Begin typing your search above and press return to search.

పవన్ కాంగ్రెస్ పెద్దలను కలవడం వెనక బిగ్ ట్విస్ట్ ఉందా ?

కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకుని రావడం కోసం ఆయన అధికారిక పర్యటన పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   10 Aug 2024 11:48 AM GMT
పవన్ కాంగ్రెస్ పెద్దలను కలవడం వెనక బిగ్ ట్విస్ట్ ఉందా ?
X

కాంగ్రెస్ హఠావో అని 2014 మార్చి 14 న హైదరాబాద్ లో తన పార్టీ జనసేనను ప్రారంభించినపుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పవర్ ఫుల్ స్లోగన్. దానికి తగినట్లుగానే ఆయన ఎక్కడా కాంగ్రెస్ ప్రముఖులను ఈ పదేళ్లలో కలిసింది లేదు. అలాంటిది హఠాత్తుగా పవన్ బెంగళూరు వెళ్లారు. అది కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో.

కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకుని రావడం కోసం ఆయన అధికారిక పర్యటన పెట్టుకున్నారు. అయితే ఆయన అక్కడ కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్యను కలిశారు. సంబంధిత కాంగ్రెస్ మంత్రిని కూడా కలిశారు. అధికార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇదంతా బాగానే ఉంది.

కానీ పవన్ బెంగళూరు పర్యటన మీద రాజకీయ చర్చ కూడా సాగుతోంది. పవన్ కళ్యాణ్ కోరి మరీ కాంగ్రెస్ పెద్దలను కలవడం వెనక బిగ్ ట్విస్ట్ ఉందని పుకార్లు అయితే షికార్లు చేస్తున్నారు. ఆయనను చంద్రబాబే ఒక సీరియస్ మ్యాటర్ కోసం పంపించారు అని అంటున్నారు.

ఏపీ రాజకీయాలను ఇపుడు బెంగళూరు ప్రభావం చేస్తోంది. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వైసీపీ అధినాయకత్వం టచ్ లో ఉందని వార్తలు కూడా అధికంగా వస్తున్నాయి. తద్వారా కాంగ్రెస్ తో సాన్నిహిత్యం నెరిపి ఇండియా కూటమిలో చేరేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది అని అంటున్నారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన వైసీపీ ధర్నాలో ఇండియా కూటమి పెద్దలు కనిపించారు. దాంతో వైసీపీ రూట్ పొలిటికల్ గా ఏంటి అన్నది క్లియర్ అవుతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎన్డీయే కూటమికి ఇక సహకారం ఉండదని వైసీపీ చెబుతోంది. బీజేపీ టీడీపీ జనసేనతో కలసి ఉండడంతో అది కుదిరే వ్యవహారం కాదు. పైగా రాజకీయంగా చూసినా వైసీపీ మళ్ళీ బలపడాలీ అంటే ఇండియా కూటమి వైపు ఉండడమే బెటర్ అని కూడా ఆ పార్టీ భావిస్తోంది.

ఈ పరిణామాల నేపధ్యంలో ఇండియా కూటమికి వైసీపీ దగ్గర కావడంతో ఏపీలోని పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ని ఇండియా కూటమికి దగ్గర చేయకుండా ఉండేందుకు చంద్రబాబు తన మార్క్ పాలిటిక్స్ కి తెర తీశారు అని అంటున్నారు.

జగన్ కి జాతీయ స్థాయిలో ఏ కూటమి కానీ పార్టీ అండ కానీ లేకుండా చేస్తేనే వైసీపీ నిర్వీర్యం అవుతుంది అన్నది బాబు మార్క్ ఆలోచన అని అంటున్నారు. కాంగ్రెస్ తో వైసీపీ సాన్నిహిత్యంగా ఉంటూ ఇండియా కూటమిలో చేరితే మాత్రం అది ఏపీ తెలంగాణా రాజకీయాల మీద కూడా తీవ్ర ప్రభావం పడేలా ఉంటుందని బాబు తనదైన సందేశాన్ని కర్ణాటక కాంగ్రెస్ నేతలకు పవన్ ద్వారా పంపించారు అని అంటున్నారు.

నిజానికి చూస్తే కాంగ్రెస్ లోనూ టీడీపీ అధినాయకత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి. డీకే శివకుమార్ వంటి ట్రబుల్ షూటర్స్ తోనూ స్నేహం ఉంది. ఒక విధంగా జాతీయ రాజకీయాల్లో టీడీపీ ఇపుడు కీలకంగా ఉంది. దాంతో పాటు అయిదేళ్ళు ఎన్డీయే సర్కార్ ని నడవనీయకుండా చేయాలి అని ఇండియా కూటమి పెద్దలు భావిస్తున్నారు. అదే జరిగితే బాబు టీడీపీ అలాగే బీహార్ లోని జేడీయూతో టచ్ లో ఉండడం ఇండియా కూటమికి కూడా అవసరమే అని అంటున్నారు.

దాంతో వైసీపీని దగ్గర చేసుకుని టీడీపీతో భవిష్యత్తు అవసరాలు ఏమైనా ఉంటే వాటిని లేకుండా చేసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే పవన్ ఇలా బెంగళూరు వెళ్ళి వచ్చారో లేదో జగన్ కూడా అదే బెంగళూరు కి వెళ్ళారు. ఆయన తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.

ఒక విధంగా చూస్తే వైసీపీకి ఇపుడు జాతీయ స్థాయిలో అగ్ని పరీక్షగానే ఉంది. ఇండియా కూటమి అండ దొరకపోతే వైసీపీ ఇబ్బందుల పాలు కావడం ఖాయమని అంటున్నారు. చంద్రబాబు అపర చాణక్యం కనుక ఫలిస్తే వైసీపీకి ఇండియా కూటమి నుంచి ఆహ్వానం దక్కకపోవచ్చు అని అంటున్నారు. లేదా పూర్తిగా కండిషన్లు పెట్టి కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేయాలని కూడా కోరవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ పాలిటిక్స్ కి కేంద్ర బిందువుగా బెంగళూరు మారుతుంది అని అంటున్నారు.