పవన్ సంచలనం: నా నిర్ణయాల్ని వ్యతిరేకించేటోళ్లంతా కోవర్టులు!
చెప్పాల్సిన మాటను సూటిగా.. సుత్తి లేకుండా ముఖం మీద చెప్పేయటం అంత తేలికైన విషయం కాదు.
By: Tupaki Desk | 2 Dec 2023 4:44 AM GMTచెప్పాల్సిన మాటను సూటిగా.. సుత్తి లేకుండా ముఖం మీద చెప్పేయటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. ఆ తెగువనే ప్రదర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజకీయంగా పార్టీ ఏం నిర్ణయం తీసుకోవాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? లాంటి అంశాల్ని తనకు వదిలేయాలని స్పష్టం చేసిన పవన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్య చేశారు. తాను తీసుకునే ఏ నిర్ణయం అయినా అందరికీ మంచే జరుగుతుందన్నారు.
తాను తీసుకునే నిర్ణయాలు విశాల దృక్పథంతో తీసుకుంటానని.. తాను తీసుకునే నిర్ణయాలు.. వాటి లక్ష్యాలు ప్రధాని నరేంద్ర మోడీ.. నడ్డా.. చంద్రబాబుకు అర్థమైనట్లుగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించటం గమనార్హం. తాను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సందేహించి.. తప్పు పట్టే నాయకులు తనకు అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత ఎన్నికల పోటీలో నిలిచామని.. బీజేపీ నమ్మి ఎనిమిది స్థానాలు కేటాయించిందని చెప్పారు.
ఏపీలో ఎలాంటి పొరపొచ్చాలకు అవకాశం లేకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్న పవన్.. ‘‘ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అధికారం సాధించాలన్న కసితో పని చేద్దాం. వైసీపీ లేని రాష్ట్రాన్ని తయారు చేద్దాం’’ అంటూ పిలుపును ఇవ్వటం గమనార్హం పొత్తు ధర్మం గురించి.. అధికార పంపిణీ గురించి ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంత అద్భుత విజయాన్ని సాధిస్తామన్న పవన్ వ్యాఖ్యలు క్లారిటీతో పాటు.. తాను తీసుకునే నిర్ణయాల్ని ఎవరు వ్యతిరేకించినా.. అభ్యంతరం వ్యక్తం చేసినా.. వారిని వదిలించుకోవటానికి తనకు ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని క్లారిటీగా చెప్పేయటం గమనార్హం. మరి.. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఎలా రియాక్టు అవుతారన్నది చూడాలి.