Begin typing your search above and press return to search.

ఇంకా లేట్ ఎందుకు పవన్...!?

ఇవన్నీ ఇలా ఉంటే కీలకమైన పార్టీలు అన్నీ తమ అభ్యర్థులను ప్రకటించారు జనసేనలో ఎందుకు లేట్ అన్న చర్చ సాగుతోంది. దానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 March 2024 11:30 PM GMT
ఇంకా లేట్ ఎందుకు పవన్...!?
X

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లకు అందరి కంటే ముందు తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి జగన్ రికార్డు సృష్టించారు. విడతల వారీగా అయినా టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి ముందుగానే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. శుక్రవారంతో చంద్రబాబు విడుదల చేసిన నాలుగవ జాబితాతో మొత్తం 144 అసెంబ్లీ సీట్లు 17 ఎంపీ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించినట్లు అయింది. బీజేపీకి పొత్తులో ఇచ్చిన ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్ధులను ప్రకటించేశారు.

ఈ విధంగా చూస్తే కనుక టీడీపీ కూటమిలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 172 సీట్లకు అభ్యర్ధుల ఎంపిక పూర్తి అయినట్లు అయింది. అలాగే మొత్తం పాతిక ఎంపీ సీట్లకు గానూ 24 ఎంపీ సీట్లకు అభ్యర్ధులు ఖరారు అయ్యారు. ఇక మిగిలింది జనసేన లిస్ట్ మాత్రమే. ఒక ఎంపీ మూడు అసెంబ్లీ సీట్లకు పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. మచిలీపట్నం అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ బాలశౌరీ పేరుని ప్రకటించాలా లేక వంగవీటి రాధాని బరిలోకి దించాలా అని జనసేన ఆలోచిస్తోంది అంటున్నారు.

అలాగే అవనిగడ్డ సీటు విషయంలో డైలమా కొనసాగుతోంది. అక్కడ నుంచి వంగవీటి రాధాను దించాలా లేక బాలశౌరిని ప్రకటించాలా అన్నది మరో చర్చ. ఇక ఉత్తరాంధ్రాలో ఉన్న రెండు అసెంబ్లీ సీట్లలో జనసేన తేల్చుకోలేకపోతోంది అని అంటున్నారు. పాలకొండ ఎస్టీ సీటులో అభ్యర్థి ఎవరా అన్నది అంతా చూస్తున్నారు.

అలాగే విశాఖ సౌత్ నుంచి ఇప్పటికే జనసేన తరఫున ప్రచారం చేసుకుంటున్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్ పేరుని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇక్కడ లోకల్ జనసేన నేతలు మాత్రం ఆయన నాన్ లోకల్ అభ్యర్థిగా ఉన్నారు వద్దు అని అంటున్నారు. దాంతో ఈ సీటు విషయంలో సస్పెన్స్ ని జనసేన కొనసాగిస్తోంది.

ఇవన్నీ ఇలా ఉంటే కీలకమైన పార్టీలు అన్నీ తమ అభ్యర్థులను ప్రకటించారు జనసేనలో ఎందుకు లేట్ అన్న చర్చ సాగుతోంది. దానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ పదకొండో సీటు కోరుతోంది. దాంతో ఆ పార్టీకి ఒక సీటు ఇవ్వాలంటే జనసేన నుంచే ఇస్తారు అని ప్రచారం కూడా ఉంది.

అదే విధంగా జనసేన బలమైన అభ్యర్ధులు గెలుపు గుర్రాల కోసం వేటలో ఉందని అంటున్నారు. ఈ మొత్తం కసరత్తు వల్లనే ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా కూడా అందరి కంటే పవన్ లేట్ అయిపోయారు అని అంటున్నారు. పవన్ పార్టీకి ఇచ్చినవి 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లు. మరి ఈ సీట్లలో అభ్యర్ధులను ప్రకటించడంలో ఇంత జాప్యం చేస్తే మొత్తం 175 సీట్లకు పాతిక ఎంపీ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాలంటే దీనికి పదింతలు టైం తీసుకుంటారా అన్న సెటైర్లు పడుతున్నాయి.

అయినా ఏ పార్టీకి కష్టాలు ఆ పార్టీకి ఉన్నాయి అందునా పొత్తులో ఉన్న పార్టీ కాబట్టి జనసేన విషయంలో అనేక వత్తిళ్ళు ఉన్నాయని అంటున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలోకి రానున్న పవన్ దాని కంటే ముందుగానే తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారు అని అంటున్నారు.