తిరుపతికి ఇన్ చార్జ్ అభ్యర్థి కాదు.. పవన్ మనసులో కొత్త పేరు?
ఏపీలో టీడీపీ - జనసేనల పొత్తు ఫైనల్ అయ్యి చాలా దూరం వెళ్లిపోయింది. వాస్తవానికి ఈ రోజు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమం ఉంటుందని తొలుత ప్రకటించారు.
By: Tupaki Desk | 1 Nov 2023 12:16 PM GMTఏపీలో టీడీపీ - జనసేనల పొత్తు ఫైనల్ అయ్యి చాలా దూరం వెళ్లిపోయింది. వాస్తవానికి ఈ రోజు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమం ఉంటుందని తొలుత ప్రకటించారు. అయితే ప్రస్తుతం పవన్ ఇటలీలో ఉన్నారని తెలుస్తుంది. మరోపక్క చంద్రబాబు నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యి.. ఈ రోజు ఉదయం ఇంటికి చేరుకున్నారు! త్వరలో చంద్రబాబు కంటి ఆపరేషన్ అయిపోయిన అనంతరం... పవన్ - లోకేష్ లు భేటీ అయ్యి సీట్ల పంపకాలపై కూడా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు!
ఈ నేపథ్యంలో... పొత్తు అనంతరం జనసేన పోటీ చేయబోయే సీట్లలో తిరుపతి పక్కాగా ఉంటుందని ఆ పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు. ఇప్పటికే తాను పోటీ చేసుకోబోయే సీటును నాదేండ్ల మనోహర్ ప్రకటించేసుకోగా... పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా వెల్లడికాలేదు! ఈ క్రమంలో తిరుపతి నుం చి పవన్ కల్యాణ్ పోటీచేయబోతున్నారని కథనాలొచ్చాయి. అందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి.
ప్రజారాజ్యం పార్టీ ప్రకటించిన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత చిరంజీవి తన సొంత ప్రాంతం పాలకొల్లుతో పాటు, తిరుపతి నుంచీ పోటీచేశారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయినా.. తిరుపతిలో గెలిచారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్ల్లో కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషా రాణి చేతిలో 5,446 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో... సొంత ఊరిలో కంటే తిరుపతిలోనే మెగా ఫ్యామిలీకి ఎక్కువ బలం ఉందనే కామెంట్లు అప్పట్లో వినిపించాయి.
దీంతో... పవన్ కల్యాణ్ కూడా ఈసారి తిరుపతి నుంచి పోటీచేస్తారని అన్నారు. అయితే... అందుకు పవన్ సుముఖంగా లేరని అంటున్నారు. ఈ సమయంలో తిరుపతి జనసేన అభ్యర్థి విషయంలో పవన్ మనసులో ఒక వ్యక్తి ఉన్నారని.. ఆయన అయితేనే వైసీపీకి గట్టిపోటీ ఇవ్వగలుగుతారని భావిస్తున్నారంట. ఆయన మరెవరో కాదు... పసుపులేటి హరిప్రసాద్! ఈయనకు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రముఖ డాక్టర్ గా, నెమ్మదస్తుడిగా ఇతనికి పేరుంది
చాలా కాలంగా తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ గా కిరణ్ రాయల్ ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈయనలో చాలా మైనస్ లు ఉన్నాయని పవన్ దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా నోటి శుద్ధి లేకపోవడం, మీడియాతో వెనుకా ముందూ చూసుకోకుండా మాట్లాడటం, హుందాగా వ్యవహరించకపోవడం కారణాలుగా చెబుతున్నారు. ఇదే సమయంలో గత నెలలో తిరుపతి పర్యటనకు వచ్చిన నాగబాబు సైతం కిరణ్ పై మండిపడినట్లు చెబుతున్నారు!
దీంతో... ఈ పరిస్థితుల్లో కిరణ్ రాయల్ కంటే పసుపులేటి హరిప్రసాద్ చాలా రెట్లు బెటర్ అనే ఆలోచనకు పవన్ వచ్చారని తెలుస్తుంది. హుందాతనంగా ఉండే హరిప్రసాద్ అయితేనే తిరుపతి లాంటి నియోజకవర్గానికి సెట్ అవుతారని, భూమన అభినయ్ కి గట్టిపోటీ ఇవ్వగలుగుతారని భావిస్తున్నారని తెలుస్తుంది. ఆల్ మోస్ట్ ఇదే ఫైనల్ అనే మాటలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయని సమాచారం!
కాగా... మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న డాక్టర్ హరిప్రసాద్ కు పవన్ కల్యాణ్ టీడీపీ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరుపతి జనసేన టిక్కెట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారని సమాచారం!