వాలంటీర్ల మీద పవన్ సంచలన కామెంట్స్
వాలంటీర్ల వ్యవస్థ మీద ఏపీలో ఇంకా హాట్ డిస్కషన్ సాగుతూనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది
By: Tupaki Desk | 1 July 2024 12:30 PM GMTవాలంటీర్ల వ్యవస్థ మీద ఏపీలో ఇంకా హాట్ డిస్కషన్ సాగుతూనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో వాలంటీర్లను దూరంగానే పెట్టి ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు.
వాలంటీర్లు లేకుండానే ఇంత పెద్ద కార్యక్రమం రెండు రోజులలోనే పూర్తి చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైసీపీ నేతలు చాలా ప్రచారం చేసారని ఫైర్ అయ్యారు.
ఇవాళ వాలంటీర్లే లేరు,కానీ పెన్షన్ ఎక్కడైనా ఆగాయా అని ఆయన ప్రశ్నించారు. రెట్టింపైన పెన్షన్ ను కూడా సచివాలయ ఉద్యోగులు వచ్చి ఇళ్ళ వద్దకే నేరుగా లబ్దిదార్లులకు ఇస్తున్నారు అని ఆయన గుర్తు చేశారు. గతంలో వైసీపీ ఏలుబడిలో అయితే ఏకంగా నాలుగైదు రోజుల పాటు పెన్షన్లు ఇచ్చేవారు అని ఆయన అన్నారు. కానీ తమ ప్రభుత్వం హయాంలో రెండు రోజులలోనే మొత్తం నూరు శాతం పెన్షన్లు ఇస్తామని చెప్పారు. అయితే వాలంటీర్లకు ఆల్టరేషన్ గా ఉపాధి ఎలా కల్పించాలి అన్న దాని మీదనే ఆలోచిస్తామని అన్నారు.
ఇక గత ప్రభుత్వం అప్పులు చేసిందని ప్రతీ ఒక్క శాఖలో చూస్తే కనుక లోతులు తెలియడం లేదని పవన్ అన్నారు. ఇంత పెద్ద స్థాయిలో అప్పులు చేసి భారీగా ఆర్థిక నష్టం చేకూర్చారు అని వైసీపీ ప్రభుత్వాన్ని నిందించారు. వీటిని చూసిన తరువాత తాను ఎమ్మెల్యేగా జీతం పుచ్చుకోవడానికి ఇష్టపడటం లేదని అన్నారు.
గతంలో అయితే తాను జీతం తీసుకోవాలని అనుకున్నానని కానీ ఏపీ ఆర్ధిక పరిస్థితి చూసిన మీదట తాను వెనక్కి తగ్గానను అన్నారు. తాను అసెంబ్లీకి వెళ్తే మూడు రోజులకే 35 వేల రూపాయలు వచ్చినట్లుగా అధికారులు చెప్పారని జీతం కోసం సంతకం పెట్టమన్నారని కానీ తానే వద్దు అని అన్నానని ఆయన అన్నారు.
అంతే కాదు క్యాంప్ ఆఫీసులో తన కోసం ఏర్పాట్లు చేస్తామని కొత్త ఫర్నిచర్ కూడా తెస్తామని అన్నారని తాను ఆర్థిక పరిస్థితి చూసి వద్దు అన్నానని తెలిపారు. తన సొంత ఫర్నిచర్ తానే సమకూర్చుకుంటానని చెప్పారు. తాను సినీ నటుడిగా డబ్బు పేరు చాలా చూశానని తనకు ఆ రెండూ అవసరం లేదని పవన్ అన్నారు. ప్రజలకు గట్టి మేలు చేయడానికే తాను శాయశక్తులా కృషి చేస్తాను అని అన్నారు.
అవినీతి అన్న మాట తన నుంచి రాదని ఆయన చెప్పారు. అంతే కాదు ప్రజలకు ఎంతో చేయాలని ఉందని అయితే ఏదీ చిటిక వేస్తే జరగవని వాటిని తొందరగా చేయడానికే తాము చూస్తామని పవన్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన దుబారాకు నిదర్శనం రుషికొండ అని అన్నారు. అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాలా అని ప్రశ్నించారు. ఆ ఆరు వందల కోట్లను వెచ్చిస్తే ఒక జిల్లాను ఎంతో గొప్పగా అభివృద్ధి చేయవచ్చు కదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.