Begin typing your search above and press return to search.

పిఠాపురం ప్రయోగశాల...పవన్ ప్లాన్ అదే !

ఇటీవల కాలంలో ఆ శాఖ మీద ఆయన చేస్తున్న సమీక్షలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచింపజేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 July 2024 1:30 AM GMT
పిఠాపురం ప్రయోగశాల...పవన్ ప్లాన్ అదే !
X

పిఠాపురం నుంచి తొలిసారి గెలిచి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ చేతిలో అయిదు కీలకమైన శాఖలు ఉన్నాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ తాగు నీరు, అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఎంతో ముఖ్యమైన శాఖలను పవన్ చూస్తున్నారు.

ఇక వీటిలో పర్యావరణం మీద పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఆ శాఖ మీద ఆయన చేస్తున్న సమీక్షలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచింపజేస్తున్నాయి. డబ్బు ఖర్చు కాకుండానే మార్పులను తీసుకుని రావచ్చు అని పవన్ చెబుతున్న మాటలు తెలియచేస్తున్నాయి.

తొందరలో హిందువుల అతి ముఖ్యమైన పండువ వినాయక చవితి రాబోతోంది. ఈ పండుగ సందర్భంగా అంతా మట్టి వినాయకులను వినియోగించాలని పవన్ పిలుపు ఇచ్చారు కాలుష్యం కోరల నుంచి నదీ జలాలు చిక్కుకోకుండా ఇదే సరైన తరుణోపాయమని పవన్ చెబుతున్నారు. గతంలో కూడా మట్టి వినాయకుడిని పూజించాలని చెప్పినా పవన్ లాంటి పవర్ స్టార్ ఆ మాట చెబితే ఆ ప్రభావం వేరే లెవెల్ లో ఉంటుంది అన్నది నిజం.

పైగా యువత అంతా పవన్ మాటలను బాగా అనుసరిస్తారు. చవితి పందిళ్లను వేసేది సందడి చేసేది వారే. దాంతో ఈసారి మట్టి వినాయకులు ప్రతీ పందిళ్ళలో కనిపించడం ఖాయమని అంటున్నారు. అదే విధంగా ఆలయాలలో ప్రసాదాలు పంపిణీ చేసినపుడు ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారని అలా కాకుండా ఆకులతో చేసిన దొన్నెలను వాడాలని పవన్ సూచించారు. దీని వల్ల పర్యావరణ హితంగా ఉంటుందని ఆయన అంటున్నారు.

అదే విధంగా ప్లాస్టిక్ సహా వ్యర్ధాలను ఇష్టం వచ్చినట్లుగా రోడ్ల మీద పారవేయడం వల్ల కాలుష్యం పేరుకుపోతోందని గోవులను పూజించే మనమే వాటి ప్రాణాలకు ఈ విధంగా తీస్తున్నామని పవన్ అంటున్నారు. ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను తిని ఆవులు అకాల మృత్యువాత పడుతున్నాయని కూడా పవన్ అంటున్నారు. అలాంటి వ్యర్థాలను కనుక రీసైక్లింగ్ చేసి వినియోగించుకుంటే ఎంతో మేలు జరగడమే కాకుండా సంపద సృష్టి జరుగుతుందని ఆయన చెబుతున్నారు.

పనికిరాదని పడేసే చెత్తతో కోట్ల రూపాయల సంపద సృష్టించవచ్చని, లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలాంటి ఘన వ్యర్థాలను 12 గంటల్లోపు సేకరించగలిగితే సంపద వస్తుందని అన్నారు. అయితే వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయంగా చేపట్టాలి అన్నారు. ఈ విధంగా చేస్తే ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే ఏడాదికి రూ.2643 కోట్ల సంపద సృష్టించడం తో పాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చునని పవన్ చెప్పడం విశేషం.

ఈ కార్యక్రమాలు అన్నీ కూడా పైలెట్ ప్రాజెక్టులుగా పిఠాపురంలోనే ప్రారంభిస్తామని పవన్ చెప్పారు. దానిలో వచ్చిన ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ప్రణాళికలు రూపొందిస్తామని పవన్ అన్నారు. సర్వీసు అంటే ఎవరూ ముందుకు రారు. చెత్తతో సంపద వస్తుంది అంటేనే ముందుకు వస్తారు. ఈ ప్రాజెక్టును పిఠాపురం నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేయడానికి మేము ఏమీ చేయాలో అన్నీ చేస్తామని పవన్ చెప్పుకొచ్చరు. అంతే కాదు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తామని చెబితే వారి సాయం తీసుకుంటామని అన్నారు.

మొత్తానికి పవన్ పిఠాపురాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి అక్కడే తాను అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి ఆ మీదట ఏపీలో వాటిని అమలు చేయాలని సంకల్పిస్తున్నారు. దాంతో ఈ ప్రాజెక్టుల కోసం పిఠాపురం వైపు అంతా చూడాల్సి ఉంటుంది. పిఠాపురాన్ని అందరూ చూసేలా చేస్తాను అన్న పవన్ మాటలు ఇపుడు అక్షర సత్యం కాబోతున్నాయి అని అంటున్నారు.