Begin typing your search above and press return to search.

ఆ ఫైర్ ఏమైంది పవన్....?

By:  Tupaki Desk   |   8 Nov 2023 2:30 AM GMT
ఆ ఫైర్ ఏమైంది పవన్....?
X

ఏపీలో కనిపించిన ఆవేశం వేడి వాడి తెలంగాణాలో జరిగిన పవన్ ఎన్నికల తొలి సభలో కనిపించలేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ అంటే ఆవేశం పరవళ్ళు తొక్కుతుంది. ఆయన పాలకులను తనదైన మాటలతో చెలగాటమాడతారు. వైసీపీ మీద పవన్ తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలు అందరికీ చెవులలో ఇప్పటికీ ఉంటాయి.

అలాంటి పవన్ తెలంగాణా సభలో మాత్రం చాలా స్మూత్ గా మాట్లాడారు. ఎక్కడా తెలంగాణాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీయారెస్ ని పేరెత్తి విమర్శించలేదు. ముఖ్యమంత్రి కేసీయార్ పాలనా విధానాలను కూడా సూటిగా తూర్పారా పట్టలేదు. చాలా జనరలైజ్ చేస్తూ పవన్ మాట్లాడారు.

ఇంకా చెప్పాలంటే చాలా బాలన్స్డ్ గా మాట్లాడారు. తెలంగాణా ఎన్నికల సభలో లోక్ సభ ఎన్నికల గురించి మాట్లాడడమూ పవన్ కే చెల్లింది ఈ దేశానికి మరోసారి ప్రధానిగా మోడీ రావాలని కోరడం మంచిదే అయినా ప్రస్తుతం తెలంగాణా ముఖ్యమంత్రి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి.

తెలంగాణాలో బీజేపీ జనసేన ప్రభుత్వం రావాలని పవన్ గట్టిగా కోరి ఉంటే బాగుండేది అన్న మాట ఉంది. అంతే కాదు మాకు ఓటు వేయండి అని అడిగే ముందు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీయారెస్ కి ఎందుకు వేయకూడదో కూడా చెప్పి ఉండాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ మెత్తమెత్తగానే మాట్లాడారు అని అంటున్నారు.

తెలంగాణా రాష్ట్ర సాధన జరిగింది కానీ అభివృద్ధి సాధన జరగలేదు అని పవన్ చెప్పడం జరిగింది. అంతే కాదు. నీళ్ళు నిధులు, నియామకాలు అంటూ పోరాడిన తెలంగాఅలో ఆ మేరకు విజయం సాధించామా అన్నది మాత్రం ప్రశ్నగా మిగిలిపోయింది అని పవన్ అన్నారు.

తెలంగాణాలో అభివృద్ధి కావాలని ఆయన కోరుకున్నారు. అంతే కాదు పోరాటంలో గెలుపు ఉండాలని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎపుడూ ఎన్నికల వాతావరణమే ఉందని రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదని ఒక నిశితమైన విమర్శ చేశారు ఇది కూడా జనరలైజ్ చేస్తూ సాగింది.

మొత్తానికి కేసీయార్ పేరెత్తకుండానే పవన్ ప్రసంగం సాగింది. మరి ఇది సేఫ్ సైడ్ గా చేసిన ప్రసంగం అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా పవన్ తెలంగాణా ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదు. ఎన్నికల వేళ ఘాటుగానే విమర్శలు ఉండాలి.

లేకపోతే జనానికి హుషార్ రాదు, రాజకీయాల్లో మసాలా ఉండదు, కానీ పవన్ మాత్రం ఎందుకో సాదా సీదాగానే మాట్లాడుతూ జాతీయ రాజకీయాలు మోడీ సాధించిన విజయాలు చెప్పుకొచ్చారు. ఒక విధంగా మోడీని ప్రధానిగా గెలిపించమంటూ చేసిన ప్రసంగంలా ఉంది తప్ప తెలంగాణాలో బీజేపీని గెలిపించమని చేసినట్లుగా లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా రానున్న రోజులలో పవన్ ఎన్నికల ప్రసంగాలు ఎలా ఉంటాయో చూడాలని అంటున్నారు.