Begin typing your search above and press return to search.

స‌మీక్ష‌లు స‌రే.. ప‌వ‌న్ స‌ర్ ఏం తేలుస్తున్నారు..?

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వ‌చ్చీ రావ‌డంతో త‌న‌దైన మార్కు చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Jun 2024 9:30 AM GMT
స‌మీక్ష‌లు స‌రే.. ప‌వ‌న్ స‌ర్ ఏం తేలుస్తున్నారు..?
X

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వ‌చ్చీ రావ‌డంతో త‌న‌దైన మార్కు చూపిస్తున్నారు. వ‌రుస‌గా త‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేస్తున్నారు. ఆయా శాఖ‌ల తీరు తెన్నులు.. అధికారుల ప‌నితీరు.. వంటి వాటిని ఆయ‌న అంచ‌నా వేసుకుంటున్నారు. ఇదేస‌మ యంలో త‌న‌కు కేటాయించిన పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, అట‌వీ శాఖ‌ల్లో ఉన్న నిధుల‌ను కూడా ఆరాతీస్తున్నారు. దీంతో అధికారులు ఆయా వివ‌రాలు వెల్ల‌డిస్తున్నారు.

తాజాగా అందిన వివ‌రాల ప్ర‌కారం.. పంచాయ‌తీరాజ్ నిధుల‌ను పంచాయ‌తీల‌కు ఇవ్వ‌లేద‌ని తేలింది. అదేవిధంగా స్వ‌చ్ఛాంద్ర కార్పొరేష‌న్‌కు వ‌చ్చిన 2000 కోట్ల రూపాయ‌ల నిధులు కూడా స‌క్ర‌మంగా విని యోగించుకోలేద‌ని తెలిసింది. పైగా ప్ర‌స్తుతం రూ.7 కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే నిధులు ఉన్నాయ‌ని అధికా రులు గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు. ఇక‌, అట‌వీ శాఖ విష‌యానికి వ‌స్తే.. ఎర్ర చంద‌నం వ్య‌వ‌హారంపై ఎటూ తేల‌లేదు. దీంతో దీనిని ప‌క్క‌న పెట్టారు.

అయితే.. స‌మీక్ష‌ల ద్వారా.. ప‌వ‌న్ ఏం తేలుస్తున్నారు? ఎలాంటి కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే.. స‌మీక్ష‌లు చేయ‌డం వ‌రకు ఇబ్బంది లేదు. కానీ, ఇక నుంచి అడుగులు ప‌డ‌డ‌మే కీల‌కం. ప్ర‌స్తుతం కేంద్రం ఇస్తున్న గ్రాంట్ల‌ను దాదాపు కోత పెట్టారు. దీంతో రాష్ట్ర‌మే కొన్ని శాఖ‌ల వ్య‌వ‌హారాల్లో సొంత‌గా నిధులు స‌మ‌కూర్చుకునే ప‌రిస్థితి ఉంది. దీంతో ఇబ్బందులు రావ‌డం.. త‌ద్వారా.. గ్రాంటుగా ఇచ్చిన కొంత మేర‌కు నిధుల‌ను కూడా.. సంక్షేమానికి ఖ‌ర్చు చేయ‌డం కామ‌న్ అయింది.

దీనిని అరిక‌ట్టి.. అంటే.. ఆయా శాఖ‌ల‌కు కేటాయించిన నిధుల‌ను వాటికే ఖ‌ర్చు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న ప్ర‌కారం ముందుకు సాగాలంటే.. మ‌రింత ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాలి. నిధుల స‌మీక‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నం చేయా లి. అదేస‌మ‌యంలో సంక్షేమానికి ఇస్తున్న నిధుల‌తోనే స‌రిపోతున్న రాష్ట్ర ఖ‌జానాను పుంజుకునేలా చేయాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. ఇవ‌న్నీ..ఇప్ప‌టికిప్పుడు సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌. సో.. ఎలా చూసుకున్నా.. ప‌వ‌న్ త‌ల‌కు మించిన భారం ఎత్తుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.