Begin typing your search above and press return to search.

అంతా బాబు మహిమ : పవన్ కి జై అన్న పిఠాపురం వర్మ...!

దాంతో వర్మ మెత్తబడ్డారు అని పొత్తు ధర్మలో భాగంగా జనసేనకు పిఠాపురం సీటుని ఇచ్చారు కాబట్టి పవన్ ని గెలిపించుకుని వస్తామని కూడా హమీ ఇచ్చారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 March 2024 5:40 PM GMT
అంతా బాబు మహిమ : పవన్ కి జై అన్న పిఠాపురం వర్మ...!
X

పిఠాపురం లో టీడీపీ తమ్ముళ్ల రచ్చ కాస్తా టీ కప్పులో తుఫాన్ గా తేలిపోయింది. గురువారం శుక్రవారం ఫైర్ అయి నిప్పులు కురిపించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ శనివారం టీడీపీ అధినేత చంద్రబాబుని కలసిన వెంటనే కూల్ అయిపోయారు. జై పవన్ కళ్యాణ్ అనేశారు. తనలో పవన్ ని చూడాలని తనకు 2014లో ఇచ్చిన భారీ మెజారిటీ పవన్ కి ఇవ్వాలని వర్మ తన అనుచరులకు అభిమానులకు సూచించారు.

ఇదంతా ఎలా సాధ్యపడింది అంటే బాబు మహిమ అని అంటున్నారు. చంద్రబాబు వద్దకు వెళ్తే విముఖుడిని సుముఖుడిగా చేస్తారు. వర్మ సైతం అలాగే కూల్ అయిపోయారు. బాబు ఎంత చెబితే అంత అని అనుకుంటూ మీడియా ముందుకు వచ్చి బాబు పక్కనే నిలబడి నవ్వులు చిందించారు.

ఇంతకీ వైలెంట్ గా ఉన్న వర్మ కాస్తా ఇలా ఎందుకు సైలెంట్ అయ్యారు అంటే అక్కడే ఉంది అసలు కధ అని అంటున్నారు. చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు హామీని వర్మకు ఇచ్చారు అని అంటున్నారు. అది కూడా టీడీపీ గద్దెనెక్కిన వెంటనే వచ్చే తొలి ఖాళీలో తొలి సీటులో వర్మనే కూర్చోబెడతాము అని కూడా భరోసా ఇచ్చారు అని అంటున్నారు.

దాంతో వర్మ మెత్తబడ్డారు అని పొత్తు ధర్మలో భాగంగా జనసేనకు పిఠాపురం సీటుని ఇచ్చారు కాబట్టి పవన్ ని గెలిపించుకుని వస్తామని కూడా హమీ ఇచ్చారని అంటున్నారు. ఇక పవన్ నిర్పూచీగా ఉండవచ్చు. ఎందుకంటే లోకల్ లీడర్ గా స్ట్రాంగ్ గా ఉండే వర్మ ఇపుడు జై పవన్ అంటున్నారు.

ఆయన కనుక ఇలా టర్న్ అయితే పవన్ కనీసం కాలు కూడా కదపకుండా పిఠాపురంలో గెలవవచ్చు అని అంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం అలా ఎలా అని అంటున్నారు. వర్మ చంద్రబాబు పవన్ కలసి ఒక్కటైతే మేము కూడా అలాగే అంటే ఎలా అని అంటున్న వారూ ఉన్నారు.

వర్మ తగ్గవచ్చు, అనుచరులు తగ్గవచ్చు, కానీ ఓటేసే ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరు ఊహించగలరు అని కూడా అంటున్నారు. నాన్ లోకల్ అని నిన్నటిదాకా పవన్ ని విమర్శించి ఇపుడు ఆయనను గెలిపించాలి అంటే జనాలు సరేనంటారా అని కూడా క్వశ్చన్ చేస్తున్న వారు ఉన్నారు.

ప్రజా ప్రతినిధి అంటే ప్రజలకు అందుబాటులో ఉండేవారు కావాలని కోరుకుంటారు అని అందువల్ల ప్రజలు పవన్ నచ్చి ఆయన సిద్ధాంతాలు నచ్చితే ఓటు వేస్తారు తప్ప వర్మ చెప్పారమో మరొకరు చెప్పారనో కానే కాదు అని అంటున్నారు.

ఇక వంగా గీత విషయం తీసుకుంటే ఆమె ఇప్పటిదాకా ఓటమి ఎరగని నేతగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి పార్లమెంట్ దాకా గెలుస్తూ వస్తున్నారని గ్రౌండ్ లెవెల్ లో పట్టున్న నేత అని అంటున్నారు. మొత్తానికి వర్మ జై కొట్టారు కాబట్టి కూటమి వరకూ ఓకే ఇక జనం తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.