పవన్ పురంధేశ్వరికి అపాయింట్మెంట్ ఇవ్వరా...?
పురంధేశ్వరి తానే ఫోన్ చేసి అడిగినా పవన్ కళ్యాణ్ భేటీకి ముందుకు రాకపోవడం ఏంటి అన్నదే పెద్ద సందేహంగా ఉంది అంటున్నారు.
By: Tupaki Desk | 25 July 2023 5:39 PM GMTజనసేన అధినేతది జాతీయ స్థాయి ఇమేజ్ అని ఆ పార్టీ వారు అంటూంటారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తాను కేంద్ర నాయకులతో హాయిగా ఉంటానని ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. ఏపీ నాయకులతోనే గ్యాప్ ఉంది అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చేవారు అది సోము వీర్రాజు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న టైం లో ఇపుడు ఏపీ బీజేపీ కి కొత్త సారధి వచ్చారు. దగ్గుబాటి పురంధేశ్వరిని కేంద్ర నాయకత్వం ఏరి కోరి నియమించింది. ఆమె కేంద్రం లో మంత్రిగా పనిచేసారు. రెండు సార్లు ఎంపీ గా గెలిచారు. అన్నిటికీ మించి ఘనమైన రాజకీయ వారసత్వం ఆమె సొంతం. అన్న నందమూరి వారి ఇంటి ఆడపడుచు.
అలాంటి ఇమేజ్ ఉన్న పురంధేశ్వరి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కాగానే పవన్ కళ్యాణ్ కూడా సంతోషించి ఆమెకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఇక ఏపీ బీజేపీ తో జనసేనానుబంధం గట్టిగానే ఉంటుందని అంతా కలసి జోడెద్దుల మాదిరిగా జోరు పెంచుతారు అని అంతా అనుకున్నారు. దానికి తగినట్లుగానే పురంధేశ్వరి కూడా బాధ్యతలు స్వీకరించగానే తాను పవన్ తో మాట్లాడుతానని ఏపీ లో రెండు పార్టీలు కలసి ముందుకు సాగుతామని చెప్పారు.
అయితే పవన్ ఢిల్లీ మీటింగ్ జరిగి వారం అయింది. ఇక ఏపీ లో పురంధేశ్వరికి పదవి దక్కి పదిహేను రోజులు అయింది. అయినా సరే ఈ ఇద్దరు నేతలూ భేటీ అయినది లేదు. దీంతో అసలు వీరి భేటీ ఇప్పట్లో ఉంటుందా అన్న చర్చ అయితే వస్తోంది. ఎందుకంటే పురంధేశ్వరి ఇపుడు జిల్లా టూర్లు పెట్టుకున్నారు. ఈ నెలాఖరు దాకా ఆమె టూర్లతో ఉంటారు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు బ్రేకులు పడ్డాయి. ఆయన మళ్ళీ ఎక్కడ నుంచి యాత్రను చేపడతారో తెలియదు.
ఇక ఏపీ లో ఎన్డీయే సర్కార్ వస్తుందని కుండబద్ధలు కొట్టి చెప్పిన పవన్ కళ్యాన్ ఏపీ బీజేపీ నేతల తో కలసి ప్రయాణం చేస్తారా లేక ఆయన జాతీయ నాయకులతోనే భేటీలు వేస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి. పవన్ జాతీయ నాయకులతో భేటీ అయి తాను చెప్పదలచుకున్నది వారితోనే ఏపీ బీజేపీ నేతలు చెప్పిస్తారు అని అంటున్నారు.
ఆ విధంగా తన ఇమేజ్ ని నేషనల్ లెవెల్ లోనే ఉంచుకుంటూ ఏపీ లో మాత్రం తన పార్టీ తన మానాన ముందుకు సాగే విధంగా వ్యూహాలు రూపొందించుకుంటారని అంటున్నారు. మరో వైపు నుంచి చూస్తే ఏపీ లో బీజేపీ కి టీడీపీ కి ఇంకా పొత్తులు పొడవలేదు. అసలు పొడుస్తుందో లేదో తెలియదు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆదికి ముందు పవన్ ఏపీ బీజేపీ నేతల తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగితే టీడీపీతో పొత్తు లేకపోతే జనసేనాని వెనక్కి తిరిగి రాలేడని చంద్రబాబు స్కెచ్ మేరకే పవన్ ఈ భేటీకి ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు తన తండ్రి స్థాపించిన టీడీపీ ని దెబ్బతీయడానికి పురంధేశ్వరి చూస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది అని అంటున్నారు. పొత్తులు అంటే ఏపీ లో బీజేపీ టీడీపీ జనసేన ఉండేలా ఆమె చూసుకుంటారని అంటున్నారు. అందుకే పవన్ తో భేటీ సంగతి ఎలా ఉన్నా ఏపీలో టీడీపీతో పొత్తు కూడా ఆమె ఆలోచించవచ్చు అన్న ప్రచారం కూడా ఉంది అంటున్నారు.
ప్రస్తుతానికి పురంధేశ్వరి వైసీపీనే విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆమె భవిష్యత్తు అడుగులు ఏంటి అన్నది కూడా ఆలోచించిన మీదటనే పవన్ పనిచేయడానికి చూస్తారు అని మరో ప్రచారం ఉంది. సరే ఇవన్నీ ఇలా ఉంటే పురంధేశ్వరి తానే ఫోన్ చేసి అడిగినా పవన్ కళ్యాణ్ భేటీకి ముందుకు రాకపోవడం ఏంటి అన్నదే పెద్ద సందేహంగా ఉంది అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ తో పొత్తులు అన్నది ఇపుడు కీలకంగా ఉంది. అది తేలితేనే తప్ప ఏపీ లో జనసేన టీడీపీల మధ్య కూడా జోరు జోడూ సాగదు అని అంటున్నారు.