పొత్తు సీట్లు ఎన్నో చెప్పేసిన పవన్....!
టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లకు తమ పార్టీని పోటీ చేయిస్తారు అన్నది చర్చగానే ఉంది.
By: Tupaki Desk | 8 Dec 2023 3:15 AM GMTఅవును పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో తెలియదు కానీ ఆయన తన స్పీచ్ లో యధాలాపంగా టీడీపీతో పొత్తు సీట్లు ఎన్నో చెప్పేశారు అని అంటున్నారు. ఇదంతా తెలియకుండానే అన్యాపదేశంగా పవన్ నోటి వెంట వచ్చిన మాటలుగా కూడా అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లకు తమ పార్టీని పోటీ చేయిస్తారు అన్నది చర్చగానే ఉంది.
జనసేనకు అసలు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది అన్నది కూడా మరో పెద్ద చర్చగా ఉంది. యాభై సీట్లకు తక్కువ కాకుండా జనసేన డిమాండ్ చేస్తుందని కూడా ఒక వైపు వినిపిస్తూంటే టీడీపీ అన్ని సీట్లు ఇవ్వందని మరో వైపు వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో గురువారం విశాఖ వచ్చిన పవన్ స్థానికంగా జరిగిన సభలో మాట్లాడుతూ టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నామో జనసైనికులకు వివరించారు. మనం సొంతంగా పోటీ చేస్తే కొన్ని సీట్లు గెలవవచ్చు కానీ ప్రభుత్వాన్ని స్థాపించలేమని అన్నారు.
పైగా మరోసారి వైసీపీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అందుకే పొత్తు పెట్టుకున్నామని టీడీపీకి జనసేన బీ టీం కానే కాదని పవన్ స్పష్టం చేశారు. టీడీపీతో కలసి నడిచే పార్టీగా ఆయన చెప్పారు. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్లలో మంచి మెజారిటీతో అభ్యర్ధులను గెలిపించాలని ఆయన కోరారు. భారీ మెజారిటీలే జనసేన బలానికి సూచికలు అని ఆయన అన్నారు.
రేపటి రోజున అలా గెలిచిన ముప్పయి ముప్పయి అయిదు సీట్లతో చట్ట సభలలో జనసేన తనదైన శైలిలో పాలన అందిస్తుందని ఆయన చెప్పారు. అంటే జనసేనకు ముప్పయి నుంచి ముప్పయి అయిదు సీట్లు ఇస్తారా అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. ఇక సీఎం అంటూ జనసైనికులు చేస్తున్న నినాదాలను కూడా పవన్ తప్పు పట్టారు.
మీరు సీఎం అంటే కాదు మనసులో ప్రేమను ఓట్లుగా మార్చాలి. అపుడే సీఎం అయ్యే వీలు ఉంటుంది. జనసేన టీడీపీ ప్రభుత్వంలో ఎవరు సీఎం అవుతారు అన్నది తానూ చంద్రబాబు కలసి కూర్చుని మాట్లాడుకుంటామని కూడా పవన్ చెప్పారు. తాను ఏదీ దాచేది లేదని అన్నీ జనసేన నేతలతో చెప్పే చేస్తాను అని ఆయన అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే జనసేనకు 35 సీట్ల దాకా టీడీపీ ఇస్తుందా లేక నలభై సీట్ల దాకా ఇస్తే అందులో మెజారిటీ గెలిస్తామని భావించి జనసేన ఈ నంబర్ చెబుతోందా అన్న దాని మీదనే డిస్కషన్ సాగుతోంది. అసలు జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీకి ఎంతమేరకు లాభం కలుగుతుంది అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ ప్రభుత్వం రావడం తధ్యమని అంటున్నారు.