పవన్ టార్గెట్ : జగన్ కే కాదు.. బాబుకు కూడానా...!?
పవన్ ఇపుడు అదే ఆలోచిస్తున్నారు. చూస్తూండగానే గిర్రున ఎన్నికలు వస్తున్నాయి. అయిదేళ్ళుగా పవన్ పడుతున్న బాధకు ఒక అందమైన జవాబు ఇచ్చేది మాత్రం 2024 ఎన్నికలే అని అంటున్నారు.
By: Tupaki Desk | 7 Jan 2024 12:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమిని ఒప్పుకోరు. అది ఆయన మాటలలో అనేక సందర్భాలలో వెల్లడి అయింది. తాను రెండు చోట్ల ఓడాను అన్న దాన్ని ఆయన లైట్ తీసుకున్నారు అని ప్రచారం అయితే సాగింది కానీ పవన్ మాత్రం గత అయిదేళ్ళుగా ఏదో మీటింగులో అయినా పార్టీ మీటింగులో అయినా తన మనసు విప్పి చెప్పేసుకుంటూ వచ్చారు. నన్ను రెండు చోట్లా ఓడించారు అని ఆయన చెప్పడం ద్వారా ఓటమి ఎంతలా ఆయన్ని బాధించిందో ఆర్ధం చేసుకోవాలని అంటారు.
పవన్ స్వతహాగా సినీ హీరో. ఆయన పొలిటిషియన్ కాదు. రాజకీయాలు వంటబట్టిన వారికి ఓటములు బాధిస్తాయి కానీ వారు చెరిపేసుకుని కొత్త రూట్ వెతుకుతారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో టాప్ రేంజి హీరో. ఇక ఆయన ఎంత కాదని అంటున్నా సొంత సామాజికవర్గం బలంగా ఏపీలో ఉంది. యూత్ లో అతి పెద్ద వాటా ఆయనకే ఉంటుంది. మరి ఇన్ని ఉండి కూడా పవన్ ఒక చోట పదహారు వేలు మరో చోట ఎనిమిది వేల ఓట్ల తేడాతో 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు.
మరి ఎందుకు ఇలా జరిగింది అంటే కారణాలు బోలెడు చెప్పుకోవచ్చు. కానీ అవేమీ ఓటమి బాధను తీర్చలేవు. మరి అది ఎలా తీరుతుంది అంటే దాన్ని భర్తీ చేసేది కొండంత ఉపశమనం కలిగించేది భారీ విజయమే. అంతవరకూ మనసుని కుదురుగా ఉండనీయదు.
పవన్ ఇపుడు అదే ఆలోచిస్తున్నారు. చూస్తూండగానే గిర్రున ఎన్నికలు వస్తున్నాయి. అయిదేళ్ళుగా పవన్ పడుతున్న బాధకు ఒక అందమైన జవాబు ఇచ్చేది మాత్రం 2024 ఎన్నికలే అని అంటున్నారు. ఈసారి పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ఈ రోజుకీ సస్పెన్స్. మీడియాలో ప్రచారంగా ఉన్న సీట్లు చూస్తే అరడజన్ పైగా ఉన్నాయి. అందులో గతంలో పోటీ చేసి ఓడిన గాజువాక. భీమవరం తో పాటు కొత్తగా పిఠాపురం, కాకినాడ సిటీ, తిరుపతి, అనంతపురం అర్బన్ ఇలా పేర్లు చాలానే ఉన్నాయి.
మరి వీటిలో పవన్ ఎక్కడ నుంచి పోటీకి దిగుతారు అంటే అది మాత్రం ఇపుడే జనసేన బయట పెట్టదు అని అంటున్నారు. ఇక పవన్ పోటీ చేసే సీటు ముందే తెలిస్తే అక్కడ భారీ ఎత్తున వ్యూహరచన చేయడానికి వైసీపీ రెడీగా ఉంది. పవన్ని ఓడించాలన్నది వైసీపీ గట్టి పట్టుదల అని ఎవరైనా చెబుతారు.
అసలు రాజకీయాల్లో ప్రత్యర్ధులను ఓడించడమే అసలైన రాజకీయ క్రీడ. ఏపీలో అది కాస్తా ముదిరి వ్యక్తిగత వ్యవహారంగా మారింది. దాంతో ఒకరి ఓటములు మరొకరు చూడాలని కూడా భావిస్తున్నారు. అయితే ఈసారి పవన్ ఓడతారా అంటే రాజకీయంగా తర్కం అందుకు ఒప్పుకోదు. గతం కంటే జనసేన గ్రాఫ్ పెరిగింది అని చెప్పడానికి ఎలాంటి సర్వేలు అవసరం లేదు.
ఇక టీడీపీతో పొత్తు ఉండనే ఉంది. దాంతో గెలుపు ఖాయం. మరి మెజారిటీ ఎంత. ఇక్కడే పవన్ తో పాటు జనసైనికుల ఆలోచనలు అన్నీ లాక్ అయ్యాయని అంటున్నారు. ఈసారి భారీ మెజారిటీతో ప్రత్యర్ధులకు గట్టి సమాధానం చెప్పాలని గాజు గ్లాస్ పార్టీ భావిస్తోంది. అంతే కాదు ఒక పవర్ ఫుల్ టార్గెట్ ని కూడా జనసేన పెట్టుకుంది అని ప్రచారం సాగుతోంది
అదేంటి అంటే ఈసారి పవన్ కి వచ్చే మెజారిటీ ఏపీలో రీసౌండ్ చేయాలి. చరిత్ర తిరగరాయాలి. సరికొత్త రికార్డులను నమోదు చేయాలి. ఇదే టార్గెట్ అంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే ప్రజారాజ్యం పార్టీకి పెట్టాక చిరంజీవి ఒక చోట ఓడారు. రెండవ చోట కేవలం అయిదారు వేల ఓట్ల తేడాతోనే గెలిచారు. ఇక పవన్ నాగబాబు 2019లో పోటీ చేసినా ఓటమి చూశారు.
దాంతో ఈసారి కనీ వినీ ఎరగని మెజారిటీని సాధిస్తేనే జనసేన శాంతిస్తుంది అని అంటున్నారు. అంతే కాదు ఏపీలో జగన్ కంటే కూడా ఎక్కువ మెజారిటీని సైతం టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. 2019లో జగన్ కి అదిరిపోయే మెజారిటీ వచ్చింది. 94 వేల దాకా జగన్ మెజారిటీ ఉంది. అది ఏపీలో అత్యధిక మెజారిటీ. ఇక చంద్రబాబుకు మాత్రం 30 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది.
అయితే చంద్రబాబు ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ అని కుప్పం టీడీపీకి ఆదేశాలు ఇచ్చేశారు. రేపటి రోజున సీటుని ఎంచుకున్న తరువాత పవన్ కూడా అంతకంటే ఒక్క ఓటు ఎక్కువగానే టార్గెట్ పెడతారు అని అంటున్నారు. అంటే ఏపీలో హయ్యెస్ట్ మెజారిటీ అంటే అది పవన్ ది మాత్రమే ఉండాలని డిసైడ్ అవుతున్నారుట.
అటు జగన్ ఇటు చంద్రబాబుల కంటే భారీ మెజారిటీ పవన్ సాధించేలా జనసేన వ్యూహరచన చేస్తోందిట. అలాంటి సీటుని ఎంచుకుని పవన్ సరైన సమయంలో దాన్ని బయటపెడతారుట. మరి పవన్ టార్గెట్ రీచ్ అవుతారా లేదా అంటే పొలిటికల్ మ్యాజిక్ లో ఏదైనా జరగవచ్చు. జరగకపోవచ్చు. బట్ వ్యూహాలే ఎపుడూ కరెక్ట్ గా ఉండాల్సి ఉంది అంటున్నారు.