Begin typing your search above and press return to search.

తణుకులో పవన్ క్షమాపణలు టీడీపీ కోసమేనా...?

అంటే పొత్తులలో భాగంగా తణుకు సీటుని పవన్ పార్టీకి టీడీపీ వదిలేసుకోవాల్సిందే అన్నదే అందమైన సందేశంగా ఉంది అని అంటున్నారు

By:  Tupaki Desk   |   15 July 2023 5:04 PM GMT
తణుకులో పవన్ క్షమాపణలు టీడీపీ కోసమేనా...?
X

పవన్ కళ్యాణ్ తణుకులో వారాహి రధమెక్కిన తరువాత స్పీచ్ కంటే ముందు క్షమాపణలు చెప్పారు. తన పార్టీకి చెందిన తణుకు నేత పార్టీని అలా అట్టేబెట్టుకుని ఉన్నందుకు ఆయన ధన్యవాదాలతో పాటు ఆయన్ని గుర్తించనందుకు సారీ చెప్పారు. టికెట్ ఇచ్చి 2019లో పోటీ చేయిస్తే ఆ క్యాండిడేట్ పార్టీని వీడిపోయారని, అయితే ఈ నాయకుడు మాత్రం పార్టీనే అట్టేబెట్టుకుని ఉన్నారని పవన్ అన్నారు.

సదరు నాయకుడి గురించి అంత మందిలో పవన్ ఎందుకు చెప్పారు అంటే ఆ సభ ద్వారా ఆయన పేరు ఎందుకు ప్రకటించారంటే ఆయనే జనసేన తరఫున తణుకు అభ్యర్ధి అని చెప్పడానికే అంటున్నారు. అలా తణుకు సీటు మీద పవన్ కర్చీఫ్ వేశారు. ఈ క్షమాపణలు జనాలకు చెబితే టికెట్ గురించి సంకేతాలు టీడీపీకి అలా అందాయని అంటున్నారు.

అంటే పొత్తులలో భాగంగా తణుకు సీటుని పవన్ పార్టీకి టీడీపీ వదిలేసుకోవాల్సిందే అన్నదే అందమైన సందేశంగా ఉంది అని అంటున్నారు. అందుకే తణుకులో పవన్ స్పీచ్ ఒక దూకుడుతో ఒరవడితో సాగింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే తణుకు సీటు టీడీపీ వదులుకోదని అంటున్నారు. దానికి కారణం 2019 ఎన్నికలలో జస్ట్ రెండు వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి ఆ పార్టీ నేత అరిమిల్లి రాధాక్రిష్ణ ఓడారు. అంతకు ముందు ఆయన 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆయన తణుకుని తనదైన పద్ధతిలో అభివృద్ధి చేశారు. ఆయన పట్ల జనాల్లో ఆదరణ బాగా ఉంది. పైగా 2019 ఎన్నికల్లో టీడీపీకి 74 వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడ జనసేనకు 32 వేల ఓట్లు వచ్చాయి. ఇక మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు అతి తక్కువ మెజారిటీతో గెలిచినా మంత్రి అయిపోయారు. అయితే ఆయనకు మంత్రిగానూ ఎమ్మెల్యేగాని పనితీరు బాలేదనే జనాలు మార్కులు వేస్తున్నారట.

దాంతో ఇది కచ్చితంగా విపక్షాల సీటే అని అంటున్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా అరిమిల్లి రాధాక్రిష్ణే టీడీపీ అభ్యర్ధి ఆయనే కాబోయే ఎమ్మెల్యే అని తమ్ముళ్ళు సంబరంగా ఉన్న వేళ పవన్ వచ్చి తన పార్టీ క్యాండిడేట్ ని పరిచయం చేశారు అంతే కాదు జనసేన ఈ సీటు మీద కన్నేసింది అని అంటున్నారు. దాంతోనే ఇపుడు టీడీపీ జనసేన మధ్యన సీటు పేచీ వస్తోంది అని అంటున్నారు.

తణుకు సీటు మాదే అని టీడీపీ నేతలు అంటున్నారు. తణుకులో లేటెస్ట్ గా మీటింగ్ పెట్టిన జనసేన బిగ్ సౌండ్ చేస్తోంది. పవన్ సభకు జనాలు అదిరిపోయే రేంజిలో వచ్చారు. దాంతో పాటు తణుకులో మంత్రి మీద పవన్ పేల్చిన సెటైర్లు అన్నీ కూడా వ్యూహంలో భాగమే అంటున్నారు. దాంతో ఇక్కడ కారుమూరి మీద కచ్చితంగా జనసేన పోటీ చేసి ఓడిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఇక హిస్టరీ చూస్తే టీడీపీకి తణుకు కంచుకోట. 1983 నుంచి 1999 వరకూ వరసగా అయిదు సార్లు గెలిచిన చరిత్ర ఆ పార్టీది. 2004, 2009లలో ఓడింది కానీ 2014లో మళ్లీ గెలించింది. అందువల్ల తణుకు తళతళలు మావే అంటోంది టీడీపీ. మరి టీడీపీ అయితే ఈ సీటుని ససేమిరా వదులుకోదని అంటున్నారు. దాంతో రెండు పార్టీల మధ్య తణుకు పేచీ కూడా కొత్తగా చేరింది అని అంటున్నారుట.