డిజిటల్ చెల్లింపుల మాయ... కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది!
ఇటీవల కాలంలో నగదు రహిత చెల్లింపులు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 1 July 2024 8:30 AM GMTఇటీవల కాలంలో నగదు రహిత చెల్లింపులు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. భారీ మాల్స్ నుంచి చిన్న బండి మీద సరుకులు అమ్మేవారి వరకూ అందరూ ఈ నగదు రహిత చెల్లింపులు స్వీకరిస్తుండటంతో.. ఈ వినియోగం ఇటీవల భారీగా పెరిగింది. అయితే... ఈ డిజిటల్ చెల్లింపుల కారణంగా ప్రజలు గతంలో కంటే ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు తాజాగా తెరపైకి వచ్చిన ఆ అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది.
అవును... వేగంగా విస్తరిస్తున్న నగదు రహిత చెల్లింపుల ఫలితంగా వినియోగదారుల మధ్య వ్యయ ధోరణుల్లో మార్పులను తీసుకొచ్చాయని.. అందువల్ల ఈ డిజిటల్ చెల్లింపుల కారణంగా గతంలో కంటే ఎక్కువగా ప్రజలు డబ్బు ఖర్చు చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా... మెల్ బోర్న్ యూనివర్శిటీ, అడిలైడ్ యూనివరిశిటీల నుంచి ఒక బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాల్లో ఈ అధ్యయనం జరిగింది.
ఇందులో భాగంగా... ఏదైనా పేమెంట్ చేసినప్పుడు నోట్లు లేదా కాయిన్స్ తీసుకోవడంతో పోల్చినప్పుడు ప్రజలు కార్డ్స్ లేదా మొబైల్ ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు వారి బడ్జెట్ విషయంలో కాస్త ఉదారత ఉన్నట్లు నివేదిక గమనించింది. ఈ క్రమంలో ప్లాన్ చేసుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా నిరోధించటానికి ప్రజలు కార్డులకు బదులుగా నగదును తీసుకెళ్లాలని నివేదిక బృందం సిఫార్సు చేస్తోంది.
ఈ డిజిటల్ పేమెంట్స్ రాకముందు ప్రజలు ఏదైనా నోటు ఇచ్చినప్పుడు తిరిగి వచ్చే చిల్లర, నోట్లతో ఎంత డబ్బు ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారని, డిజిటల్ చెల్లింపుల్లో అది లేకపోవటం ఖర్చుల నియంత్రణలో విఫలమౌతున్నట్లు పేర్కొంది. దీనికి తోడు ప్రజలు స్టేటస్ సింబల్ గా కూడా ఈ తరహా పేమెంట్లపై ఆసక్తి చూపుతున్నారని.. విలాసవంతమైన ఉత్పత్తులపై డబ్బు ఖర్చు చేయడం ప్రారంభించారని ఈ అధ్యయనం వెల్లడించింది.