Begin typing your search above and press return to search.

ఎన్టీఏతో పొత్తుపై పవన్ వ్యాఖ్యలు అపార్థం చేసుకున్నారా?

పెడన సభలో ఎన్టీఏపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 Oct 2023 6:17 PM GMT
ఎన్టీఏతో పొత్తుపై పవన్ వ్యాఖ్యలు అపార్థం చేసుకున్నారా?
X

పెడన సభలో ఎన్టీఏపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో తప్పనిసరి అయి ఎన్‌డీఏ నుంచి ఒక అడుగు బయటకు వచ్చి టీడీపీకి మద్దతిచ్చానని పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. టీడీపీ-జనసేన పొత్తుకు ఎన్‌డీఏ ఆశీర్వాదం ఉంటుందని తాను అనుకుంటున్నానని పవన్ అన్నారు. దీంతో, ఎన్టీఏకు పవన్ పరోక్షంగా గుడ్ బై చెప్పినట్లేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని పవన్‌ దృష్టికి జనసేన నేతలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై పవన్ స్పందించినట్లు తెలుస్తోంది.

ప్రతీ వార్తకి ఎక్కడ స్పందిస్తామని పవన్ అన్నట్లు తెలుస్తోంది. ఎన్‌డీఏ నుంచి ఒక అడుగు బయటకు వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అని పవన్ ప్రశ్నించారని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో ఏపీలో పరిస్థితులను వివరిస్తానని, టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి దారి తీసిన పరిస్థితులను కూడా వివరిస్తానని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, చంద్రబాబు అరెస్టులో కేంద్రం పాత్ర ఉందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జగన్ అరాచకాల గురించి కేంద్రం పెద్దలకు చెబుదామని చాలాసార్లు అనుకున్నానని, కానీ, వారికి ఈ విషయాలు తెలుసు కాబట్టి చెప్పలేదని పవన్ పెడన సభలో అన్నారు. దీంతో, వైసీపీపై చేస్తున్న ఫిర్యాదులను కేంద్రం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి పవన్ లో ఉన్నట్లు పెడనలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రూవ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలు బేస్ చేసుకొని ఎన్డీఏకు పవన్ గుడ్ బై చెబుతున్నట్లు జాతీయ మీడియాలో సైతం ప్రచారం జరుగుతోంది.

ఇక, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన..టీడీపీతో పొత్తు గురించి మాట మాత్రం కూడా చెప్పలేదని కేంద్రం పెద్దలు కూడా పవన్ పై గుర్రుగా ఉన్నారట. ఎన్డీఏ మిత్రపక్షాల భేటీకి జనసేనను పిలిచినా..టీడీపీని పిలవలేదు. అటువంటి సమయంలో సొంతంగా నిర్ణయం తీసుకొని బీజేపీకి చెప్పకుండా టీడీపీతో పవన్ పొత్తుపెట్టుకోవడం అంటే..బీజేపీని వద్దనుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.