Begin typing your search above and press return to search.

పవన్‌ కొత్త కార్యక్రమం.. టీ విత్‌ డిప్యూటీ సీఎం!

ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో డయేరియా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

By:  Tupaki Desk   |   11 July 2024 11:42 AM GMT
పవన్‌ కొత్త కార్యక్రమం.. టీ విత్‌ డిప్యూటీ సీఎం!
X

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేసి.. కూటమి అఖండ విజయంలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా, అడవులు, పర్యావరణం, శాస్త్రసాంకేతిక రంగాలు వంటి కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నారు.

తన శాఖలపై ఇప్పటికే అధికారులతో పవన్‌ సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. స్పష్టంగా అన్ని శాఖలకు కార్యాచరణను ఆయన నిర్దేశించారు. ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో డయేరియా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు.

ఇక అటవీ శాఖకు సంబంధించిన సమీక్ష సందర్భంగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో జూ పార్కుల అభివృద్ధిపైన పవన్‌ దృష్టి సారించారు. వీటిని అంతర్జాతీయ ప్రమాణాలను తీర్చిదిద్దాలని, పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో సామాజిక బాధ్యత కింద కార్పొరేట్‌ సంస్థలను కూడా భాగస్వాములను చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఇందులో భాగంగా పవన్‌ కళ్యాణ్‌ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. కార్పొరేట్‌ సంస్థలను భాగస్వాములను చేసేందుకు, వాటిని ఆకర్షించేందుకు ‘టీ విత్‌ డిప్యూటీ సీఎం’ కార్యక్రమానికి పవన్‌ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అదికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో మాత్రమే జూ పార్కులు ఉన్నాయి. వీటికి భారీ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా వాటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ రెండింటితోపాటు రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా జూ పార్కుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

ముఖ్యంగా పర్యావరణ హిత కార్యక్రమాలతో జూపార్కులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని పవన్‌ కోరారు. జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి పబ్లిక్‌ – ప్రైవేటు పార్టనర్‌ షిప్‌ (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చుకోవాలన్నారు.

పర్యాటకులను ఆకర్షించడం కోసం అరుదైన జంతువులను రాష్ట్రానికి తెప్పించాలని పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించారు. అలాగే ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటకులకు మంచి అనుభూతి దక్కేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.

కాగా టీ విత్‌ డిప్యూటీ సీఎం కార్యక్రమం కింద జంతువులను దత్తత తీసుకోవాలనుకునేవారితో పవన్‌ కలుస్తారు. ఈ కార్యక్రమం ద్వారా వారితో పవన్‌ మాట్లాడతారు. జూ పార్కుల అభివృద్ధికి వారి సహాయాన్ని కోరతారు. టీ విత్‌ డిప్యూటీ సీఎం కింద తొలుత విశాఖ, తిరుపతిల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఏపీని టూరిజం హబ్‌ గా చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని పవన్‌ పిలుపునిచ్చారు.