ఎవరి కళ్లలో ఆనందం కోసం.. యజ్ఞోపవీతం తెంచారు: పవన్ ఫైర్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మంగళవారం జరిగిన తీవ్ర ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు
By: Tupaki Desk | 9 Aug 2023 3:32 PM GMTఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సోమేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం జరిగిన తీవ్ర ఘటనపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ``ఎవరి కళ్లలో ఆనందం కోసం.. అర్చకుడి మెడలో ఉన్న జంధ్యాన్ని తెంచేశారు`` అని పవన్ నిలదీశారు. అర్చకుడిపై దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తెంచేయడం పాలకవర్గ అహంభావం, దాష్టీకానికి ప్రతీక అని పవన్ వ్యాఖ్యానించారు. ఇది సనాతన హిందూ ధర్మంపై జరిగిన దాడిగా భావిస్తున్నట్టు తెలిపారు. దీనిని అందరూ ఖండించాలని పవన్ కోరారు.
‘‘వైదిక ఆచారాల్లో యజ్ఞోపవీతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తాం. వేదాలు చదివి భగవంతుని సేవలో ఉండే అర్చకులపై దాడి చేయడం.. వారిని ఇబ్బంది పెట్టడం రాక్షసత్వమే. ప్రశాంతంగా, పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగణాల్లో అహంకారం, అధికార దర్పం చూపడం క్షమార్హం కాదు. అన్నవరంలో పురోహితులను వేలం వేయాలని అర్థంలేని నిర్ణయం తీసుకున్నారు. జనసేన తీవ్రంగా వ్యతిరేకించేసరికి వెనక్కి తగ్గారు. ఇప్పుడు పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడికి తెగబడ్డారు. హిందూ ఆలయాలు, ఆస్తులపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించే క్రమంలోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది`` అని పవన్ పేర్కొన్నారు.
అంతేకాదు.. పూజారిపై జరిగిన దాడిని స్థానిక వైసీపీ నేత చేసిన దాడిగా సరిపుచ్చలేమన్నారు. యథానాయకుడు.. తథా అనుచరుడు అనే విధంగా తయారయ్యారని పరోక్షంగా సీఎంపై పవన్ విరుచుకుపడ్డారు. ``ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచేశారో ఆ పరమేశ్వరుడికే తెలియాలి`` అని వ్యాఖ్యానించారు.
ఏం జరిగిందంటే..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న సోమేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం దేవునికి హారతి ఇస్తున్న క్రమంలో.. అడ్డుగా ఉన్న వైసీపీ నాయకుడు, ఆలయబోర్డుచైర్మన్ భర్త యుగంధర్‌ను ఓ పురోహితుడు పక్కకు జరగండి అని సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యుగంధర్.. అర్చకుడిని దుర్భాషలాడుతూ.. భౌతిక దాడికి దిగారు. ఈ క్రమంలో ఆయన మెడలోని జంధ్యాన్ని తెంచేశారు. ఈ దాడిలో గాయపడిన అర్చకుడిని ఆసుపత్రికి తరలించారు.