ఇది ఆడియో ఫంక్షన్ అలవాటా... భయమా పవన్?
By: Tupaki Desk | 24 Feb 2024 3:56 PM GMTటీడీపీ - జనసేనల నేతలు, కార్యకర్తలు ఎంతో కాలంగా ఎదురుచూసిన తరుణం వచ్చింది! మాంచి ముహూర్తం చూసుకున్న చంద్రబాబు – పవన్ లు టీడీపీ తొలి అభ్యర్థుల జాబితా, జనసేన ఫైనల్ నెంబర్ ని ప్రకటించారు! ఇందులో భాగంగా పక్కాగా ప్లాన్ చేసినట్లుగా 94 మంది అభ్యర్థులనూ చంద్రబాబు ప్రకటించారు. సభలకు సెలవు పెట్టి చేసిన కసరత్తులకు న్యాయం చేసినట్లుగా పని కానిచ్చారు!
ఇక పవన్ విషయానికొస్తే... 175 లోనూ 24 మంది అభ్యర్థులతో సరిపెట్టుకున్నారు. నెంబర్ ఆఫ్ సీట్స్ కాదు స్ట్రైక్ రేటు ముఖ్యం అంటూ తనకు మాత్రమే ప్రత్యేకమైన ఒక లాజిక్ వదిలారు! దీంతో... జనసైనికులను ఏమార్చే పని ఇప్పటికీ ఆపలేదా? అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. పోనీ బాబు విదిలించినట్లు చెబుతున్న ఆ 24 స్థానాలలో అభ్యర్థులు ఎవరెవరు అనే విషయం ప్రకటించకపోయినా.. కనీసం ఆ 24 నియోజకవర్గాలు ఏమిటో కూడా పవన్ వెల్లడించకపోవడం గమనార్హం.
ఈ సమయంలో ఆ 24 స్థానాల్లోనూ తెనాలి - నాదెండ్ల మనోహర్, అనకాపల్లి - కొణతాల రామకృష్ణ, రాజానగరం - బత్తుల బలరామకృష్ణుడు, కాకినాడ రూరల్ - పంతం నానాజీ, నెల్లిమర్ల - లోకం మాధవి పోటీ చేస్తారని 5గురి పేర్లు ప్రకటించారు. దీంతో మిగిలిన ఆ 19 స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదా.. లేక, ఆ 19 స్థానాల్లోని అభ్యర్థులపై స్పష్టత లేదా అనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ విషయంలో కూడా బాబుకూ పవన్ కూ ఎంత తేడా అనే విషయం తెరపైకి వచ్చింది. కారణం... చంద్రబాబు ఒకేసారి 94 మంది అభ్యర్థులను ప్రకటించడం వల్ల వారంతా రేపటి నుంచే ఫుల్ కాన్ ఫిడెన్స్ తో నియోజకవర్గంలో పర్యటించ గలుగుతారు.. పనులు చక్కబెట్టుకో గలుగుతారు. కానీ... ఆ అవకాశం జనసేన తరుపున పోటీ చేసే మిగతా 19 మంది అభ్యర్థులకూ పవన్ కలిగించలేకపోయారు!
దీంతో.. పవన్ ఇంతకాలం మంగళగిరి కార్యాలయంలో రాత్రింబవళ్లు ఏం కసరత్తులు చేశారో ఆయనకే తెలియాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదంతా ఒకెత్తు అయితే... కుప్పం, మంగళగిరి నియోజకవర్గాల్లో తాను, తన కుమారుడూ పోటీ చేస్తున్నామంటూ చంద్రబాబు ప్రకటించిన వేళ... పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే నియోజకవర్గం పేరు ఎందుకు ప్రకటించలేదనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ గా ఉంది.
అయితే... ఈ విషయంలో పవన్ తాను పోటీ చేసే స్థానాన్ని కూడా ప్రకటించకపోవడాన్ని రెండు మూడు రకాలుగా విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించడానికి జగన్ ఎంతైనా ఖర్చు పెడతారంటూ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు పవన్! ఈ క్రమంలో జగన్ కి భయపడే ముందుగానే తాను పోటీ చేసే స్థానాన్ని పవన్ ప్రకటించలేదేమో అని అంటున్నారు. మరికొంతమంది... పవన్ దయణీయ స్థితి చూసి జాలేస్తుందని చెబుతున్నారు.
మరోపక్క... సాధారణంగా సినిమా ఆడియో ఫంక్షన్స్ లో వేదికమీదున్న వారిలో ముఖ్యమైన వ్యక్తి (ఆ సినిమా హీరో) లాస్ట్ లో మైకందుకుంటారు. బహుశా ఆ అలవాటులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కాని పవన్ తాను పోటీ చేసే స్థానాన్ని ప్రకటించరా అనే విశ్లేషణలూ తెరపైకి వస్తున్నాయి. ఏది ఏమైనా... అసలు సిసలు రాజకీయాలను పవన్ ఎప్పటికి ఒంటపట్టించుకుంటారో అంటూ పెదవి విరుస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్!!