Begin typing your search above and press return to search.

పవన్ ఢిల్లీ వెళుతున్నారా ?

ఇపుడిదే విషయమై టీడీపీ, జనసేనలో బాగా చర్చనీయాంశమవుతోంది. మూడు, నాలుగు రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   6 Feb 2024 4:30 AM GMT
పవన్ ఢిల్లీ వెళుతున్నారా ?
X

ఇపుడిదే విషయమై టీడీపీ, జనసేనలో బాగా చర్చనీయాంశమవుతోంది. మూడు, నాలుగు రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఎందుకంటే పొత్తుల విషయం ఫైనల్ చేయటానికట. బీజేపీ, జనసేన మిత్రపక్షాలని అందరికీ తెలిసిందే. అయితే బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే పవన్ టీడీపీతో కూడా పొత్తుపెట్టుకున్నారు. టీడీపీ-బీజేపీ వైరిపక్షాలని తెలిసిందే. బీజేపీ లేకుండా ఉత్త జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబునాయుడు సుముఖంగా లేరు. అందుకనే బీజేపీని కూడా మిత్రపక్షంగా చేసుకోవాలని చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు.

తొందరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోటీకి రెడీ అవుతోందని తెలుస్తోంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకి నేతల నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నది. సుమారుగా 3500 దరఖాస్తులు కూడా అందాయి. ఇదే సమయంలో పొత్తులో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ? పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవని డిసైడ్ చేసేందుకు చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. అయితే ఎంతసేపు భేటీ అయినా బీజేపీ పరిస్ధితిపై క్లారిటీ రావటంలేదన్న విషయం చర్చకు వచ్చిందట.

అందుకనే ఫైనల్ గా బీజేపీ ఆలోచన ఏమిటో తెలుసుకోమని పవన్ను చంద్రబాబే పురమాయించారని పార్టీవర్గాల సమాచారం. బీజేపీ కూడా కలిసొస్తుందన్న నమ్మకంతోనే పది అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ స్ధానాన్ని రిజర్వు చేసుంచారనే టాక్ వినబడుతోంది. ఏదేమైనా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ఆలోచన ఏమిటో తెలుసుకుని వస్తే రెండుపార్టీలు పొత్తుల అంశంపై ప్రకటన చేయచ్చని చంద్రబాబు చెప్పారట. అందుకనే మూడు, నాలుగు రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్ళే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఢిల్లీలో కుదిరితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేకపోతే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవ్వాలని పవన్ అనుకున్నారు. ఒకవేళ పవన్ కు ఎవరి అపాయిట్మెంట్ దొరక్కపోతే బీజేపీని వదిలేసి టీడీపీ, జనసేనలే సీట్ల సర్దుబాటు చేసుకుని ముందుకెళ్ళాలని కూడా ప్లాన్ బీ రెడీగా పెట్టుకున్నారట. బీజేపీ విషయం ఫైనల్ అయిన తర్వాత సీట్ల సంఖ్య, పోటీచేయబోయే నియోజకవర్గాలను అధికారికంగా ప్రకటించాలని ఇద్దరు అధినేతలు డిసైడ్ చేసుకున్నారట. కాబట్టి పవన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకున్నదనే చెప్పాలి.