చంద్రబాబును పరామర్శించిన పవన్... జనసేన - బీజేపీ పొత్తు?
ఈ క్రమంలో ఇటీవల పవన్, లోకేష్ లు తమ తమ పార్టీ నాయకులతొ భేటీ అవ్వడం, మూడు తీర్మానాలు చేయడం, నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని ప్రకటించడం తెలిసిందే.
By: Tupaki Desk | 4 Nov 2023 11:26 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ నెల 31న మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... చంద్రబాబు ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు 4 వారాల పాటు ఇంటర్మ్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది.
దీంతో బెయిల్ తర్వాత ప్రత్యేక విమానంలో హైదారాబాద్ చేరుకున్న చంద్రబాబు.. అక్కడ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. రెండ్రోజుల్లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో నేత్ర పరీక్షలతో పాటు సర్జరీ చేయించుకుంటారని సమాచారం.
అయితే చంద్రబాబు హైదరబాద్ కు వచ్చిన సమయంలో.. పవన్ కల్యాణ్.. వరుణ్ తేజ్ వివాహం నిమిత్తం ఇటలీలో ఉండిపోయారు. ఈ సమయంలో తిరిగివచ్చిన ఆయన చంద్రబాబునును కలిసి పరామర్శించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ తో కలిసి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు పవన్ కల్యాణ్. దీంతో... ఈ భేటీ అనంతరం తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు వ్యవహారం ఏ విధంగా కొలిక్కి వస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలవ్వుతుండటం గమనార్హం!
కాగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ ములాకత్ లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బాలయ్య, లోకేష్ లతో కలిసి బాబుని కలిసిన పవన్... బయటకు వచ్చిన అనంతరం టీడీపీతో పొత్తును ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెండు పార్టీలూ కలిసే పోటీచేస్తాయని ప్రకటించారు.
ఈ క్రమంలో ఇటీవల పవన్, లోకేష్ లు తమ తమ పార్టీ నాయకులతొ భేటీ అవ్వడం, మూడు తీర్మానాలు చేయడం, నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని ప్రకటించడం తెలిసిందే. అప్పటికే వరుణ్ తేజ్ వివాహం తేదీ ప్రకటన అయినప్పటికీ... ఆ తేదీని ప్రకటించారనే కామెంట్లు వినిపించాయి! అయితే... చాలా మంది భావించినట్లుగానే... నవంబర్ 1 న రెండువైపుల నుంచీ మేనిఫెస్టో మాట వినిపించలేదు!
ఆ సంగతి అలా ఉంటే... తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అది కాంగ్రెస్ పార్టీ మేలు కోరి తీసుకున్న నిర్ణయం అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరోపక్క తెలంగాణలో బీజేపీతో సీట్ల సర్ధుబాటు విషయంలో జనసేన చర్చలు జరుపుతుంది! కాగా... టీడీపీ - జనసేనలు ఏపీలో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే!