Begin typing your search above and press return to search.

గోదావరి హీట్ : పవన్ తో ముద్రగడ భేటీ.....!?

గోదావరి జిల్లాలకు చెందిన కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారు అన్న వార్తలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   11 Jan 2024 8:54 AM GMT
గోదావరి హీట్ :  పవన్ తో ముద్రగడ భేటీ.....!?
X

గోదావరి జిల్లాలకు చెందిన కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారు అన్న వార్తలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన కొత్త ఏడాది తొలి రోజే తన అనుచర వర్గంతో కలసి ఆతీమ్య సమావేశం నిర్వహించారు. ఆ రోజునే ఆయన రాజకీయ రీ ఎంట్రీ మీద కధనాలు వచ్చాయి. సరైన సమయం చూసి ఆయన పొలిటికల్ గా తిరిగి ఎంట్రీ ఇస్తారు అని కూడా చెప్పుకున్నారు.

అంతే కాదు ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారు అని కూడా ప్రచారం సాగింది. ఈ మేరకు తరచూ వైసీపీ నేతలు ఆయనను కలవడంతో ముద్రగడ ఫ్యాన్ పార్టీ వైపే అని అంతా అనుకున్నారు. దానితో పాటు ఆయన ముఖ్యమంత్రి జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని కూడా ప్రచారంలో ఉంది.

ఇక ముద్రగడ కుటుంబానికి రెండు సీట్లు ఇస్తారని కూడా చెప్పుకున్నారు. అందులో కాకినాడ ఎంపీ సీటు పిఠాపురం అసెంబ్లీ ఉందని కూడా ప్రచారం సాగింది. ఈ మధ్యలో ముద్రగడ కోడలుకు తుని అసెంబ్లీ సీటు ఇస్తారని కూడా మరో ప్రచారం బయటకు వచ్చింది. అయితే వైసీపీ రిలీజ్ చేసిన రెండవ జాబితాలో చూస్తే పిఠాపురం అసెంబ్లీ సీటుకు కాకినాడ ఎంపీ వంగా గీత పేరుని ప్రకటించారు.

దాంతో ఇక మిగిలింది కాకినాడ ఎంపీ సీటు తుని సీటు అని అంటున్నారు. అయితే తుని నుంచి మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నారు. ఆయనను ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయమని సూచించినా ఆయన నో చెప్పారని అంటున్నారు. దాంతో దాడిశెట్టి రాజాకే తుని టికెట్ ఇస్తారని అంటున్నారు. అదే విధంగా కాకినాడ ఎంపీ సీటు విషయంలో కూడా వైసీపీ అధినాయకత్వం చలమలశెట్టి సునీల్ కి ఇవ్వాలని డిసైడ్ అయింది అని అంటున్నారు.

ఒక విధంగా వైసీపీ ఫైనల్ లిస్ట్ రెడీ అయిపోయింది అని అంటున్నారు. ముద్రగడ కోరుకున్న సీట్లకు కూడా వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసేసింది అని వినిపిస్తోంది. దాంతో ఇపుడు ముద్రగడ చూపు జనసేన వైపు ఉంది అని అంటున్నారు. ఇటీవల జనసేనకు చెందిన నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారని అంటున్నారు.

జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ, కాపు జేఏసీ నేతలు ఆయనతో సమాలోచనలు జరిపారు. అయితే తాము ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశామని నేతలు తెలిపారు. మరోవైపు రెండు మూడు రోజుల్లో జనసేన ముఖ్యనేతలు ముద్రగడను కలిసే అవకాశం ఉందని సమాచారం. జనసేన నేతలు తనను కలవడంపై ముద్రగడ పెదవి విప్పడం లేదు.

అదే విధంగా ముద్రగడ కూడా జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. దానికి ఈ నెల 4న కాపునేతలకు పవన్ రాసిన లేఖ కూడా కారణం అని అంటున్నారు. కాపు పెద్దలు తనను దూషించినా దీవెనల్లానే స్వీకరిస్తానని ఆ లేఖలో పవన్ తెలిపారు. కాపులను అధికార వైసీపీ రెచ్చగొడుతోందని ఆ కుట్రలో పావులుగా మారొద్దని పవన్ కాపు పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

అంతే కాదు కాపునేతలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ఆ లేఖ తరువాత పరిణామాలు కూడా చకచకా మారిపోయాయని అంటున్నారు. ఇక ఇపుడు ఇప్పుడు ముద్రగడతో జనసేన నేతలు సమావేశం కావడం, ఆయన కూడా త్వరలోనే పవన్‌ను కలుస్తారన్న సమాచారం నేపథ్యంలో గోదావరి రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాలు కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. ఏది ఏమైనా ముద్రగడ జనసేనలో చేరితే గోదావరి జిల్లాలలో భారీ సామాజిక రాజకీయ సమీకరణలు మారే చాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.