Begin typing your search above and press return to search.

అటు నుంచి పవన్...ఇటు నుంచి లోకేష్... రాజకీయ పొలికేక!

ఒక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరో వైపు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ యువగళం దాదాపుగా ఒకే సమయంలో ప్రారంభం కానున్నాయి.

By:  Tupaki Desk   |   25 Sep 2023 2:32 PM GMT
అటు నుంచి పవన్...ఇటు నుంచి లోకేష్... రాజకీయ పొలికేక!
X

ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కనుంది. చంద్రబాబు అరెస్ట్ తో యాత్రలు సభలు కోలాహలాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. టీడీపీ నిరసనలు చేస్తోంది. బాబు అరెస్ట్ మీద ఏమి జరుగుతుంది అన్న చర్చ తప్ప రాజకీయం మరేమీ లేకుండా పోయింది. ఒక విధంగా ఎన్నికలు దగ్గర పడుతున్న టైం లో చప్పగానే పాలిటిక్స్ ఉంది అని అంతా అనుకుంటున్న వేళ మళ్ళీ రాజకీయ రచ్చకు తెర లేస్తోంది

ఒక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరో వైపు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ యువగళం దాదాపుగా ఒకే సమయంలో ప్రారంభం కానున్నాయి. యువగళం తిరిగి ప్రారంభం అవుతుంది అని నారా లోకేష్ తాజాగా పార్టీ నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. బాబు అరెస్ట్ అయిన రోజు అంటే ఈ నెల 9న ఆయన గోదావరి జిల్లాలలో యాత్ర చేస్తున్నారు

అది ఎక్కడ ఆపారో అక్కడ నుంచే లోకేష్ యాత్ర స్టార్ట్ అవుతోంది అని అంటున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలతో మొదలెట్టి విశాఖలో మూడవ విడత వారాహి యాత్రను చేసిన పవన్ కళ్యాణ్ నాలుగవ విడత వారాహి యాత్రను ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో అక్టోబర్ 1 నుంచి ప్రారంభించనున్నారు.

ఇలా కనుక చూసుకుంటే అవనిగడ్డ నియోజకవర్గంలో మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల నుంచి పవన్ వారాహి యాత్ర సాగనుందని అంటున్నారు. ఈ వివరాలను సోమవారం జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలియచేశారు. ఈ మేరకు ఆయన ఉమ్మడి క్రిష్ణా జిల్లా జనసేన నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దీంతో ఏపీలో రాజకీయ అలజడికి తెర లేవనుంది. ఈసారి వారాహి యాత్ర కానీ లోకేష్ యువగళం కానీ చంద్రబాబు అక్రమ అరెస్ట్ మీద దృష్టి పెట్టుకునే సాగనున్నాయి. బాబుని రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారు అని వారు జనం మధ్యకు వచ్చి ప్రచారం చేయనున్నారు.

అదే విధంగా నారా లోకేష్ పాదయాత్ర విషయం తీసుకుంటే ఆయన కోనసీమ జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని పొదలాడ వద్ద లోకేష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో మళ్లీ అక్కడ నుంచే ఆయన పాదం కదపనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ తన తండ్రి చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు విషయంలో ఆసక్తిగా ఉన్నారు.

ఈ కేసు విచారణ మంగళవారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. దాంతో సుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి లోకేష్ యువగళం కొత్త డేట్ అన్నది ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఇంటింటికీ తిరిగి చంద్రబాబు అక్రమ అరెస్ట్ మీద ప్రజలకు నరుగా వివరించే ప్రయత్నం చేయనుంది. తెలుగుదేశం కార్యక్రమాలను సమీక్షించడానికి పొలిటికల్ యాక్షన్ కమిటీ కూడా రెడీ చేశారు.

దానిని జైలు నుంచే చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తూ ఎప్పటికపుడు తగిన సూచనలు చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద ఏపీ పాలిటిక్స్ ఫుల్ రీ చార్జి కానుంది అంటున్నారు. చూడాలి మరి ఈసారి రాజకీయ పొలికేక ఏ విధంగా కాక పుట్టిస్తుందో.