రాయలసీమ వైపు పవన్ వారాహి...టార్గెట్ అదేనట...?
మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమ మీద పవన్ కన్ను పడింది అని అంటున్నారు రాయలసీమలో బలిజ సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉన్నారు.
By: Tupaki Desk | 21 Aug 2023 5:22 PM GMTపవన్ కళ్యాణ్ మూడు విడతలుగా వారాహి యాత్ర ఇప్పటికే ఏపీలో చేశారు ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ వారాహి యాత్ర సక్సెస్ ఫుల్ గా సాగింది. ఆ తరువాత ఆయన విశాఖ జిల్లాలో వారాహి యాత్రను నిర్వహించారు నాలుగవ విడత వారాహి యాత్ర ఎపుడు ఎక్కడా అన్న చర్చ కొనసాగుతూండగానే ఒక ప్రచారం అయితే సాగుతోంది. ఈసారి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రాయలసీమ జిల్లాల గుండా సాగుతుంది అని.
రాయలసీమలోని నాలుగు జిల్లాలలో పవన్ వరసబెట్టి వారాహి రధాన్ని తిప్పుతారు అని తెలుస్తోంది. మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమ మీద పవన్ కన్ను పడింది అని అంటున్నారు రాయలసీమలో బలిజ సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని టార్గెట్ చేస్తూ పవన్ వారాహి యాత్ర సాగుతుంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రతీ జిల్లా నుంచి కనీసం ముగ్గురుకి తగ్గకుండా ఎమ్మెల్యేలను తన పార్టీ తరఫున గెలిపించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ఉమ్మడి ఏపీలో పదమూడు జిల్లాలు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే నలభై సీట్లకు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కోరుతారా అన్నది ఒక చర్చ అయితే తన బలాన్ని వారాహి యాత్ర తరువాత మరింతగా పెంచుకోవడం ద్వారా టీడీపీ మీద వత్తిడి పెంచి మరీ తాను కోరుకున్న సీట్లను కోరుకున్న నంబర్ ని సాధించుకోవాలని పవన్ చూస్తున్నారు అని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఒక వ్యూహం ప్రకారమే వారాహి యాత్రలో సీఎం పదవిని తీసుకుంటాను అని చెబుతున్నారు అంటున్నారు. ఆ విధంగా చెప్పడం ద్వారా జనసైనికులలో ఉత్సాహం వెల్లి విరుస్తుందని, అది ఓటు బ్యాంక్ మరింతగా పెరగడానికి కారణం అవుతుందని, ఈ గ్రాఫ్ ని చూపించి సీట్ల సంఖ్యను వీలైనంతగా పెంచుకోవాలన్నది పవన్ ఆలోచన అని అంటున్నారు.
ఇక్కడ టీడీపీ అవసరాన్ని పవన్ గమనించే క్యాష్ చేసుకోవడం అనే వ్యూహాన్ని అనుసరిస్తారు అని అంటున్నారు పవన్ ఒంటరిగా పోటీ చేసినా పోయిందేమీ ఉండదు, అదే టైం లో టీడీపీ విడిగా పోటీకి దిగితే నలభై నుంచి యాభై సీట్లలో జనసేన టీడీపీ ఓట్లకూ సీట్లకు గండి పెడుతుంది. అందువల్ల పొత్తు టీడీపీకే ఎక్కువగా అవసరం ఉందని జనసేన వర్గాలు ఊహిస్తున్నాయి.
ఇక రాయలసీమలో పవన్ వారాహి యాత్ర కూడా బలిజ సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడానికే అంటున్నారు. వీరంతా నిన్నటిదాకా టీడీపీ వైపు ఉంటూ వచ్చారు పొత్తులు ఉంటే టీడీపీతో కలసి ఈ ఓట్లు పంచుకోవడానికి జనసేన చూస్తుంది అని అంటున్నారు. ఒక వేళ అలా కాదు అనుకుంటే మాత్రం ఒంటరిగా పోటీ చేస్తే సీమలోనూ టీడీపీకి గండి పడుతుంది అని అంటున్నారు. ఇక సెప్టెంబర్ నెల అంతా పవన్ కళ్యాణ్ రాయలసీమలో వారాహి యాత్ర చేపడతారు అని అంటున్నారు.
చూడాలి మరి ఒక వైపు ఏపీ సీఎం జగన్ సొంత ప్రాంతం రాయలసీమ. అలాగే విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ప్రాంతం కూడా. అక్కడ చేరి పవన్ వారాహి యాత్రలో చేసే రచ్చ ఏపీ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా పొత్తు రాజకీయాల్లో ఏ రకమైన మార్పులు తీసుకుని వస్తుందో.