Begin typing your search above and press return to search.

జగన్ ప్రభుత్వం చేసిన పనికి చైనాలో అయితే ఉరి వేస్తారా?

బడ్జెట్ పై శాసనమండలిలో జరిగిన చర్చలో వైసీపీ నేతలు చేసిన విమర్శలు, సంధించిన ప్రశ్నలపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు.

By:  Tupaki Desk   |   19 Nov 2024 6:52 AM GMT
జగన్  ప్రభుత్వం చేసిన పనికి చైనాలో అయితే ఉరి వేస్తారా?
X

ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలకు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లో చేస్తున్న కేటాయింపులకు ఏమాత్రం పొంతన లేదని.. సూపర్ సిక్స్ హామీలు వెరవేరుతాయని ఆశగా చూసిన ప్రజలకు బడ్జెట్ నిరాశ కలిగించిందని, వాటికి సరైన కేటాయింపులు లేవని.. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యానారాయణ విమర్శించారు!

తల్లికి వందనం కింద రూ.18 వేలు ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు మాత్రం అమలు చేయడంలేదని.. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని.. వీటి వివరాలను బడ్జెట్ లో ఎందుకు ప్రకటించలేదని బొత్స ప్రశ్నించారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... బడ్జెట్ పై శాసనమండలిలో జరిగిన చర్చలో వైసీపీ నేతలు చేసిన విమర్శలు, సంధించిన ప్రశ్నలపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ఇందులో భాగంగా.. బడ్జెట్ లో తల్లికి వందనం కోసం రూ.6,484.75 కోట్లను కేటాయించామని.. వీటిని బీసీ, ఈబీసీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, క్రీస్టియన్ వెల్ఫేర్ కింద కేటాయించామని తెలిపారు.

ఇదే సమయంలో... అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారని తెలిపారు. ఇదే సమయంలో పెన్షన్ రూ.4 వేలకు పెంచామని.. అన్న క్యాంటీన్లను పునరుద్దరించామని.. పంచాయతీలకు రూ.1,450 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.300 కోట్లు ఇచ్చామని తెలిపారు. అనంతరం వైసీపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు.

ఇందులో భాగంగా... గత ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. అకౌంట్ల వివరాలు కాగ్ కు దొరక్కుండా గోప్యత పాటించిందని మండిపడ్డారు. ఇలాంటి పనులు చేసినందుకు చైనాలో అయితే ఉరి వేస్తారంటూ మంత్రి కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు!