Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే గారి తాలూకూ నెంబర్ ప్లేట్ ట్రెండ్ కు భారీ చలానాతో చెక్

మంచి లక్షణాలు త్వరగా అబ్బకున్నా.. చెడ్డవి మాత్రం అమితమైన వేగంతో విస్తరిస్తుంటాయి.

By:  Tupaki Desk   |   17 July 2024 5:46 AM GMT
ఎమ్మెల్యే గారి తాలూకూ నెంబర్ ప్లేట్ ట్రెండ్ కు భారీ చలానాతో చెక్
X

మంచి లక్షణాలు త్వరగా అబ్బకున్నా.. చెడ్డవి మాత్రం అమితమైన వేగంతో విస్తరిస్తుంటాయి. ఏపీలో జరిగిన అధికార బదిలీ వేళలో.. ఎన్నికల్లో టీడీపీ కూటమి సంచలన విజయాన్ని సాధించిన వేళ.. పవన్ అభిమానులు పలువురు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ తమ వాహనాల మీద రాసుకోవటం.. అది కాస్తా ట్రెండ్ గా మారటం తెలిసిందే. చూస్తుండగానే ఇది అంతకంతకూ ముదిరిపోవటమే కాదు.. నెంబర్ ప్లేట్ల మీద నెంబరుకు బదులుగా.. ‘ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ రాసుకోవటం మొదలైంది.

ఈ తీరు సరికాదంటూ జనసేనాని.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఒక సభలో మాట్లాడారు. అయినప్పటికీ ఏపీలోని కొందరు యూత్ తో పాటు మరికొందరు వాహనదారులు నెంబరు ప్లేట్ పెట్టుకోవటానికి ఆసక్తి చూపటం లేదు. దీంతో.. ఈ తీరుకు చెక్ చెప్పేందుకు రవాణా శాఖ, పోలీసులు రంగంలోకి దిగారు. విశాఖపట్నం పోలీసులు చలానా అస్త్రాన్ని సంధిస్తున్నారు.

గడిచిన వారంలో విశాఖపట్నంలోని రవాణా శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తరహా నెంబర్ ప్లేట్లు ఉన్న 22 మందిపై కేసులు నమోదు చేసి.. ఏకంగా రూ.22,700 ఫైన్ విధించారు. రానున్న రోజుల్లో తనిఖీల తీవ్రత పెరుగుతుందని.. వాహనదారులు తమ వాహనాలకు ఉన్న ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లను తక్షణమే తొలగించాలని కోరుతున్నారు. ఫలానా ఎమ్మెల్యేగారి తాలూకా అన్నది చెల్లదని.. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలుకుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు తనిఖీల్లో గుర్తిస్తే.. సీజ్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరి.. ఏపీ వాహనదారుల్లో ఈ హెచ్చరిక ఏ మేరకు పని చేస్తుందో చూడాలి.