పోటీపై పవన్ సస్పెన్స్...?
ఇటలీలో తన అన్న నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ వివాహం కోసం పవన్ అక్కడికి వెళ్తున్నారు.
By: Tupaki Desk | 28 Oct 2023 3:51 PM GMTపవన్ కళ్యాణ్ తెలంగాణా ఎన్నికల్లో తమ పార్టీ పోటీ విషయంలో ఏమి చేస్తారో అని క్యాడర్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తెలంగాణాలో జనసేనకు ఔత్సాహికులు ఉన్నారు. గెలిచేస్తామని కాదు కానీ పోటీ చేస్తే పార్టీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఆరాటపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు, ఇక లక్కు నక్కను తొక్కితే హోరాహోరీ పోటీలలో ఎక్కడైనా గెలుపు దిశగా కూడా అడుగులు పడతాయని ఆశతో ఉన్నారు.
వారంతా పవన్ కళ్యాణ్ణి తెలంగాణాలో పోటీ చేయమని కోరుతున్నారు. ఇక పవన్ సైతం మంగళగిరి ఆఫీసులో కూర్చుని తెలంగాణా ఎన్నికలలో పోటీకి చాలా కాలం క్రితం ప్రకటించేశారు. 32 మంది పోటీ అని నంబర్స్ కూడా చెప్పేశారు. ఆ తరువాతనే జోరు చేయడంలేదు అంటున్నారు
ఈ మధ్యలో బీజేపీ వారు కలవడం ఏకంగా ఢిల్లీకి వెళ్లి అమిత్ షా తో భేటీలు వేయడంతో రేపో నేడో క్యాండిడేట్స్ ని ప్రకటిస్తారని, పొత్తు సీట్లను కూడా తేలుస్తారని టీ జనసేన నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తూంటే పవన్ ఇటలీ టూర్ కి వెళ్ళిపోయారు.
ఇటలీలో తన అన్న నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ వివాహం కోసం పవన్ అక్కడికి వెళ్తున్నారు. నవంబర్ 1న ఈ వివాహం ఉంది. దాంతో అటూ ఇటూ చూస్తే వారం రోజులకు కానీ పవన్ తిరిగి హైదరాబాద్ చేరుకోలేరని అంటున్నారు. మరి పవన్ తెలంగాణా ఎన్నికల్లో పోటీ విషయం ఏమి తేల్చారని చర్చ సాగుతోంది.
నిజానికి అయితే జనసైనికులు పోటీ తప్పకుండా చేయాలని పవన్ మీద వత్తిడి తెస్తున్నారు. అదే విషయం బీజేపీ నేతలతో కూడా పవన్ చెప్పి ఉన్నారు. తమ పార్టీకి పొత్తులో భాగంగా ఎన్నో కొన్ని సీట్లు ఇవ్వాలన్ కోరారు ఇక బీజేపీ కూడా పది నుంచి పదిహేను సీట్ల దాకా ఇచ్చేందుకు రెడీ అయిందని వార్తలు వచ్చాయి.
కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కూర్చుని సీట్ల విషయంలో ఒక అవగాహనకు రావాలని అమిత్ షా సూచించారని కూడా వార్తలు వెలువడ్డాయి. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ పవన్ విదేశాలకు వెళ్ళిపోయారు. చూడబోతే నామినేషన్ ప్రక్రియ నవంబర్ 9 నుంచి స్టార్ట్ అవుతోంది. పవన్ నవంబర్ మొదటి వారంలో వచ్చేంతవరకూ బీజేపీ ఆగుతుందా అన్నది డౌటే.
బీజేపీ మొత్తం సీట్లకు పోటీ పెట్టేయడం ఖాయం. మరి పవన్ మదిలో అదే ఉందా పోటీ చేయాలనుకోవడం లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. అటు క్యాడర్ కి పోటీ మీద ఏమీ చెప్పని పవన్ బీజేపీ వారికి ఏమి చెబుతారో లేక చెప్పారో తెలియదు కానీ తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ అన్నది డౌట్ లో పడింది అని అంటున్నారు.
దానికి కారణం ఏంటి అంటే తెలంగాణా వెంటనే ఏపీ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణాలో గెలిచే అవకాశాలు అయితే ఇపుడున్న నేపధ్యంలో లేవు అని అంటున్నారు. అక్కడ ఓటమిని మూటకట్టుకుని బీజేపీతో జత కట్టి తీరా అక్కడ వేరే ప్రభుత్వం ఏర్పాటు అయితే రేపటి రోజున తమకు ఉన్న అన్ని ఆప్షన్లూ లేకుండా పోతాయన్న ముందు జాగ్రత్తతోనే పవన్ ఇలా చేస్తున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా పవన్ ఇటలీ టూర్ నేపధ్యంలో తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం అన్నది ఎటూ తేలకుండా ఉందని అంటున్నారు.