Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్...అసలైన ప్రజా సేవకుడిగా !

ఎంతో మెచ్యూరిటీతో పవన్ ప్రసంగం చేశారు. భావంలో తీవ్రత ఉండొచ్చు కానీ భాషలో తీవ్రత ఎందుకు అన్న పవన్ మాటలు ఎంత గొప్పవో కదా అని అనిపించక మానదు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 4:00 AM GMT
పవన్ కళ్యాణ్...అసలైన ప్రజా సేవకుడిగా !
X

నా చేతిలో అధికారం లేదు ఉంటే మీకు ఎంతో చేసి ఉండేవాడిని అని అనేక సభలలో పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. గత పదేళ్ళుగా ఆయన అధికారానికి దూరంగా జనాలకు దగ్గరగా ఉంటూ వచ్చారు. ఇపుడు ఆయనకు అధికారం దక్కింది. అయితే ఆయన దాంతో జనాలకు మరింత దగ్గరగా వచ్చారు.

తన విధి విధానాలను ఆయన స్వయంగా రూపొందించుకుని మరీ ప్రజా సేవకు అంకితం అవుతున్న తీరు అందరినీ అబ్బుర పరుస్తోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నాలుగు ప్రధాన శాఖలకు బాధ్యత తీసుకోగానే తొలి రెండు రోజులు ఆయన చేసిన రివ్యూలు ఏకంగా గంటల తరబడి సాగాయి. ఏ ఒక్క చిన్న విషయాన్ని ఆయన వదిలిపెట్టలేదు.

అదే సమయంలో అధికారులను నొప్పించలేదు. అన్ని సందేహాలను అడుగుతూ తీర్చుకున్నారు. నేను ఒక విద్యార్ధిని అనుకోండి నేను సబ్జెక్ట్ కోసం అడుగుతూ ఉంటాను, మీరు నాకు అన్నీ వివరంగా చెప్పండి అంటూ అధికారుల నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటూ సమీక్ష నిర్వహించిన తీరుని చూసిన చాలా మంది అధికారులు తాము చాలా కాలం తరువాత సంతృప్తికరమైన రివ్యూ మీటింగ్స్ ని చూశామని చెప్పడం జరిగింది.

ఇక కట్ చేస్తే ఆయన తొలి ప్రసంగం అసెంబ్లీలో ఇచ్చారు. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా నెగ్గిన తరువాత అభినందిస్తూ పవన్ మాట్లాడిన మాటలు ఆయన తొలిసారి అసెంబ్లీకి వచ్చారని ఎవరినీ అనిపించేట్టు లేదు. ఎంతో మెచ్యూరిటీతో పవన్ ప్రసంగం చేశారు. భావంలో తీవ్రత ఉండొచ్చు కానీ భాషలో తీవ్రత ఎందుకు అన్న పవన్ మాటలు ఎంత గొప్పవో కదా అని అనిపించక మానదు.

ప్రజాస్వామ్యంలో వాదాలు ఉండాలి ద్వేషాలు కాదు అంటూ ఆయన చెప్పిన మరో విషయం చూస్తే 1950, 1960 దశకం నాటి పార్లమెంటేరియన్లు మాట్లాడిన విధానం గుర్తుకు వచ్చింది. భిన్నమైన అభిప్రాయాలే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి అందరూ మాట్లాడాలి అంటూ పవన్ తన ప్రసంగంతో అసెంబ్లీలో పాత కొత్త మెంబర్స్ ని సైతం ఆకట్టుకున్నారు. ఆయన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు ఏర్పడి ఇలా ఉందంటే దానికి కారకుడు అయిన అమరజీవిని తలచుకుంటూ చేసిన ఈ ప్రసంగం చాలా మందిని ఒక పాఠంగానే చెప్పుకోవాలి.

ఇక అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే మంగళగిరిలోని తన పార్టీ ఆఫీసులో పవన్ జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఆయన జనసేన నేతగా ఉంటూ నిర్వహించినపుడు వాటిని అధికారులకు పంపడంతో సరిపోయేది. ఇపుడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఆ హోదాలో ఆయన వచ్చిన ప్రతీ సమస్యకూ తగిన పరిష్కారాన్ని చూపిస్తూ అధికారులతో ఫోన్లలో మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన వారికి కొండంత ఊరటను ఇస్తూ చేసిన ఈ కార్యక్రమం చూసిన వారు అంతా పవన్ లోని తపన నిజాయతీ ఈ స్థాయిలో ఉంటుందా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంది.

సరైన నాయకుడుకి సరైన సమయంలో అధికారం వచ్చింది అని అంతా అనుకుంటున్నారు. ఇక పవన్ అధికారం చేపట్టాక విపక్షం మీద ఒక్క విమర్శ చేయలేదు. పైగా రాజకీయాల్లో కక్షలు వద్దు అని ఆయన పదే పదే చెబుతున్నారు. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు. దాని కోసం పనిచేద్దామని ఆయన పిలుపు ఇస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కమిట్ మెంట్ చూసిన వారు లీడర్ అంటే ఇలా ఉండాలి కదా అని అనుకోవాల్సిందే.