Begin typing your search above and press return to search.

పేటీఎంకు కష్టకాలం మొదలైనట్లే

పేటీఎంపై మనీ లాండరింగ్ ఆరోపణలతో పాటు కేవైసీ నిబంధనలు పాటించకపోవటం కూడా ఆర్ బీఐ కఠిన నిర్ణయాల వెనుక కారణంగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 7:30 AM GMT
పేటీఎంకు కష్టకాలం మొదలైనట్లే
X

ప్రముఖ పేమెంట్స్ బ్యాంక్ గా పేరున్న పేటీఎంపై తీవ్ర ఆరోపణలు రావటం తెలిసిందే. తరచూ ఏదో ఒక అంశంపై చర్చకు వచ్చే పేటీఎంపై తాజాగా వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. రిజర్వు బ్యాంక్ విధించిన ఆంక్షలతో పూర్తి కాలేదని.. ఆ మాటకు వస్తే ఇదే మొదలుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈడీ సైతం ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. తాజాగా వెలుగు చూస్తున్న వాదనలు నిజమైతే మాత్రం పేటీఎంకు ఎదురయ్యే కష్టాలు మరింత ఎక్కువని చెప్పక తప్పదు.

పేటీఎంపై మనీ లాండరింగ్ ఆరోపణలతో పాటు కేవైసీ నిబంధనలు పాటించకపోవటం కూడా ఆర్ బీఐ కఠిన నిర్ణయాల వెనుక కారణంగా చెబుతున్నారు. పేటీఎం వ్యాలెట్.. పేమెంట్స్ బ్యాంకింగ్ మధ్య కోట్లాది రూపాయిల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యన భారత రిజర్వు బ్యాంక్ పేటీఎం మీద పలు ఆంక్షలు విధించటం తెలిసిందే. అంతేకాదు.. ఫిబ్రవరి 29 వరకు గడువు ఇచ్చింది. ఆ లోపు రిజర్వు బ్యాంక్ కు పేటీఎం ఇచ్చే సమాధానం ఓకే అయితే ఫర్లేదు కానీ ఏమాత్రం తేడా వచ్చినా పేమెంట్స్ బ్యాంక్ సేవలు పూర్తిగా నిలిచిపోవటం ఖాయమంటున్నారు.

ఫిబ్రవరి 29 వరకు పేమెంట్స్ బ్యాంక్ సేవల్ని ఖాతాదారులు వినియోగించుకునే వీలుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు సంబంధించి కేవైసీ చేయని లక్షలాది ఖతాలు గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఒకే పాన్ తో వేలాది ఖాతాలు తెరిచిన ఉదంతాల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. కేవైసీ చేసిన ఖాతాల్లోనూ గరిష్ట పరిమితిని మించి కొన్నిసార్లు ఆయా ఖాతాల్లోకి లావాదేవీలు జరిగినట్లుగా తెలుస్తోంది.

షాకింగ్ నిజం ఏమంటే.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు సుమారు 35 కోట్ల ఈ వ్యాలెట్లు ఉండగా.. అందులో 31 కోట్ల ఖాతాలు నిద్రాణంలో ఉన్నాయని.. ఇందులో నాలుగు కోట్ల ఖాతాలు మాత్రమే వినియోగంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ ఖాతాలు కూడా జీరో బ్యాలెన్సులు.. లేదంటే స్వల్ప మొత్తాల్ని కలిగి ఉన్నాయని.. మనీ లాండరింగ్ కోసం వినియోగించే అవకాశం ఉందంటున్నారు. పేటీఎం బ్యాంక్ కేవైసీ ఉల్లంఘనల్ని 2021లోనే రిజర్వు బ్యాంక్ గుర్తించింది. ఆ వెంటనే సరిచేసుకోవాలన్న సూచన కూడా చేసింది. అయినా.. పేటీఎం పట్టించుకోలేదని.. ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారని చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి.