పవన్ వర్సెస్ పిఠాపురం.. అనుకున్నంత ఈజీయేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
By: Tupaki Desk | 1 April 2024 8:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి పోటీ చేయాలని భావించిన సత్యనారాయణ వర్మ ను కూడా పార్టీ అధినేత చంద్రబాబు మెత్తబరిచారు. సో.. పవన్ కు ఒక ఇబ్బంది అయితే తప్పిపోయింది. అంతేకాదు.. ఇక్కడ తొలి రోజు ఆయన పర్యటన చేపట్టిన వెంటనే వర్మ ఇంటికి వెళ్లి మరీ ఆయనను మచ్చిక చేసుకున్నారు. అయితే.. పవన్‌కు ఇక్కడ ఈజీయేనా? అనేది ప్రశ్న. వైసీపీ నుంచి బలమైన నాయకురాలు ఎంపీ వంగా గీత కూడా పోటీ చేస్తున్నారు. ఈమె కూడా కాపు నాయకురాలే కావడంతో పవన్‌కు క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా పెద్దగా కలిసివచ్చే అవకాశం తక్కువగా ఉంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెడుతోంది. అయినప్పటికీ ప్రధాన పోటీ వీరిమధ్యే ఎక్కువగా ఉండనుంది. అయితే.. పవన్‌కు ఈ ఎన్నికలు ప్రాణప్రదంగా మారాయి. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి.. కూడా ఆయన పరాజయం పాలయ్యారు. దీంతో నియోజకవర్గాలు, జిల్లాలను కూడా మార్చేసి.. ఇప్పుడు తూర్పు నుంచి తన సత్తా చాటాలని నిర్ణయించారు. అసెంబ్లీలో తన గళం వినిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. రెండు ప్రధాన ప్రశ్నలు పవన్‌ను వేధిస్తున్నాయి.
టికెట్ ప్రకటించి.. ప్రకటించగానే వంగా గీత లోకల్ అంశాన్ని ప్రస్తావించారు. పిఠాపురంతో తనకు ఎనలేని సంబంధం ఉందన్నా రు. అంతేకాదు.. నియోజకవర్గంలోని ప్రతి ఇల్లూ.. తన సొంతిల్లేనని చెప్పారు. తనకు తెలియనివారు నియోజకవర్గంలో లేరని అన్నారు. ఇలాంటి సమయంలో ఎక్కడి నుంచో వచ్చేవారికి ఇక్కడి ప్రజలు ఓటే యరని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇది కూడా వాస్తవమే.. స్థానికంగా ఎమ్మెల్యే ఉండాలని పిఠాపురం వాసులు కోరుకుంటున్నారు. ఇది పవన్‌కు కొంత ఇబ్బందిగానే మారింది.
ఆన్‌లైన్ చానెళ్లు చేసిన సర్వేల్లోనూ ఇదే విషయాన్ని పిఠాపురం వాసులు చెప్పుకొచ్చారు. పార్టీలకు అతీతంగా చూసుకుంటే.. తమకు స్థానిక నేత కావాలని కోరుకుంటున్నవారు ఎక్కువగా ఉన్నారు. అలాగని పవన్‌ను తాము వ్యతిరేకించడం లేదని కూడా అంటున్నారు. సినీ హీరోగా ఆయనకు గుర్తింపు ఉందని చెబుతున్నారు. దీనిని పవన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
ఇదేసమయంలో పవన్ విజిటింగ్ లీడర్ అనే టాక్‌ను కూడా వైసీపీ ప్రచారం చేస్తోంది. ఆయనకు ఇక్కడ సొంత ఇల్లు లేదని.. కనీసం ఎప్పుడు వస్తారో.. లేదో కూడా తెలియని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. దీంతో పవన్ ఈ విషయానికి కూడా సమాధానం సిద్ధం చేసుకోవాలి. ఏ నియోజకవర్గంలో అయినా.. ఈ సమస్య ఉంది. గత 2019 ఎన్నికల్లో హిందూపురంలో టీడీపీ నేత బాలయ్యకు కూడా ఇదేసమస్య ఎదురైంది. దీంతోఆయన అప్పటికప్పుడు ఇల్లు కట్టుకున్నారు. తన ఆధార్, ఓటు కార్డులను కూడా ఇక్కడకు మార్చుకున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా ఇక్కడ గెలుపు పవన్‌కు అత్యంత కీలకం. వ్యూహాలపై వ్యూహాలు వేస్తే తప్ప.. ఇక్కడ అనుకున్నంత ఈజీ అయితే కాదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.