చంద్రబాబుకే నా మద్దతు... పవన్ సంచలనం
By: Tupaki Desk | 10 Sep 2023 6:19 PM GMTతన మద్దతు టీడీపీ అధినేత చంద్రబాబుకే ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించి సంచలనం రేపారు. జనసేన ఒక రాజకీయ పార్టీగా బాబుకు ఈ క్లిష్ట పరిస్థితులలో మద్దతు ఇస్తుందా లేక పొత్తులతో ముందుకు వెళ్తుందా అన్నది కొంత అయోమయంగా ఉన్నా బాబుకే నా మద్దతు అని బోల్డ్ స్టేట్మెంట్ ని పవన్ ఇవ్వడం విశేషం. బాబుకు ఎప్పటికీ నా మద్దతు అని చెప్పడం ద్వారా జనసేన టీడీపీకి ఫుల్ సపోర్ట్ అని చెప్పకనే చెప్పేశారు అన్న మాట.
ఆయన బాబు అరెస్ట్ అనంతరం రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం వంటి పరిణామాల నేపధ్యంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో కీలకమైన కామెంట్స్ చేశారు. జగన్ మీద అయితే నిప్పులే చెరిగారు. జగన్ ఆధ్వర్యంలో ఏపీలోని వ్యవస్థలు నాశనం అయ్యాయని అన్నారు. జీ 20 సదస్సు ప్రతిష్టాత్మకంగా దేశంలో జరుగుతున వేళ ఒక ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా జగన్ కొత్త రాజకీయానికి తెర తీశారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో రాజకీయం జగన్ వేరే లెవెల్ లోకి తీసుకుని పోతున్నారని, ఈ నేపధ్యంలో విపక్షంగా తాను గట్టిగా నిలబడి పోరాడుతానని పవన్ ప్రకటించారు. ఇక చట్టాల మీద వ్యవస్థల తీరు మీద కూడా పవన్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. చట్టాలు సరిగ్గా పనిచేస్తే బెయిల్ మీద ఉన్న వారు ఎప్పటికీ సీఎం కాలేరని కూడా ఆయన అనడం విశేషం.
మరో వైపు చూస్తే తెలంగాణాలో ప్రజలు జగన్ని తరిమికొట్టారని ఏపీ ప్రజలు కూడా తరిమికొట్టే రోజు తొందరలో వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. తన కంఠంలో ప్రాణం ఉండగా జగన్ మీద పొరాడం ఆపనని తుది శ్వాస వరకూ కొనసాగిస్తూనే ఉంటానని గంభీరమైన ప్రకటనను కూడా పవన్ చేశారు.
ప్రజలు పిరికితనంతో ఉంటున్నారని, అలా ఉండరాదని మరో వైపు ఆయన అసహనం ప్రదర్శించారు. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ మాటలన్నీ కూడా బాబుకు మద్దతు అని చెబుతూనే జగన్ మీద విమర్శలు చేస్తూ పోయారు. చంద్రబాబు అవినీతి కేసుల మీద అయితే ఆయన మాట్లాడకపోవడం గమనార్హం. అదే విధంగా చట్టాలు సరిగ్గా చేయడం లేదని హాట్ కామెంట్స్ చేశారు. ఇవన్నీ చూసినపుడు పవన్ కొంత ఆవేశంతో మరికొంత అసహనంతో ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు.
అయితే పవన్ కామెంట్స్ ని వైసీపీ తిప్పికొడుతోంది. సొంత కుమారుడి కంటే కూడా దత్తపుత్రుడు ఎందుకు బాబు అరెస్ట్ మీద బెంగ పడుతున్నారని మంత్రి గుడివాడ అమరనాధ్ ప్రశ్నించారు పవన్ నడక పడక వేషాలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు.