పవన్ ముందు టీడీపీ నేతల క్యూ.. మ్యాటరేంటో...!?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇపుడు ఫుల్ బిజీ అయ్యారు. ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు వరసబెట్టి క్యూ కడుతున్నారు
By: Tupaki Desk | 13 Jan 2024 2:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇపుడు ఫుల్ బిజీ అయ్యారు. ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు వరసబెట్టి క్యూ కడుతున్నారు. వచ్చిన వారు అంతా మర్యాదపూర్వక భేటీలు అంటున్నా రాజకీయాల్లో అందునా ఎన్నికలు ముందు పెట్టుకుని ఇలాంటి కలయికల వెనక చాలా కధలు ఉంటాయని అంతా అంటున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ బిగ్ షాట్ మాగంటి బాబు లేటెస్ట్ గా పవన్ ని కలిసిన వారిలో ఉన్నారు ఆయన ముందు కాంగ్రెస్ లో మంత్రిగా ఎంపీగా పనిచేశారు. ఆ తరువాత టీడీపీలో చేరి ఏలూరు ఎంపీ అయ్యారు. 2019లో ఆయన ఓటమి పాలు అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు.
అది కనుక వీలు కాకపోతే కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా అయినా పోటీ చేయాలనుకుంటున్నారు. అలాగే ఏలూరు ఎంపీ పరిధిలో కీలక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏదో ఒక దాంట్లో పోటీకి సిద్ధంగా ఉన్నారు. టీడీపీలో ఆయన ఉన్నా ఆయన సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తాయని తేలడంతోనే మాగంటి బాబు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారని అంటున్నారు.
ఒకవేళ జనసేనకు ఆ సీట్లు దక్కితే ఆ పార్టీలో చేరి మాగుంట బాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బూరగడ్డ వేదవ్యాస్ కూడా పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికి ముప్పయ్యేళ్ళ క్రితం ఉప సభాపతిగా పనిచేశారు. ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆయన కాంగ్రెస్ తెలుగుదేశం ప్రజారాజ్యం వైసీపీలలో పనిచేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2024లో పెడన నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి సిద్ధం అవుతున్నారు. అయితే ఆయనకు అక్కడ టికెట్ డౌట్ గా ఉంది. పైగా అక్కడ టీడీపీకి ఇంచార్జిగా కాగిత ప్రసాద్ ఉన్నారు దాంతో పాటు ఆ సీటు జనసేనకు పొత్తులో దక్కుతుంది అని టాక్ ఉంది.
దాంతో ఆయన పవన్ని కలిశారు అని అంటున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పెడనలో పోటీ చేసి ఓడిన వేదవ్యాస్ కి పవన్ తో కూడా పరిచయాలు ఉన్నాయి. దాంతో ఆయన టికెట్ హామీ ఉంటే జనసేనలో చేరుతారు అని అంటున్నారు. ఇక విజయవాడ వెస్ట్ నేత మాజీ ఎమ్మెలెయ జలీల్ ఖాన్ పవన్ కళ్యాణ్ ని కలిసారు. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. వెస్ట్ నుంచి పోటీకి ఆయన సిద్ధంగా ఉన్నారు.
అక్కడ జనసేన నేత పోతిన మహేష్ ఉన్నారు. ఆయన 2019లో పోటీ చేసి 22 వేల ఓట్ల పై చిలుకు తెచ్చుకున్నారు. జనసేంకు ఆయన గట్టి నేతగా ఉన్నారు. ఆయనకు సీటు ఖాయమని ప్రచారంలో ఉంది. అయితే జలీల్ ఖాన్ ఆ సీటు కోసమే పవన్ ని కలిశారు అని అంటున్నారు.
వీరే కాదు చాలా మంది సీనియర్ నేతలు టీడీపీ నుంచి రానున్న రఒజులలో పవన్ ని కలుస్తారు అని అంటున్నరు. అయితే టికెట్ కోసం పవన్ ని కలసి హామీ తీసుకుని చేరితే దాని వల్ల జనసేనలో మొదటి నుంచి ఉన్న నాయకులకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. పార్టీలో చేరిన వారు టికెట్ కోసమే వస్తారు అని అంటున్నారు.
ఇక జనసేనకు సీట్లు ఇస్తే ఆ పార్టీలో టీడీపీ నేతలు చేరి పోటీ చేస్తారు అని మొదటి నుంచి ఒక ప్రచారం ఉంది. ఇపుడు పవన్ ని కలుస్తున్న నాయకులు చూస్తే అదే జరుగుతుందా అన్న చర్చ నడుస్తోంది. పవన్ అయితే ఏమి చేస్తారో అన్న ఉత్కంఠ అయితే అంతటా ఉంది.