"వారాహి" దీక్ష విరమించిన పవన్ కల్యాణ్!
ఈ సందర్భంగా ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో ప్రత్యేక పూజలు చేశారు.
By: Tupaki Desk | 5 July 2024 10:19 AM GMTసమాజ క్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి అమ్మవారి దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గత కొన్ని రోజులుగా ఆదిత్య యంత్రం ఏర్పాటు చేసి దీని ఎదుట ఆశీనులైన జనసేన అధినేత.. ప్రత్యక్ష భగవానుడిని వేద పండితుల మత్రోచ్చరణల నడుమ పూజించిన సంగతి తెలిసిందే.
అవును... వారాహి దీక్షలో ఉండి సూర్యాధనలో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ తాజాగా ఆ దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో ప్రత్యేక పూజలు చేశారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేసే వారు! అయితే గత కొంతకాలంగా వెన్నుకు సంబంధించిన సమస్యను ఎదుర్కొంటున్నారు.
దీంతో సూర్య నమస్కారాలు చేయడానికి ఆయన కాస్త విరామం ఇచ్చారు. దానికి బదులుగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆదిత్య ఆరాధనను వారాహీ దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వర్తించారు. ఈ సందర్భంగా వేద పండితులు సూర భగవానుడి విశిష్టతను తెలియజేశారు. ప్రజల జీవన విధానంలో సూర్య నమస్కారాలు ఒక భాగమని వివరించారు.
ఇందులో భాగంగా... వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారని మహాభారతం చెబుతోందని అన్నారు. అదేవిధంగా... బ్రిటిష్ పాలకుల ప్రభావంతో అదివారం సెలవు దినంగా మారిపోయిందని.. వాస్తవానికి మన దేశ సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉందని.. రవివారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారని చెప్పుకొచ్చారు.