తా తెలియచెప్పాలన్న ఉద్దేశ్యంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఏపీలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా జనసేన ఉంటుంది అన్నది కళ్ళకు కట్టినట్లుగా చూపించాలన్న తాపత్రయం కూడా ఉంది అని అంటున్నారు.
దాంతో జనసేన నేతలు ఈసారి పవన్ వారాహి యాత్ర జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేస్తుంది అని ప్రకటిస్తున్నారు. దీని మీద సీనియర్ మంత్రి ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చర్చ జరగడం అంటే ఏమిటి అని జనసేన నేతలను ప్రశ్నించారు. చంద్రబాబు పుంగనూరులో చేసిన ఘర్షణ లాంటివి చేస్తారా అని ఎదురు ప్రశ్నలు వేశారు. సరే బొత్స ఎలా కామెంట్స్ చేసినా జనసేన ఒక వ్యూహం ప్రకారం వారాహి యాత్రను పవన్ ఇమేజ్ పెరిగేలా ఆయన ప్రజాదరణను నేషనల్ లెవెల్ లో ఫోకస్ చేయాలని చూస్తోంది. దాంతో విశాఖ వారాహి యాత్ర మీద ఇపుడు అందరి చూపూ పడుతోంది.