పిఠాపురంలో పవన్ విత్ వర్మ ..అంతా వ్యూహాత్మకమే...!
గతసారికీ ఈసారికి పవన్ లో చాలా మార్పు కనిపిస్తోంది. ఆయన రాజకీయంగా చూస్తే 2019 నుంచి 2024 నాటికి బాగానే రాటుతేలారు.
By: Tupaki Desk | 30 March 2024 12:30 PM GMTగతసారికీ ఈసారికి పవన్ లో చాలా మార్పు కనిపిస్తోంది. ఆయన రాజకీయంగా చూస్తే 2019 నుంచి 2024 నాటికి బాగానే రాటుతేలారు. తాను పవర్ స్టార్ అని ఓట్లేసి జనాలు గెలిపిస్తారు అన్న అతి విశ్వాసాన్ని పవన్ ఇపుడు పక్కన పెట్టేశారు. అలాగే తనకు బలమైన సామాజిక వర్గం ఉందని ఆయన ఇపుడు అనుకోవడం లేదు.
అడుగు తీసి అడుగు వేస్తున్న ప్రతీ చోటా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ పిఠాపురంలో మొదటి టూర్ లోనే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ ఇంటికి ఆయన వెళ్లడమే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.
వర్మ టీడీపీలో అగ్ర నేత ఏమీ కాదు, ఆయన పిఠాపురానికి సంబంధించిన నాయకుడు. కానీ ఆయన పిఠాపురం జనంలో ఉన్నారు. ఆయనకు అక్కడ కులాలకు అతీతంగా జనాల మద్దతు ఉంది. ఈ రోజుకె 2014లో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి సాధించిన భారీ మెజారిటీయే పిఠాపురంలో రికార్డు.
అందుకే పవన్ ఆయనతోనే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పవన్ వస్తూనే వర్మ ఇంటికే వెళ్లడం కూడా ఒక ప్రణాళిక ప్రకారమే అంటున్నారు. అంతే కాదు ఆయన వర్మ తల్లి అలివేలు మంగ పద్మావతి ఆశీస్సులను తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
దానితో పాటుగా వర్మతో గంటకు పైగా పవన్ పిఠాపురంలో ఏమి చేయాలి ఎలా చేయాలి అన్న దాని మీద కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. పిఠాపురం రాజకీయాల్లో కింగ్ మేకర్ గా వర్మ ఉన్నారు. ఆయన తలచుకుంటేనే ఎవరైనా గెలిచేది. ఆయన సొంత సామాజిక వర్గం తక్కువగానే ఉంది. కానీ ఆయనకు జనంలో మంచి పేరు ఉంది. అందుకే పవన్ వర్మ ఇంటికి కోరి వచ్చారు. తన ఆభిజాత్యాలను ఆయన విడిచి పెట్టి మరీ ఒక నియోజకవర్గం స్థాయి నేతకు ఎక్కువ మర్యాద మన్నన ఇచ్చారు.
ఇది చాలు పవన్ కి పిఠాపురంలో గెలుపు దారులు బలంగా ఏర్పడడానికి కారణం అవుతాయని చెప్పడానికి నిజానికి చూస్తే వర్మ కూడా పవన్ పిఠాపురం రాకుండానే తానే గెలిపిస్తాను అని చెప్పారు. పవన్ గెలుపు బాధ్యతలు మొత్తం తన మీద వేయాలని ఆయన కోరారు. ఒక విధంగా పవన్ గెలుపుని తన భుజాల మీద వేసుకుంటాను అని వర్మ ముందే ప్రకటించారు.
ఇపుడు పవన్ వర్మకు ఇస్తున్న ఆ మర్యాద మన్నన అన్నీ చూసాక కచ్చితంగా వర్మ ఆయన అనుచర వర్గం వందకు రెండు వందల శాతం కష్టపడి పనిచేస్తారు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. పిఠాపురంలో ఎటూ జనసేన అంతా పవన్ కోసం పనిచేస్తుంది. టీడీపీ బలంతో పాటు అన్ని వర్గాలు తనకు తోడుగా నిలవాలంటే ఏమి చేయాలో అదే పవన్ చేస్తున్నారు.
మొత్తానికి పవన్ పిఠాపురం టూర్ మాత్రం రాజకీయంగా ఆసక్తిని పెంచింది. అంతే కాదు ఆయన మొదటి అడుగులు కూడా ప్రత్యర్ధుల వూహలకు అందకుండా ఉన్నాయని అంటున్నారు. పవన్ పిఠాపురం రావడంతోనే జనసందోహం అంతా ఎక్కడ చూసినా కనిపించింది.
ఏకంగా గొల్లప్రోలు నుంచి పి. దొంతమూరు వరకూ అశేష ప్రజానీకం పవన్ కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన టీడీపీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కూడా పవన్ మాట్లాడారు. ఆయన అచ్చం ఎమ్మెల్యే అభ్యర్ధిగా మారిపోయారు. ఒక పార్టీ అధినేతగా కాకుండా ఆయన అందరితో కలసిపోయారు. చిన్న పిల్లలను ఎత్తుకున్నారు. చేతులు ఊపుతూ దారిపొడవునా తనను చూసేందుకు వచ్చిన జనాలను ఆయన పలకరించారు
అదే విధంగా వర్మను టీడీపీ పార్టీ నేత, మాజీ మంత్రి సుజన క్రిష్ణ రంగారావును కూడా పవన్ సత్కరించడం విశేషం. మొత్తానికి పిఠాపురంలో వర్మ విత్ పవన్ అన్న కాంబోతోనే ఎంట్రీ అదుర్స్ అనిపించారు. ఈ సూపర్ హిట్ కాంబోతో ఎన్నికల్లో ఓట్లను మొత్తంగా కొల్లగొట్టే స్తామని జనసేన టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు పవన్ పిఠాపురంలో పర్యటనలు చేయనున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం శనివారంతో లాంచనంగా ప్రారంభించినట్లు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.