పవార్ల మద్య వార్...బారామతి ఎవరిది. ?
తనకు రాజకీయంగా గురువు తండ్రి అన్నీ ఆయనే. అటువంటి చిన్నాన్నను వ్యతిరేకించి తన సొంత రాజకీయం చూసుకున్నారు అజిత్ పవార్.
By: Tupaki Desk | 30 Oct 2024 4:14 AM GMTతనకు రాజకీయంగా గురువు తండ్రి అన్నీ ఆయనే. అటువంటి చిన్నాన్నను వ్యతిరేకించి తన సొంత రాజకీయం చూసుకున్నారు అజిత్ పవార్. దాంతో రగిలిపోయారు మరాఠా యోధుడు ఎన్సీపీ చీలిక వర్గం నేతగా మిగిలిన శరద్ పవార్. ఆయన ఇపుడు తన టైం వచ్చిందని భావిస్తున్నారు. అందుకే గురి చూసి మరీ షాక్ ట్రీట్మెంట్ అన్న కొడుక్కి ఇచ్చేశారు.
అజిత్ పవార్ పోటీ చేస్తున్న బారామతి అసెంబ్లీ సీటులో పోటీగా తన మనవడు యుగేంద్ర పవార్ ని రంగంలోకి దించారు. 32 ఏళ్ళ యుగేంద్ర పవార్ శరద్ పవార్ కి వరసకు మనవడు. ఆయన ఎవరో కాదు మహా రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్న అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస పవర్ కి కుమారుడు. అంటే కొడుకు వరస అన్న మాట.
బారామతి ఎన్సీపీకి కీలకమైన నియోజకవర్గం. కంచుకోటగా చెప్పాలి. అయితే ఎన్సీపీ ఇపుడు రెండుగా చీలిపోయింది. అజిత్ పవార్ ఒక వైపు శరద్ పవార్ మరో వైపు ఉన్నారు. ఇపుడు బారామతి నుంచి అజిత్ పవార్ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా యోగేంద్ర పవార్ ని దించడంతోనే శరద్ పవార్ తెలివి ఉందని అంటున్నారు.
దెబ్బకు దెబ్బ అన్నట్లుగా చిన్నాన్న అయిన తనను కొడుకు అయిన అజిత్ పవార్ దెబ్బ కొడితే కొడుకు వరస అయ్యే యోగేంద్ర పవార్ తోనే అజిత్ పవార్ కి దెబ్బ తినిపించాలని పవార్ పక్కా ప్లాన్ వేశారు. దీని మీద రగిలిపోయిన అజిత్ పవార్ కుటుంబాన్ని పెద్దాయన శరద్ పవార్ చీలుస్తున్నారు అని భారీ ఎత్తున ఫైర్ అయ్యారు.
అయితే దానికి శరద్ పవార్ కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చారు. అసలు కుటుంబాని చీల్చిందే అజిత్ పవార్ అని అన్నారు. నాలుగు సార్లు డిప్యూటీ సీఎం అయినా అజిత్ పవార్ లో అధికార ఆశలు చావలేదని నిప్పులు చెరిగారు. ఆయన రాజకీయం అంతా పదవుల కోసమే బంధాలు అనుబంధాలు అసలు లేవని కూడా దుయ్యబెట్టారు. తాను తన సోదరులు అందరి సహకారంతో రాజకీయాలు చేశానని గుర్తు చేసుకున్నారు. అజిత్ పవార్ తండ్రి అనంత పవార్ తో సహా అందరితోనూ తాను ఎంతో సన్నిహితంగా ఉంటూ వచ్చాను అని కూడా చెప్పారు.
కానీ అజిత్ పవార్ మూలంగా కుటుంబం పార్టీ రెండూ చీలిపోయాయని అన్నారు. ఎన్సీపీలో అజిత్ పవార్ కి ఎంతో విలువ ఇచ్చామని పదవులు ఆయనకే కట్టబెట్టామని తన సొంత కుమార్తె సుప్రియా సూలేని కూడా పక్కన పెట్టానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంత చేసినా అజిత్ పవార్ పదవి కోసమే బీజేపీతో జట్టు కట్టారని దాని వల్ల కుటుంబమే చీలిందని అన్నారు. ఇంత చేసిన అజిత్ పవార్ తన మీద నిందలు వేయడమేంటని పెద్దాయన గుస్సా అయ్యారు. మొత్తం మీద చూస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో బారామతి ఇపుడు అందరికీ ఆకర్షించే సీటుగా ఉంది. ఇక్కడ ఇద్దరు పవార్లలో ఎవరు గెలుస్తారో చూడాల్సి ఉంది.