పవన్ కళ్యాణ్ క్విడ్ ప్రోకో చేస్తున్నాడా...?
జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వ్యూహాలు లేని వారని, అమాయకుడని అనుకుంటే వారు పప్పులో కాలేసినట్లే.
By: Tupaki Desk | 5 Oct 2023 11:30 PM GMTజనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వ్యూహాలు లేని వారని, అమాయకుడని అనుకుంటే వారు పప్పులో కాలేసినట్లే. నిజం చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి వ్యూహాలు లేక ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో డెబ్బై లక్షల ఓట్లు తెచ్చుకుని 18 సీట్లు తెచ్చుకున్న పార్టీని నడిపించకుండా చిరంజీవి క్లోజ్ చేస్తే ఒక ఎన్నికల్లో అసలు పోటీయే చేయకుండా అయిదేళ్ల పాటు అధికార రాజకీయాలలో పవన్ ఉన్నారు.
ఆ తరువాత 2019 ఎన్నికల్లో పార్టీని పోటీకి నిలిపి రెండు చోట్ల ఓడినా తనదైన రాజకీయాన్ని ఆయన ఏపీలో చూపిస్తున్నారు. ఈ రోజున ఏపీలో బలమైన వైసీపీ టీడీపీ జనసేన గురించి ఆలోచించేలా చేసుకున్నారు. ఎటూ జాతీయ పార్టీ బీజేపీ జనసేనతోనే ఉంది. ఆ పార్టీ కోసమే అంటూ తన నుంచి దూరం కాకుండా చేసుకోవడానికి చూస్తోంది.
ఇలా పవన్ తెలివైన రాజకీయమే చేస్తున్నారు అని అంటున్నారు. ఇక జనసేన ఏపీ మీదనే ఫోకస్ పెట్టింది. తెలంగాణాలో యాక్టివిటీ అయితే ఎక్కడా పెద్దగా లేదు అనే చెప్పాలి. ఈ నేపధ్యంలో పవన్ సడెన్ గా తెలంగాణాలో 32 చోట్ల జనసేన అభ్యర్ధులను నిలబెట్టాలని చూడడం మీద పెద్ద చర్చ సాగుతోంది.
పవన్ రాజకీయం ఏపీలో ఒకలా తెలంగాణాలో మరోలా ఉంది అని అంటున్నారు. ఏపీలో తాను ఎమ్మెల్యేగా గెలవడం కోసం టీడీపీని సపోర్ట్ చేస్తూ వస్తున్న పవన్ తెలంగాణాలో మాత్రం ఒంటరి పోరుకే తెర తీస్తున్నారు. నిజానికి తెలంగాణాలో చూస్తే చంద్రబాబు అరెస్ట్ తరువాత సెటిలర్స్ కాంగ్రెస్ కే ఓటు వేయాలని డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
సరిగ్గా సెటిలర్స్ ఎక్కువగా ఉన్న చోటనే పోటీ అంటూ పవన్ తన పార్టీ అభ్యర్ధులను నిలబెట్టడం ద్వారా ప్రభుత్వ ఓట్ల చీలికకు చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఆ విధంగా కాంగ్రెస్ కి పడాల్సిన ఓట్లు చీల్చడం ద్వారా బీయారెస్ ఎన్నికల్లో భారీగా లబ్ది పొందేలా చూస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ కి పడకుండా చీలిపోతే మాత్రం అది బీయారెస్ కి భారీగా రాజకీయ లబ్దిని చేకూరుస్తుందని అంటున్నారు. తద్వారా బీయారెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేలా వాతావరణం ఏర్పడుతుంది అని అంటున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాకూడదు అని బీయారెస్ చూస్తూంటే తెలంగాణాలో జనసేన పోటీకి పెట్టడం ద్వారా బీయారెస్ కి మేలు జరిగే విధంగా చేస్తున్నారా అని అంటున్నారు.
ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో గా అభివర్ణిస్తున్నారు. నిజానికి చూస్తే ఆదిలో అంత లౌక్యం లేక కేసీయార్ మీద పవన్ నోరు చేసుకున్నా ఆ మీదట బీయారెస్ తో చెలిమి చేయడం మొదలెట్టారు. ఏ రోజూ ఆ పార్టీని విమర్శించిన దాఖలాలు అయితే పవన్ నుంచి లేవు. ఇక మంత్రి కేటీయార్ కూడా పవన్ తనకు మిత్రుడు అని చెబుతూ ఉంటారు.
మరో వైపు చూస్తే ఆ మధ్యన తుఫాన్ వల్ల ఇబ్బందులు వస్తే పవన్ స్వయంగా కేసీయార్ ప్రభుత్వానికి విరాళం ఇచ్చి ఆర్ధిక సాయం చేశారు. అంతే కాదు కేసీయార్ పాలనా దక్షుడు అంటూ పొగుడుతూ ఉంటారు. ఇన్ని విధాలుగా చూస్తే మాత్రం పవన్ ఇపుడు తన పార్టీ అభ్యర్ధులను నిలబెట్టడం వెనక బీయారెస్ కి మేలు చేసే ఎత్తుగడ ఉందా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.
ఎందుకంటే జనసేనకు ఎక్కడా గెలిచే చాన్స్ అయితే లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకునో లేక బీజేపీని కలుపుకునో ప్రయత్నం చేయవచ్చు. అలా కాకుండా ఆయన సొంతంగా పోటీ అంటున్నారు. మరి ఇది చివరికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి బీయారెస్ కే అంతిమంగా లబ్ది చేకూరుస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.