Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ : మీటింగులా...షూటింగులా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెండి తెర మీద పవర్ స్టార్. ఆయన సినిమా కోసం లక్షలాది మంది ఎదురుచూస్తుంటారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 3:56 AM GMT
పవన్ కళ్యాణ్  : మీటింగులా...షూటింగులా ?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెండి తెర మీద పవర్ స్టార్. ఆయన సినిమా కోసం లక్షలాది మంది ఎదురుచూస్తుంటారు. పవన్ చేతిలో ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉన్నాయి. అయితే ఎన్నికలు రావడంతో ఆయన షూటింగులు ఆపు చేసుకుని పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేపట్టారు.

అలా ఏపీ అంతా ఆయన కలియతిరిగారు. కూటమికి ప్రచారం చేసి మంచి విజయాన్ని సాధించి పెట్టేలా చూసారు. ఎన్నికల ఫలితాలు రావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. పవన్ కి అత్యంత కీలకమైన శాఖ లతో కూడిన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు లభించాయి.

దాంతో పవన్ తనకు దక్కిన శాఖల విషయంలో పూర్తి అధ్యయనం చేస్తున్నారు. అదే విధంగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. పవన్ ఒక విధంగా చూస్తే ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన రాజకీయంగా ఇపుడు సీరియస్ పొలిటీషియన్ అని చెప్పాల్సి ఉంది.

దాంతో పవన్ సినిమాల సంగతి ఏంటి అంటే ప్రస్తుతానికి ఫుల్ స్టాపే అని అంటున్నారు. పవన్ దృష్టి అంతా ఇపుడు తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖల మీదనే ఉంది దాంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగానే బాధ్యతలు నిర్వహిస్తారని అంటున్నారు.

ఇదిలా ఉంటే పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కోసం ఆయన జూలైలో హాజరవుతున్నారని వస్తున్న వార్తలు అన్నీ నిరాధారం అంటున్నారు పవన్ ఇప్పట్లో సినిమాల వైపు చూడరని కూడా చెబుతున్నారు. ఆయన ఎంతో ఇష్టపడి ఎంచుకున్న రంగం రాజకీయం అని. ఇక ప్రజలు కూడా ఆయన మాటలు నమ్మి అధికారాన్ని అప్పగించారని ఈ నేపధ్యంలో కొన్నాళ్ల పాటు అయినా రాజకీయాల్లో సీరియస్ గా పనిచేసి ఒక గాడిలో పడిన తరువాత కొన్ని రోజులు సినిమాలకు కేటాయిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.

అందుకే పవన్ అసలు మంగళగిరి పార్టీ ఆఫీసుని వదిలి రావడం లేదు అని అంటున్నారు. ఆయన హైదరాబాద్ లోని తన నివాసాన్ని కూడా మార్చేసుకున్నారని అటు సచివాలయం ఇటు క్యాంప్ ఆఫీసు లేకపోతే మంగళగిరిలోని పార్టీ ఆఫీసు ఇలా పవన్ దిన చర్య ఉంటోందని అంటున్నారు.

అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా కుదుట పడాల్సి ఉందని ఏపీకి ఉన్న అనేక సవాళ్ళు కూడా మంత్రులకు హానీమూన్ లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తరువాతనే పవన్ షూటింగ్స్ ఉంటాయని చెబుతున్నారు. ఏది ఏమైనా తాను ఇప్పటిదాకా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఆ మీదట కొత్త వాటిని ఒప్పుకోవాలా వద్దా అన్నది పవన్ ఆలోచిస్తారు అని అంటున్నారు. సో ప్రస్తుతానికి మీటింగులే తప్ప నో షూటింగులు అన్నది జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం గా ఉంది.