పవన్ సినిమా.. అలా ఫిక్సయిపోవచ్చు
పవన్ కళ్యాణ్ ఇప్పుడు జస్ట్ పవన్ కళ్యాణ్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఆయన కింద నాలుగు మంత్రిత్వ శాఖలున్నాయి.
By: Tupaki Desk | 4 July 2024 5:36 AM GMTపవన్ కళ్యాణ్ ఇప్పుడు జస్ట్ పవన్ కళ్యాణ్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఆయన కింద నాలుగు మంత్రిత్వ శాఖలున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ సినిమాల భవితవ్యం ఏంటి అన్నది అయోమయంగా మారింది. ఎన్నికల్లో విజయానికి ముందే పవన్ రెగ్యులర్‌గా సినిమాలకు అందుబాటులో ఉండేవాడు కాదు. ఆయన సినిమాలు ముందుకు, వెనక్కి అన్నట్లు సాగుండేవి. ఇప్పుడు నాలుగు మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్.. మధ్యలో ఆగిన తన సినిమాలకు ఎప్పుడు డేట్లు ఇస్తాడో తెలియని అయోమయం నెలకొంది. మీడియాలో సినిమాల్లోకి ఆయన రీఎంట్రీ గురించి రకరకాల వార్తలు వస్తుండగా.. ఇప్పుడు పవన్ స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడే కొత్త ప్రభుత్వం మొదలైంది కదా.. మూడు నెలలైనా ఆగండి, తర్వాత సినిమాలు చేద్దాం అని పవన్ వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మొత్తానికి పవన్ అక్టోబరు-నవంబరు మధ్య తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొనే అవకాశముంది. ఆ ప్రకారం చూస్తే మధ్యలో ఆగిన ఏ పవన్ సినిమా కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం లేనట్లే. పవన్ ముందుగా హరిహర వీరమల్లు పూర్తి చేస్తాడని అంటున్నారు. ఓజీ చిత్రీకరణలో కూడా సమాంతరంగా పాల్గొనే అవకాశాలను కొట్టిపారేయలేం. ఏ సినిమాకూ బల్క్ డేట్లు ఇచ్చి, వరుసగా చిత్రీకరణల్లో పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి ఒక్కో సినిమా పూర్తి చేయడానికి టైం పడుతుంది. హరిహర వీరమల్లుకు పవన్ రెండు మూడు వారాలు పని చేయాల్సి ఉంటుందట. ఓజీకి మాత్రం నెల రోజుల దాకా డేట్లు ఇవ్వాలి. హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ రెంటిలో ఏ చిత్రమైనా పూర్తి కావడానికి ఇంకో ఆరు నెలల దాకా సమయం పట్టొచ్చు. వీటిలో ముందు పూర్తయ్యే చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయడానికి అవకాశముంది.