జగన్ పై పవన్ నిప్పులు: దేవుడనుకున్నోళ్లకు దెయ్యమై పీడిస్తున్నాడు!
వారాహి విజయయాత్ర -3లో భాగంగా ఆయన ఆదివారం రాత్రి గాజువాకలో నిర్వహించిన సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకొని ఘాటు విమర్శలు.. తీవ్ర ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 14 Aug 2023 4:17 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయయాత్ర -3లో భాగంగా ఆయన ఆదివారం రాత్రి గాజువాకలో నిర్వహించిన సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకొని ఘాటు విమర్శలు.. తీవ్ర ఆరోపణలు చేశారు. పలు సందర్భాల్లో వివిధ పోలికలతో జగన్ పై నిప్పులు చెరిగిన ఆయన.. జగన్ వ్యవహారశైలిని తనదైన శైలిలో ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
"ఎన్నికల ముందు బుగ్గలు నిమురుతుంటే.. కనిపించిన వారిందరికీ ముద్దులు పెడుతుంటే.. దేవుడొచ్చాడనుకున్నారు. జగన్ రెడ్డిని నమ్మారు. 151 సీట్లను ఇచ్చి దేవుడుకి దణ్ణం పెట్టారు. జగన్ పాలన మొదలయ్యాక ప్రజలకు అర్ధం అయింది. ఈయన దేవుడు కాదు.. దెయ్యమై భుజాల మీదకెక్కాడు అని తెలుకున్నారు. జగన్ కు అదృష్టం అందలం ఎక్కిస్తే... బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది. జగన్ ను ప్రజలు మరో ఆరో నెలలు భరించక తప్పదు. జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు చూస్తూ ఉండక తప్పదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం మనసులో ఆ దెయ్యం మీద ఉన్న కోపాన్ని ఓట్ల రూపంలో వేసి తరిమికొట్టండి" అంటే పిలుపునిచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ మీద సీఎం జగన్ మాట్లాడలేరన్న ఆయన.. కేంద్రం అంటే విపరీతమైన భయమన్నారు "విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ సమస్య మీద జగన్ కేంద్ర పెద్దలతో మాట్లాడలేడు. వారి వద్దకు వెళ్లి సొంత గనులు కేటాయించమని అడగలేడు.
ఎందుకంటే భయం. విపరీతమైన భయం. చుట్టూ అవినీతి కేసులు.. హత్యలు చేయించిన చరిత్రలు.. భూములు కాజేసిన ఘనతలు ఉన్న వాడికి భయం కాక ఇంకేం ఉంటుంది? కానీ నేను కేంద్ర పెద్దలతో మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశం తెరపైకి రాగానే, ఢిల్లీ వెళ్లి నాకున్న పరిచయాలతో కేంద్ర పెద్దలను కలిశాను. స్టీల్ ప్లాంటు అనేది కేవలం ఓ పరిశ్రమ కాదని, 32 మంది ప్రాణ త్యాగాలతో ముడిపడి ఉన్న భావోద్వేగ అంశమని కేంద్ర పెద్దలకు తెలియజేశాను. ఆయనకు 22 మంది ఎంపీలను ఇచ్చినా ఒక్కసారి కూడా కనీసం పార్లమెంటులో తన సభ్యుల చేత ప్లకార్డులు పట్టించలేకపోయాడు. విశాఖ స్టీల్ ప్లాంటు మనకు ఎంత అవసరమో చెప్పలేకపోయాడు" అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
1970ల నుంచి మూడు తరాలుగా విశాఖ ఉక్కు- ఆంధ్రా హక్కు అనే నినాదాన్ని ఇప్పటికీ మన గుండెల్లో ఉండిపోయిందన్నారు పవన్ కల్యాణ్. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. చట్టసభల్లో మాట్లాడాలన్నా తగిన ఎంపీల బలం తనకు లేకపోయిందన్న పవన్.. "ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కానీ నేను చెప్పిన మాట వింటారు. ఆలకిస్తారు. అయితే చట్టసభల్లో ఈ అంశాపై మాట్లాడే అవకాశం జనసేనకు లేకపోయింది. ప్రజలు నెత్తిన పెట్టుకున్న వైసీపీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో నోరు ఎత్తరు. కనీసం మాట్లాడరు. చివరకు నన్ను మాట్లాడమని సలహా ఇస్తారు. నేను కచ్చితంగా ప్రజలకు సంబంధించిన సమస్య కోసం ఎవరినైనా కలిసి మాట్లాడతాను. అవసరమైతే ప్రాధేయపడతాను. చివరికి అదీ కాకుంటే కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని అయినా విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా నా శక్తి మేరకు కృషి చేస్తాను" అని పేర్కొన్నారు.
జగన్ తన కేసుల కోసం, తన పనుల కోసం, కుటుంబసభ్యుల కోసం, కాంట్రాక్టుల కోసం కాళ్లు పట్టుకుంటారే తప్ప... జనం సమస్య మీద కాదన్న పవన్.. "నేను జనం కోసం పని చేస్తాను. వారికి సమస్య వస్తే దేనికైనా సిద్ధంగా ఉంటాను. 2019లో సైతం నేను ఎంతగానో అభిమానించే మోదీనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో విబేధించిన వాడిని. అలాగే అప్పటి ప్రభుత్వం చేసిన కొన్ని ప్రజా పాలసీలను వ్యతిరేకించి బయటకు వచ్చిన వాడిని. నాకు ప్రజలే మొదటి ప్రాధాన్యం. వారి సమస్యలే మొదటి అంజెండా" అని చెప్పారు. మోడీషాలు కానీ ఇతర పెద్దలు కానీ ప్రజల సమస్యలపై చెబితే వింటారని.. వారు స్పందిస్తారని.. కానీ వ్యక్తిగత లాభం గురించి.. సొంత సమస్యల గురించి మాట్లాడితే వారు దగ్గరకు కూడా రానివ్వరన్నారు. రాష్ట్ర ఎంపీలు ఏపీ ప్రజల పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఎంపీలంతా వ్యాపారులు.. పైరవీకారులే తప్పించి ప్రజల సమస్యల గురించి పట్టించుకోరని ఢిల్లీ పెద్దలు భావిస్తుంటారన్నారు.
జగన్ అనే వ్యక్తికి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏం పట్టదని.. ఆంధ్రప్రదేశ్ డవలప్ మెంటు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ ఇష్టానుసారం అప్పులు చేస్తున్నాడని పవన్ కల్యాణ్ ఆరోపించారు. "రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చాడు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వ భూముల దోపిడీ భారీగా జరుగుతోంది. ఎయిడెడ్ పాఠశాలల ఆస్తులను దోచుకోవడానికి పన్నాగం పన్నారు. ఉత్తరాంధ్రకు సిరులు నింపే సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు లేదు. వైసీపీ ప్రభుత్వ వచ్చాక రూపాయి పెట్టుబడి లేదు. విశాఖ నీటి అవసరాలు తీర్చలేదు. విశాఖలో దసపల్లా, సిరిపురం, రుషికొండ లాంటి విలువైన భూములను కళ్లెదుటే దోచేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని విలువైన భూముల మీద వైసీపీ కన్ను పడింది. మొదటిగా విశాఖను దోచుకొని తర్వాత మిగిలిన ప్రాంతాలను దోచేస్తారు" అంటూ ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణలోని జగన్ కు ఉన్న రూ.300 కోట్ల సొంత ఆస్తుల రక్షించుకోవడం కోసం, రెండు రాష్ట్రాల మధ్య మిగిలిపోయిన రూ.లక్ష కోట్ల ఆస్తుల పంపకాన్ని కనీసం అడగని వ్యక్తి జగన్ అన్ పవన్ కల్యాణ్.. తాను ఏమైనా మాట్లాడితే తన మీద నోరు వేసుకొని పడిపోవడం వైసీపీ నేతలకు తెలుసన్నారు. "నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని, నా తల్లిని, పిల్లలను తిట్టించినా నేనేమీ భయపడి పారిపోయేవాడిని కాదు. ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రజాక్షేత్రంలో మీ అసలు రంగు బయటపెట్టడంలో నేను మొండివాడిని. దేనికి అసలు తలవంచేవాడిని కాదు" అంటూ పేర్కొన్నారు.
గాజువాక నుంచి చెబుతున్నాను జగన్ నువ్వు ఎక్కిన గద్దె దిగిపో అంటూ మండిపడ్డ పవన్.. "ప్రజలు వస్తున్నారు సింహాసనం ఖాళీ చేయ్. జగన్ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఓట్లు చీలకూడదని ఎందుకు మాట్లాడతాను అంటే జగన్ ఒక దుర్మార్గుడు. ప్రకృతి వనరులను దోచుకుంటాడు. అందినకాడికి అక్రమాలు చేస్తూ రాక్షస పాలనను తలపిస్తోన్న జగన్ లో హిరణ్యకశిపుడు, హిరణ్యక్షుడు వంటి రాక్షసులు బతికే ఉన్నారని అనిపిస్తోంది" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.