Begin typing your search above and press return to search.

బైక్ రేసింగ్ అన్న పదం పవన్ కళ్యాణ్ వాడవచ్చా ?

పైగా పవన్ ఏమి చెప్పినా ఏమి చేసినా యూత్ ఆకర్షితులు అవుతారు.

By:  Tupaki Desk   |   5 July 2024 12:30 AM GMT
బైక్ రేసింగ్ అన్న పదం పవన్ కళ్యాణ్ వాడవచ్చా ?
X

పవన్ కళ్యాణ్ ఇపుడు ప్రతిపక్షంలో లేరు. ఆ మాటకు వస్తే ఆయన బాధ్యత కలిగిన జనసేన అధినేతగా గత పదేళ్ళుగా ఉన్నారు. ఆయన యూత్ కి ఐకాన్ గా ఉన్నారు. పైగా పవన్ ఏమి చెప్పినా ఏమి చేసినా యూత్ ఆకర్షితులు అవుతారు. అలాంటి పవన్ బైక్ రేసింగ్ అన్న పదం వాడవచ్చా అన్న చర్చ వస్తోంది.

అది కూడా ఎంతో కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. బైక్ రేసింగ్ అన్నది ఒక వ్యసనంగా మారి ఎంతో మంది యువత ప్రాణాలు పోగొడుతోంది. అసలు ఈ దేశంలో రోడ్లు దారుణం. రేసింగ్ కి ఏ మాత్రం బాగుండేవి కావు. అయినా మితిమీరిన వేగంగా బైక్ రేసింగ్ చేస్తూ తన ప్రాణాలు పోగొట్టుకుంటూ ఎంతో మంది అమాయకుల ప్రాణాలు యువత తీస్తున్న సందర్భం ఉంది.

బైక్ రేసింగ్ అన్నది చట్టబద్ధం కాదు అన్నది తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ బైక్ రేసింగ్ విషయంలో చేసిన వ్యాఖ్యలే ఇపుడు చర్చకు తావిస్తునాయి. దాంతో బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో పవన్ ఉండి బైక్ రేసింగ్ అన్న పదం వాడవచ్చా అన్న చర్చ సాగుతోంది.

పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తన పార్టీ వారికి కీలక సూచనలు చేశారు. స్థానిక జనసేన అభిమానులు బైక్‌లపై నంబర్ ప్లేటుకు బదులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాయించుకొని తిరుగుతున్నారు. పవన్ కల్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకునేందుకు యువత పోటీ పడి మరీ తమ నెంబర్ ప్లేట్లు తీయించుకొని మరీ జనసేన ముద్రతో ఇలా రాయించుకుంటున్నారు.

అయితే దీని మీద పవన్ సరదాగా వారికి సూచనలు చేశారు. అలా చేయవద్దు అని అన్నారు. చట్టాన్ని అంతా గౌరవించాలని కోరారు. పోలీసులు ఆర్టీవో అధికారులకు సహకరించాలని కూడా ఆయన కోరారు. వాహనానికి ఒరిజినల్ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారని చివరికి అది కాస్తా తనమీదికి వస్తుందని సరదాగా పవన్ వ్యాఖ్యానించారు.

అంత వరకూ బాగానే ఉంది కానీ ఆ మీదట బైక్ రేసింగ్ ని మీద పవన్ చేసిన కామెంట్స్ మీద చర్చ సాగుతోంది.కావాలంటే బైక్ రేసింగ్‌లు పిఠాపురంలో తాను కొన్న తన రెండెకరాల స్థలంలో చేసుకోవచ్చని సరదాగా సూచించారు. కావాలంటే తన స్థలాన్ని రేసింగ్ లకు అనుకూలంగా మార్చుతానని చెప్పారు. అందరికి హెల్మెట్లు, సేఫ్ గార్డులు, ఇతర రక్షణ పరికరాలు కూడా అందుబాటులో ఉంచుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో అక్కడున్న జనం మొత్తం హోరెత్తేలా నినాదాలు చేశారు.

సరే ఇదంతా పవన్ మీద అభిమానం వారి మీద పవన్ కి అభిమానం అనుకున్నా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు ఇలా బైక్ రేసింగ్ లను ప్రోత్సహించడం ఏమిటి అన్న చర్చ వస్తోంది. బైక్ రేసింగులు ప్రాణాంతకం అని అంటున్నారు పిఠాపురం వరకూ పవన్ అరెంజ్ చేస్తాను అని అంటున్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా యువత ఇదే దారిలో పయనిస్తోంది. దాని వల్ల చెట్టంత కొడుకులు తల్లితండ్రులకు గర్భ శోకాన్ని మిగులుస్తున్నారు. బైక్ రేసింగ్ అన్నది ఒక వ్యసనంగా మారిపోయింది. అది యువతను పెడ తోవన పడేలా చేస్తోంది.

పైగా రోడ్లు అందుకు సహకరించవని తెలిసినా వాటి మీదనే రైడ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ బైకులను తెచ్చి సాధారణ రోడ్ల మీద నడుపుతున్నారు. దాంతోనే యువత అకాల మృత్యు వాత పడుతోంది అని అంటున్నారు పవన్ ఈ విషయంలో యువతకు బైక్ రేసింగులు వద్దే వద్దు అని చెబితే బాగుంటుంది అని అంటున్నారు. ఆయన చెబితేనే యువత బాగా వింటారు వాటిని ఆచరిస్తారు అని అంటున్నారు. పవన్ నిజంగా బాధ్యతగా ఉంటారు. ఆయన చట్టాలను గౌరవిస్తారు. ఆయన అభిమానులకు కూడా ఆయనే ఆదర్శంగా నిలవాలని చెప్పాలి. పవన్ కూడా అదే ఎప్పుడూ సూచించాలని అంటున్నారు.