పవన్ కోసం పిఠాపురంలో 40 మంది పుష్పలు దిగారంట!
ఈ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నాడు జరిగిన సంగతులంటూ కొన్ని విషయాలు చెప్పారు. అనంతరం తనకోసం సీమ నుంచి 40 మంది దిగారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు!
By: Tupaki Desk | 27 April 2024 3:48 AM GMTసార్వత్రిక ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వరుసగా ప్రచార సభల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు పవన్. ఈ సందర్భంగా మలికిపురం సెంటర్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నాడు జరిగిన సంగతులంటూ కొన్ని విషయాలు చెప్పారు. అనంతరం తనకోసం సీమ నుంచి 40 మంది దిగారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు!
అవును... తాజాగా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన పవన్.. మలికిపురంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇందులో భాగంగా తాను భీమ్లా నాయక్ సినిమా విడుదల కోసం ఎవరి కాళ్లూ పట్టుకోవాలనుకోలేదని.. అవసరమైతే యూట్యూబ్ లో ఫ్రీగా వదిలేస్తానని చెప్పినట్లు తెలిపారు.
ఆ మాట ఎందుకన్నానంటే... ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదిలేసుకుంటాం కానీ, దేహీ అని అనము అని పవన్ వెల్లడించారు. కాగా... ఆ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నసంగతి తెలిసిందే!
ఇదే సమయంలో... ఇది 2009 కాదు 2024 అని, ఆ విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలని సూచించిన పవన్ కల్యాణ్... రాజకీయాల్లోకి తెగించి వచ్చినట్లు వెల్లడించారు. సుమారు 40మంది ఎర్రచెందనం స్మగ్లర్లను తన కోసం పిఠాపురం, గోదావరి జిల్లాలో దించారట.. ఒకటే చెబుతున్నా నేను భారతీయుడిని, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తా.. నేను పవన్ కల్యాణ్ ని అని వెల్లడించారు.
ఇదే క్రమంలో... ఉన్నది ఒకటే జీవితం అని.. జగన్ లాంటి వారికి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వారికి లొంగమని వెల్లడించారు పవన్. ఈ సందర్భంగా గతంలో ఢిల్లీలో ఒక కేంద్రమంత్రి వివాహంలో మిథున్ ని కలిసినట్లు చెప్పిన పవన్... ఎవరైనా చిత్తూరు జిల్లా నియోజకవర్గాల్లోకి వచ్చి వేలుపెడితే ఊరుకోమని చెప్పారని.. ఆయన మాత్రం గోదావరి జిల్లాలోకి వచ్చి వేలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.