Begin typing your search above and press return to search.

పిఠాపురంలో పవన్...సర్వేలు ఏమి చెబుతున్నాయ్...!?

పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద రెండు సర్వేలు ఫిబ్రవరి నెలలోనే చేయించుకున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 8:11 PM GMT
పిఠాపురంలో పవన్...సర్వేలు ఏమి చెబుతున్నాయ్...!?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అంటే ఈ రోజుకీ అధికారిక సమాచారం అయితే లేదు. ఇప్పటికి వారం క్రితం టీడీపీ జనసేన తొలి జాబితాలు రిలీజ్ చేశాయి. అందులో 94 మందితో టీడీపీ లిస్ట్ రిలీజ్ చేస్తే అయిదింట అభ్యర్ధులను జనసేన ప్రకటించింది. టీడీపీ లిస్ట్ లో ఫస్ట్ జాబితాలో చంద్రబాబు లోకేష్ ఉన్నారు.

మరి జనసేన ఫస్ట్ జాబితాలో పవన్ పేరు లేకపోవడం ఆశ్చర్యమే అని అంటున్నారు. ఇక శనివారం బీజేపీ జాతీయ స్థాయిలో తొలి జాబితా రిలీజ్ చేస్తే అందులో ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా వంటి వారు ఉన్నారు. పార్టీ పెద్దలు తొలి జాబితాలో ఉండడం ఆనవాయితీ. నాయకుడే యుద్ధంలో ముందు ఉంటారు.

కానీ జనసేన తొలి జాబితా డిప్యూటీ లీడర్ నాదెండ్ల మనోహర్ తో మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారు అని పెద్ద ఎత్తున టాక్ సాగింది. దానికి రుజువు అన్నట్లుగా ఆయన భీమవరం వెళ్లి టీడీపీ నేతలతో సమావేశం జరిపారు. వారి మద్దతుని కూడా అడిగినట్లుగా వార్తలు వచ్చాయి.

అది అలా ఉండగానే పిఠాపురంలో పవన్ అన్నది కొత్త న్యూస్. అయితే ఇది జనసేన వర్గాలకు అంతర్గతంగా తెలిసిన న్యూస్ అని అంటున్నారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద రెండు సర్వేలు ఫిబ్రవరి నెలలోనే చేయించుకున్నారు అని అంటున్నారు. ఆ సర్వేలు తేల్చినది ఏంటి అంటే మొత్తం రెండున్నర లక్షల మంది దాకా ఉండే పిఠాపురం జనాభాలో అరవై వేల మంది దాకా కాపులు ఉన్నారుట. వారంతా గుత్తమొత్తంగా పవన్ కి ఓటేస్తే మిగిలిన సామాజిక వర్గాల వారు కూడా కలసి వస్తే కచ్చితంగా పవన్ విజయమే కాదు భారీ మెజారిటీ కూడా సాధిస్తారు అని అంటున్నారు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే పిఠాపురంలో మొత్తం రెండున్నర లక్షల మందిలో అరవై వేల మంది కాపులు ఉంటే మిగిలిన లక్షా తొంబై వేల మంది బీసీలు ఎస్సీ బడుగులు ఇతర సమాజిక వర్గాల వారు. మరి వారంతా కూడా ఓటు వేయాలి కదా అన్నది చర్చగా ఉంది. గోదావరి జిల్లాలలో బీసీలు ఎస్సీ ఇతర సమాజిక వర్గాలకు విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీలకు కాపులకు పడదు అని ప్రచారంలో ఉంది.

ఒక విధంగా కులాల వారీగా చీలిపోయిన నేపధ్యం అంతటా ఉంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు కాపులు అంతా కట్టకట్టుకుంటే అది మేలే కానీ మిగిలిన వారు ఈ ఐక్యత చూసి రివర్స్ అవుతారు. ఆ ఓటు అపుడు ప్రత్యర్ధికి సునాయాసంగా టర్న్ అవుతుంది. ఈ సామాజిక సమీకరణలు ఇబ్బందులు కూడా ఉన్నాయని అంటున్నారు.

ఇక పిఠాపురంలో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ గెలిచి మూడు దశాబ్దాలు గడచింది. ఆ పార్టీ 1983 నుంచి మూడు సార్లు మాత్రమే గెలిచింది. ఇక కాపులే ఎక్కువ సార్లు ఇక్కడ గెలిచారు. అదొక హిస్టరీ. అంతే కాదు లోకల్స్ కి ఇక్కడ పెద్ద పీట వేస్తారు. అంటే అభ్యర్థి తమ ప్రాంతంలో ఉండాలని తమకు కనిపించాలని మంచికీ చెడ్డకు తమకు అందుబాటులో ఉండాలన్న సెంటిమెంట్ ఈ నియోజకవర్గం వారికి ఉంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఇక్కడ గతంలో కాంగ్రెస్ కి బాగా బలం ఉంది. అనేక సార్లు గెలిచింది అదంతా ఇపుడు వైసీపీకి టర్న్ అయింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009లో వంగా గీత గెలిచారు. ఇపుడు ఆమె వైసీపీలో ఉన్నారు. అయితే ఆమెకు అప్పట్లో వేయి ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ కి టీడీపీకి కూడా ఆమెతో సరిసమానంగా ఓట్లు వచ్చాయి.

2019లో అయితే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 28 వేల ఓట్లు వచ్చాయి. ఆమె స్థానికంగా ఉంటూ కష్టపడ్డారు. దాంతో ఆమెకు ఆ ఓటు షేర్ వచ్చింది అని అంటున్నారు. ఇక ఇపుడు చూస్తే టీడీపీలో మాజీ ఎమ్మెల్యే వర్మ బలంగా ఉన్నారు. ఆయన 2014లో ఇండిపెండెంట్ గా గెలిచి సత్తా చాటిన వారు. ఆయన తనకు టికెట్ దక్కకపోతే 2014 రిపీట్ అవుతుంది అని అంటున్నారు. ఆయనకు సొంత ఇమేజ్ ఉంది. ఇలా కనుక చూసుకుంటే పిఠాపురంలో జనసేన పోటీ అంటే అన్ని వర్గాలను కలుపుకుని పోవాలి. అదే సమయంలో టీడీపీ జనసేన ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కలసి పనిచేస్తే పవన్ విజయం ఖాయమని అంటున్నారు.