పిఠాపురం ...పవన్ ని టెన్షన్ పెట్టే శక్తులు...!?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ఆలోచించి మరీ ఎన్నికల ప్రకటనకు నలభై ఎనిమిది గంటల ముందు తన నిర్ణయం ప్రకటించారు
By: Tupaki Desk | 15 March 2024 4:30 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ఆలోచించి మరీ ఎన్నికల ప్రకటనకు నలభై ఎనిమిది గంటల ముందు తన నిర్ణయం ప్రకటించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ చేసిన ఈ ప్రకటనతో పిఠాపురం టోటల్ గా జనసేనానికి నీరాజనం పలుకుతుంది అని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అక్కడ కాపులు హెచ్చు సంఖ్యలో ఉండవచ్చు.
కానీ లోకల్ ఫ్యాక్టర్ బలంగా పనిచేస్తుంది. దాంతో పాటు పవన్ వ్యూహం అనుకున్నది ఇపుడు బూమరాంగ్ అవుతోంది అని అంటున్నారు. పవన్ కనీసం ఆరేడు నెలల నుంచి పిఠాపురం తన సీటు అని చెప్పి ఉంటే ఆ లెక్క వేరేగా ఉండేది. కానీ రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తూండగా పవన్ ఈ రోజు ప్రకటన చేయడం వల్ల కేవలం ఎన్నికల కోసం అక్కడికి వస్తున్నారు అని అంతా అనుకుంటున్నారు.
ఇక పవన్ అంతా నావాళ్ళే అనుకున్నా ఆయన్ని నాన్ లోకల్ గానే చూస్తున్నారు. పైగా ఆయన సెలిబ్రిటీ. ఒకసారి గెలిచిన తరువాత అందుబాటులో ఉండకపోతే అపుడు పరిస్థితి ఏంటి అన్నది కూడా జనంలో చర్చకు వచ్చే విషయం. ఇక సామాజికవర్గం పరంగా వర్మకు పిఠాపురంలో చాన్స్ ఉండకూడదు.
ఇక్కడే చిత్రం ఏంటి అనే వర్మ అన్ని వర్గాల వారిని తనతో కలుపుకున్నారు. ఆయన అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా పనిచేసి జనం మన్ననలు అందుకున్నారు. దాంతో ఆయనకు కాపులతో సహా అందరి మద్దతు ఉంది అని అంటున్నారు. మొత్తం ఓటరల్లో మూడవ వంతు అంటే 90 వేల మంది కాపులు ఉన్నా కూడా మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఇక్కడ గణనీయంగా ఉంటాయి.
ముఖ్యంగా బీసీలు ఉన్నారు. మాలలు 12 శాతం, శెట్టి బలిజలు, చేనేతలు బెస్తలు సుమారు 10 శాతం చొప్పున ఉన్నారు. ఆ తర్వాత స్థాయిలో రెడ్డి, యాదవ తూర్పు, తూర్పు కాపులు , మాదిగలు గణనీయ స్థాయిలో ఉన్నారు. ఇలా లెక్క చూసుకుంటే కనుక విజయావకాశాలకు ఎవరైనా కూడా అన్ని వర్గాల మద్దతు పొందాల్సిందే అని అంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే వర్మకు టికెట్ ఇవ్వలేదని ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అటు చంద్రబాబుని ఇటు పవన్ ని నానా మాటలు అన్నారు.
అయితే పవన్ కి మద్దతుగా జనసేన నుంచి ఏవరూ మాట్లాడకపోవడం ఏమిటి అన్న చర్చ వస్తోంది. ఈ పాయింట్ ఎత్తిన వారు విజయవాడ పశ్చిమ జనసేన నేత పోతిన మహేష్. పవన్ ని దూషించినా జనసేన నాయకుల నుండి సరైన తీరులో స్పందన లేకపోవడం ఒక ఎత్తు అయితే చంద్రబాబు వర్మను పిలిచినా ఆయన తాను శనివారం వచ్చి కలుస్తాను అని చెప్పడం ఆ వెంటనే తన మద్దతుదారులతో మీటింగ్ పెట్టుకోవడం మరో కీలక పరిణామం.
ఇక వర్గంకు అండగా నిలిచిన వారు అంతా కూడా 2014ని రిపీట్ చేయమని కోరుతున్నారు. ఈసారి ట్రయాంగిల్ జరుగుతుందని కచ్చితంగా వర్మకు వచ్చే ఓట్లతో ఆయన విజేతగా నిలుస్తారు అని కూడా వారు చెబుతున్నారు. దాని మీద ఆలోచించేలా వర్మ ఉన్నారు. అదే కనుక జరిగితే వర్మ చంద్రబాబుని కలవడం జరగదు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే వైసీపీ రాజమండ్రి ఎంపీ భరత్ చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. టీడీపీ రెబెల్ ని నిలబెట్టి పవన్ ని ఓడిస్తుందని ఈ విషయంలో జనసేన క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి వాటిని లైట్ గా తీసుకోవచ్చు. సీరియస్ గా తీసుకోవచ్చు. రాజకీయాల్లో లేనిదే నమ్మకం, ఉన్నదే వ్యూహం. అందువల్ల పవన్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు.
ఇక ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వైసీపీకి కలసి వచ్చే అంశమే అని అంటున్నారు. దాంతో పాటు వంగా గీతకు కూడా అక్కడ సొంత ఇమేజ్ పలుకుబడి ఉన్నాయి. దీంతో పవన్ కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే మొత్తం ప్రచారాన్ని చూసుకుంటూనే అక్కడే ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. పిఠాపురం ఇపుడు క్యాట్ వాక్ కాదు, అంతే కాదు అది ఈజీ కాదు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే పవన్ కి ఇంటా బయటా ప్రత్యర్ధులు తెలియని రూపంలో ఉన్నారని విశ్లేషణలు కూడా ఉన్నాయి. రాజకీయాలు అంటే త్యాగాలు కాదని అదే విధంగా ఏకపక్ష ద్వేషాలు కాదని కూడా జనసేన అధినాయకత్వం అర్థం చేసుకుంటేనే విజయాలు వరించి వస్తాయని అంటున్నారు. వ్యూహాలు లేకపోతే మాత్రం 2024 ఎన్నికలు అందించే ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయని అంటున్నారు.