సీఎం పదవిపై పవన్ షాకింగ్ కామెంట్స్
బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Oct 2023 6:17 PM GMTప్రస్తుతం టీడీపీ బలహీనంగా ఉందని, అందుకే అనుభవమున్న ఆ పార్టీకి జనసేన యువరక్తం, పోరాట పటిమ అవసరం ఉందని పెడన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ టీడీపీకి జవసత్వాలు ఉడికిపోయాయని పవన్ అన్నారంటూ సజ్జల చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే కైకలూరులో జరిగిన బహిరంగ సభలో టీడీపీపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జనసేన-టీడీపీ మిత్రపక్షంగా కలిసి 10 ఏళ్లపాటు పనిచేయాల్సి ఉందని పవన్ అన్నారు. 2014లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని ఆ విషయంలో శ్రీకాకుళం ప్రజలు తనను ప్రశ్నించారని పవన్ గుర్తు చేసుకున్నారు. అందుకే, పొత్తు నుంచి బయటకు వచ్చానని, మాట మాట పెరిగి విడిపోయామని అన్నారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితులు వేరని, రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టీడీపీ ముందుకు కలిసి వెళ్తున్నాయని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలని, తాము వారికి స్నేహ హస్తం అందించామని పవన్ అన్నారు. అదేవిధంగా జనసేన నేతలతో కూడా టీడీపీ నేతలు స్నేహంగా ఉండాలని, గతంలో గొడవలు పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబుతో గతంలో విభేదాలున్నప్పటికీ రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయనను కలిశానని గుర్తు చేసుకున్నారు. 2014లో నా వల్లే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిందని ఏనాడూ చెప్పలేదని అన్నారు. అయితే, ఏమీ ఆశించకుండా టీడీపీకి జనసేన మద్దతునిచ్చిందని, జనసేన వల్ల ఒక్క ఓటు టిడిపికి పడినా ఆ కృతజ్ఞత ఉండాలని మాత్రమే తాను గతంలో చెప్పానని పవన్ క్లారిటీనిచ్చారు. చంద్రబాబు జైలు నుంచి త్వరలో బయటకు వస్తారని తాను ఆశిస్తున్నట్లు పవన్ చెప్పారు. జగన్ ఒక లాల్ బహుదూర్ శాస్త్రి, వాజ్ పేయి అయితే తాను ఇలా మాట్లాడే వాడిని కాదని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును బంగారం చేయాలని మోడీని కోరుతున్నానని, ఏపీని కాపాడాలని బిజెపిని అడిగానని చెప్పారు.
బీజేపీ ఆశీస్సులతో సీఎం అయితే సంతోషమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తన స్వార్ధాన్ని పక్కన పెట్టి మరి పది అడుగులు ముందుకు వేశానని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని అన్నారు. సీఎం పదవి వస్తే బలంగా పనిచేస్తానని లేకపోతే బాధ్యతగా పనిచేస్తానని పవన్ చెప్పారు. ఏదేమైనా ప్రజల కోసం నిలబడటం మాత్రం పక్కా అని అన్నారు. తాను ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకం కాదని, కానీ సంపద సృష్టించకుండా ప్రజల సొమ్మును పంచేస్తూ ఉంటే మాత్రం దానికి వ్యతిరేకమని అన్నారు.