Begin typing your search above and press return to search.

జనసేనకు ఈసీ గుడ్ న్యూస్... తిరిగొచ్చిన గ్లాస్ గుర్తు!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు జ‌రిగిన గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగ‌తి విదిత‌మే" అని తెలిపారు.

By:  Tupaki Desk   |   19 Sep 2023 11:22 AM GMT
జనసేనకు ఈసీ గుడ్  న్యూస్... తిరిగొచ్చిన గ్లాస్  గుర్తు!
X

జ‌న‌సేన స్థాపించి ప‌దేళ్లకు ఇంకా స్థిర‌మైన గుర్తుకే నోచుకోలేదనే ప్రత్యర్థుల కామెంట్లనుంచి పవన్ కు ఉపశమనం లభించింది! ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు గుర్తుకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల సంఘం మరోసారి జనసేన గుర్తుగా గాజు గ్లాస్‌ ను కేటాయించింది.


అవును.. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గుర్తును కేటాయించింది. దీంతో ఎన్నికల సంఘానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా... "జ‌న‌సేన పార్టీకి ఎన్నిక‌ల గుర్తుగా మ‌రోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నిక‌ల సంఘానికి హృద‌య‌పూర్వకంగా కృత‌జ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు జ‌రిగిన గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగ‌తి విదిత‌మే" అని తెలిపారు.

ఇదే సమయంలో... "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌ స‌భ స్థానాల్లో జ‌న‌సేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారు. ఇప్పుడు తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌ల‌లో ప్రజ‌ల‌కు సేవ చేయ‌డానికి జ‌న‌సేన అభ్యర్థులు స‌న్నద్ధమైన త‌రుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జ‌న‌సేన‌కు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నిక‌ల సంఘం కేటాయించ‌డం చాలా సంతోష‌దాయ‌కం" అని స్పందించారు.

అనంతరం... "ఈ సంద‌ర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నిక‌ల సంఘంలోని అధికారులు యావ‌న్మంది సిబ్బందికి పేరుపేరునా నా త‌ర‌పున, జ‌న‌సేన పార్టీ త‌ర‌పున కృత‌జ్ఞత‌లు తెలుపుతున్నాను" అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

అయితే, ఈ ప్రకటన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైనట్లు కనిపిస్తున్న పవన్ కల్యాణ్.. ఏపీతోపాటు తెలంగాణ రాజకీయాల వైపు కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో... రెండు రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తామని పవన్ చెప్పకనే చెప్పారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోపక్క ఏపీలో స్కిల్ డెవల్ప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ స్పీడ్ పెంచినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీతో పొత్తు గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసే పోటీచేస్తామని స్పష్టం చేశారు.

కాగా... మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన గ్లాస్ గుర్తును కోల్పోయింది. ఆ సమయంలో గాజు గ్లాసు గుర్తును ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్ చేసింది. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే గుర్తును జనసేనకు కేటాయించింది.