Begin typing your search above and press return to search.

పవన్ ఆరు వేళ్లూ చూపించారు... అవకాశాన్ని వదులుకుంటున్నారు?

అవును... ఇటీవల రోడ్లపై ఏపీ పోలీసులతో జరిగిన వాదనలో పవన్ కళ్యాణ్, పోలీసులకు, జనసైనికులకూ కూడా ఆరు వేళ్లు చూపించారు.

By:  Tupaki Desk   |   12 Sep 2023 4:41 AM GMT
పవన్ ఆరు వేళ్లూ చూపించారు... అవకాశాన్ని వదులుకుంటున్నారు?
X

ప్రస్తుతం ఏపీలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు అనే అంశం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ వల్ల విపక్షాల ఐక్యతకు మరింత బలం చేకూర్చినట్లు జనసేన నేతలు చెబుతుండగా... ఈ కష్ట సమయంలో తనకు పవన్ కల్యాణ్ అండగా ఉన్నాడని నారా లోకేష్ చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆయనకు మద్దతుగా టీడీపీ నేతలకంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారని, రియాక్ట్ అయ్యారనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పైగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న సమయంలో జాతీయ రహదారిపై జరిగిన రచ్చ సమయంలో పవన్ చూపించిన ఆరువేళ్ల సింబల్ కూడా చర్చనీయాంశం అవుతుంది.

అవును... ఇటీవల రోడ్లపై ఏపీ పోలీసులతో జరిగిన వాదనలో పవన్ కళ్యాణ్, పోలీసులకు, జనసైనికులకూ కూడా ఆరు వేళ్లు చూపించారు. అంటే... కేవలం "ఆరు నెలల నిరీక్షణ" అని చెబుతున్నారన్న మాట. అంటే... 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోతుందని, అప్పటివరకూ ఈ తిప్పలు తప్పవన్నట్లు పవన్ అభిప్రాయపడినట్లున్నారు.

ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని పదే పదే ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్... ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీకి తన మద్దతు నాడు ఉంది, నేడు ఉంది, రేపూ ఉంటుంది అన్న స్థాయిలో పవన్, చంద్రబాబు అరెస్ట్ అనంతరం స్పందించారు. అంటే... 2014 పొత్తులను కోరుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు.

ఆ సంగతి అలా ఉంటే... "చంద్రబాబు అరెస్ట్, అనంతరం ఆశించిన స్థాయిలో లేదన్నట్లుగా చెబుతున్న టీడీపీ నేతల రియాక్షన్" సమయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకోలేదనే చర్చ మొదలైంది. ఈ సమయంలో టీడీపీని దాటి ముందుకు వెళ్లే అవకాశం కూడా వచ్చిందని.. అదే జరిగితే ఫ్యూచర్ లో వైసీపీకి ప్రత్యామ్నాయంగా టీడీపీ కంటే మెరుగైన అవకాశాలు జనసేన సంపాదించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఇలా రాజకీయంగా ఇంతటి సువర్ణావకాశాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా పాడుచేసుకున్నారనేది వారి అభిప్రాయంగా ఉందని తెలుస్తుంది. దీంతో... జనసేన కాస్తా చంద్రసేనగా మారిందనే కామెంట్లు అధికారపార్టీనుంచి, నెటిజన్ల నుంచీ వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా... మరో ఆరునెలల్లో ఏపీలో తమకు మంచి రోజులు వస్తాయన్నట్లుగా పవన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది.