మీడియా ముందుకు రాని ఉప ముఖ్యమంత్రి పవన్...రీజనేంటి...?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు తరువాత అన్నట్లుగా ఉంటున్నారు.
By: Tupaki Desk | 28 Jun 2024 3:36 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు తరువాత అన్నట్లుగా ఉంటున్నారు. ఆయన ఈ నెల 12న ఉప ముఖ్యమంత్రిగా ఏపీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన బాధ్యతలను అందుకున్నారు. అంతే కాదు ఎంతో ప్రధానమైన నాలుగు శాఖలను ఆయన చూస్తున్నారు. అవి కూడా పవన్ కి ఇష్టమైన శాఖలు కావడం విశేషం.
ఇదిలా ఉంటే పవన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మీడియా ముందుకు రావడం లేదు. వాస్తవానికి పవన్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటారు. అందుబాటులో కూడా ఉంటారు. కానీ ఆయన ప్రభుత్వ విధులలో చేరాక మాత్రం సీరియస్ గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వరసబెట్టి ఆయన సమీక్షలు చేపడుతున్నారు.
ఒక్కో రోజు రెండు మూడు శాఖలను కూడా చూస్తున్నారు. పవన్ ఒక విధంగా చెప్పాలీ అంటే ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ మీడియాను ఇప్పటిదాకా అడ్రస్ చేయలేదు. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వినాలని అభిమానులతో పాటు కోట్లాది జనం ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆయన ఒక బహిరంగ వేదికను పంచుకున్నారు. ఈనాడు అధిపతి రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. అదే ఆయన అధికారిక తొలి సభగా చూడాలి. పవన్ ఎందుకు మీడియాకు దూరం పాటిస్తున్నారు దానికి గల కారణాలు ఏంటి అన్నది చూస్తే కనుక ఆయన వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.
ఎందుకు అంటే పవన్ మీడియా ముందుకు వస్తే విలువైన సమాచారం తోనే రావాలి.ఆయన ఇపుడు ప్రభుత్వంలో ఉన్నారు. మీడియా సంధించే ప్రశ్నలకు ఆయన సాధికారికంగా సమాధానాలు ఇవ్వాలి. అందుకోసమే ఆయన తన శాఖల విషయంలో పట్టు సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన మొత్తం లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేస్తున్నారు.
ఆయన తన శాఖలలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల మీద కూడా సమగ్రమైన నివేదికను కోరారు. ఈ మొత్తం వివరాలతోనే ఆయన మీడియా ముందుకు వస్తారు అని అంటున్నారు. అపుడు ఆయన ఏ విషయం చెప్పినా అది సంచలనమే అవుతుంది అని అంటున్నారు. గత ప్రభుత్వ నిర్వాకాలను ఆయన ఒక్కోటిగా సేకరిస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా తాను ప్రజలకు చేయబోయేది ఏమిటి అన్నది కూడా ఆయన కసరత్తు చేస్తున్నారు.
వీటికి మించి పదవులు అన్నవి బాధ్యతతో తీసుకుని నిర్వహించాలని పవన్ బలంగా నమ్ముతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఆర్భాటం చేయడం కంటే సైలెంట్ గా పనిచేస్తూ అవసరమైన మేరకే మీడియాకు కనిపించి వినిపించాలని కూడా పవన్ ఆలోచనలుగా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి పవం మీడియా ముందుకు అయితే వస్తారు అని అంటున్నారు. అది ఎపుడూ అంటే వెయిట్ చేయాల్సిందే.